యూపీలో భజరంగ్‌భళీ ఒక్కరే! మాఫియా బాహుబలులంతా జైల్లోనే: యోగిపై అమిత్ షా ప్రశంసలు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తికాగా, మరో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం యూపీలోని బహ్రెయిచ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మాఫియా లేదు.. యూపీలో భజరంగభళీ మాత్రమే: అమిత్ షా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీపడలేదని అన్నారు అమిత్ షా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను సక్రమంగా నిర్వహించారని, గూండాలు, మాఫియాలను లేకుండా చేశారని ప్రశంసించారు. ఇప్పుడు రాష్ట్రంలో బాహుబలలు లేరని. ఎక్కడైనా భజరంగభళి మాత్రమే ఉన్నారని సమాజ్‌వాదీ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెరుగైన పరిస్థితిని నల్ల కద్దాలు పెట్టుకున్న అఖిలేష్ యాదవ్ చూడలేకపోతున్నారని అమిత్ షా చురకలంటించారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే బీజేపీ.. లా అండ్ ఆర్డర్‌ను గాడిలో పెడతామని చెప్పిందని, ఆ హామిన తూ.చ తప్పకుండా నెరవేర్చిందన్నారు అమిత్ షా. రాష్ట్రంలో మాఫియాను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉక్కుపాదంతో అణిచివేశారని ప్రశంసించారు.

టెలిస్కోప్ పెట్టి చూసినా.. మాఫియా బాహుబలులు కనిపించరు
ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో టెలిస్కోప్ పెట్టి చూసినా.. బాహుబలులు కనిపించరని.. ఒక్క భజరంగభళి మాత్రమే ఎక్కడ చూసిన కనిపిస్తారని కేంద్ర హోమంత్రి అమిత్ షా అన్నారు. ఆజంఖాన్, అతిఖ్ అన్సారీ, ముక్తార్ అన్సారీలు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రజలను ప్రశ్నించగా.. వారంతా జైల్లో ఉన్నారనే స్పందన వచ్చింది. ఒకవేళ మీరు ఇప్పుడు తప్పుచేసి సైకిల్ గుర్తుకు ఓటు వేసిని ఎస్పీని గెలిపించారంటే.. మాఫియా నాయకులు జైల్ల నుంచి బయటికి వచ్చి మరింత ఇబ్బందులకు గురిచేస్తారని ప్రజలను హెచ్చరించారు. మరోసారి బీజేపీకి అధికారం ఇచ్చారంటే నేరస్తులంతా జైల్లో ఉంటారని.. ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారని అమిత్ షా స్పష్టం చేశారు. యోగి ఆదిత్యనాథ్, బీజేపీ మాత్రమే ఈ పనిచేయగలుగుతుందని అన్నారు.

అఖిలేష్ నల్లకద్దాలతో చూస్తున్నారు అందుకే..: అమిత్ షా
నల్ల కద్దాలు పెట్టుకున్నవారికి లోకమంతా చీకటిగానే కనిపిస్తుందని.. అఖిలేష్ యాదవ్ ను ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్యానించారు. అఖిలేష్ యాదవ్ తమ కుటుంబానికి తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. పార్టీ పేరులోనే సమాజ్‌వాదీ ఉంది కానీ, వారికి మాత్రం వారి 45 మంది కుటుంబసభ్యులే సమాజమని ఎద్దేవా చేశారు. వారికే అన్ని పదవులు కావాలని అన్నారు.
Recommended Video

మోడీ, యోగితోనే పేదలు, మహిళల అభివృద్ధి, భద్రత: అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో దేశం, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, దీన్ని ఎవరూ ఆపలేరని అమిత్ షా స్పష్టం చేశారు. పేద ప్రజలు, మహిళల సంక్షేమం, భద్రత, అభివృద్ధి కోసం మరోసారి యూపీలో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ప్రజలకు అమిత్ షా పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన నాల్గు దశల ఎన్నికల్లోనే ఎస్పీ, బీఎస్పీలు తుడిచిపెట్టుకుపోయాయని అన్నారు. 300లకుపైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధించేందుకు పునాదులు పడ్డాయన్నారు. త్వరలో జరగబోయే పోలింగ్ దశల్లో బీజేపీ విజయం ఖాయమైపోతుందన్నారు. ఫిబ్రవరి 27న ఐదో దశ పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications