ఆర్టికల్ 370 తర్వాత జమ్మూకాశ్మీర్‌లో కేవలం ఇద్దరు మాత్రమే ఆస్తులు కొనుగోలు చేశారు: కేంద్రం
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌లో కేవలం ఇద్దరు ఇతరులు మాత్రమే ఆస్తులు కొనుగోలు చేశారని కేంద్ర హోంమంత్రిత్వశాఖ లోక్‌సభలో వెల్లడించింది. 2019, ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందినవారు కూడా ఇక్కడ ఆస్తులు, భూమి కొనుగోలు చేసేందుకు అవకాశం లభించిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత గత రెండున్నరేళ్లలో కేవలం ఇద్దరు ఇతరులు మాత్రమే జమ్మూకాశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేశారని పార్లమెంటులో హోంమంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఆగస్టు 2019 నుంచి కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్‌లో ఆ ప్రాంతానికి చెందని ఇద్దరు వ్యక్తులు అక్కడ ఆస్తులు కొనుగోలు చేశారని జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం తెలిపింది.

స్టార్ లేని ప్రశ్నకు సమాధానంగా లోక్‌సభలో హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు జమ్మూకాశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. ప్రభుత్వం కూడా ఇందుకు పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.
కాగా, 2019 ఆగస్టు 5 న, భారత రాజ్యాంగంలోని 370 అధికరణం ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా పరిమిత స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాటు, జమ్మూ కాశ్మీరు రాష్ట్ర హోదాను రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ కాశ్మీరును శాసనసభ కలిగి ఉండే కేంద్రపాలిత ప్రాంతం గాను (డిల్లీ లాగా), లడఖ్‌ను సభ లేని కేంద్రపాలిత ప్రాంతంగానూ ఏర్పాటు చేసింది.
అయితే, జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు జమ్మూకాశ్మీర్‌కు చెందిన రాజకీయ పార్టీలతో సమావేశం కూడా నిర్వహించింది.
ఇది ఇలావుండగా, ఆర్టికల్ 370 గురించి..
జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం చేసిన ఏర్పాటే ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ వల్ల రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలకు వర్తించిన నిబంధనలేవీ జమ్మూ కశ్మీర్‌కు వర్తించవు. దీని ప్రకారమే 1965 వరకూ ఆ రాష్ట్రానికి సీఎం బదులు ప్రధాని, గవర్నర్ స్థానంలో ప్రెసిడెంట్ ఉండేవారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడ ఆస్తులు కొనేందుకు వీలు లేదు. ఆర్టికల్ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆర్టికల్‌ను గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించారు. ఆయన అంతకు ముందు జమ్మూ కశ్మీర్ రాజు మహారాజా హరి సింగ్ వద్ద దివాన్‌గా పని చేశారు.
రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల వ్యవహారాలు మినహా మిగతా చట్టాల అమలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. ఆర్టికల్ 370 ప్రకారం బయటి వ్యక్తులు జమ్మూ కశ్మీర్లో భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేయడం కుదరదు. యుద్ధం, విదేశీ దురాక్రమణ సమయంలోనే కేంద్రం ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించగలదు. అంతర్గత ఘర్షణలు తలెత్తినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేనిదే ఎమర్జెన్సీ విధించే అవకాశం లేదు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ ఉన్నాయి. రాష్ట ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి ఆరేళ్లు. కాగా, ఆర్టికల్ 370 రద్దుతో ఇవన్ని రద్దయిపోయాయి.
జమ్మూకాశ్మీర్‌లో తొలిసారి రాహుల్ పర్యటన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ తొలిపారి పర్యటించారు. ఇక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు . ముందుగా గందర్ బాల్ జిల్లాలోని ఖీర్ భవానీ ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత హజరత్ బాల్ మసీదుకు వెళ్లారు. అనంతరం షేక్ హంజా మఖ్దూం సమాధితోపాటు గురుద్వారాను సందర్శించారు. ఇక దైవ కార్యక్రమాల తర్వాత నేరుగా శ్రీనగర్ కు వెళ్లారు రాహుల్ గాంధీ. అక్కడ జమ్మూ కాశ్మీర్ పీసీసీ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని ప్రారంభించారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
బీజేపీ సర్పంచ్ దంపతుల దారుణ హత్య
జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో బీజేపీకి చెందిన సర్పంచ్ గులాం రసూల్ దర్‌ను, ఆయన భార్య జవహర్ భానును ఉగ్రవాదులు కాల్చి చంపారు. కుల్గాం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కూడా అయిన గులాం రసూల్ కొంతకాలంగా టెర్రరిస్టుల హిట్ లిస్టులో ఉన్నట్టు తెలిసింది. నిన్న జరిగిన ఈ ఘాతుకంలో ఈ దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. ఈ దాడి వెనుక లష్కరే తోయిబా హస్తం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తమ అద్దె ఇంటిలోనే వీరు ఉగ్రవాదుల కాల్పులకు గురైనట్టు వారు చెప్పారు. గత ఏడాది జరిగిన జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల్లో గులాం రసూల్ పోటీ చేసి ఓడిపోయారు. కుల్గాం లోని రేద్వానీ ప్రాంత నివాసి అయిన ఈయనకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని తెలిసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆయనకు ఎలాంటి భద్రత సౌకర్యం లభించలేదనే ఆరోపణలున్నాయి. కాగా, గత శనివారం ఇదే కుల్గాం జిల్లాలో ఓ పోలీసును టెర్రరిస్టులు కాల్చి చంపారు.












Click it and Unblock the Notifications