వారు మాత్రమే మనదేశంలో ఉండాలి: సత్రం కాదంటూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
పుణె: నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్‌సీ)ని వ్యతిరేకించే వారిపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఆర్సీని వ్యతిరేకించే వాళ్లంతా మనదేశాన్ని 'ధర్మశాల(ధర్మసత్రం)' చేయాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వారు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు.

సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నవారిని ఉద్దేశించి మాట్లాడుతూ..
ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ఈ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పౌరులకు శాశ్వత గుర్తింపు కార్డులు జారీ చేయకుండా ప్రపంచంలో ఏ దేశమూ లేదని ఆయన అన్నారు. దేశ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై విపక్షాలు నిరసనలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
మనదేశం ఏమైనా ధర్మ సత్రమా? ఎవరైనా వచ్చి ఇక్కడే ఉండిపోవడానికి అని కేంద్రమంత్రి ప్రశ్నించారు. అయితే, దేశంలో ఉండాలనుకునేవారు భారత్ మాతాకీ జై అని అనాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇక్కడి చట్టాలను గౌరవించలేని వారు ఇక్కడ ఉండేందుకు అనర్హులని అన్నారు.












Click it and Unblock the Notifications