వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకం..పేరు సార్థకం: సంకీర్ణ సర్కార్ కు దినదినగండం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక. పేరులోనే నాటకం ముడిపడి ఉంది. దీనికి అనుగుణంగానే కర్ణాటకలో రాజకీయ నాటకం కొద్దిరోజులుగా జోరుగా సాగుతోంది. కొద్దిరోజులుగా అని చెప్పుకోవడం కంటే.. హంగ్ ఏర్పడినప్పటి నుంచీ ఇదే తంతు అని చెప్పుకోవడమే బెటర్. దాదాపు అన్ని రంగాల్లో, ప్రత్యేకించి- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్న కర్ణాటకలో అవాంఛనీయ రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రంలో హంగ్ అంటూ ఏర్పడితే ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనడానికి కర్ణాటక ఓ రోల్ మోడల్. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు తరహాలో సాగుతోంది పాలన. హంగ్ అసెంబ్లీ ఏర్పడి, ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత బలం లేకపోతే..కుక్కలు చింపిన విస్తరే అవుతుంది పాలన. ఇప్పుడక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

అధికారం చేతికి అందేంత దూరంలో బీజేపీ..

అధికారం చేతికి అందేంత దూరంలో బీజేపీ..

గత ఏడాది మేలో కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) ప్రభుత్వం ఏర్పడిన క్షణం నుంచీ ఇందులో ఏ మాత్రం తేడా రాలేదు. కాంగ్రెస్-జేడీఎస్ లకు బొటాబొటి మెజారిటీ ఉండటం వల్ల ఏర్పడిన చిక్కు ఇది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు అదనంగా మూడు సీట్లు మాత్రమే కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో ఉన్నాయి. ఆ మూడు సీట్లను తమ వైపు తిప్పుకోగలిగితే- ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేయగలమనే ధీమా, ధైర్యం బీజేపీది. అందుకే- సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే `ఆపరేషన్ కమల`ను ఆరంభించారు బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు.

కాస్త గట్టిగా కష్టపడితే అధికారం తమ వశం అవుతుందనే ఆశ బీజేపీ నాయకుల్లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ కు ఎనిమిది సీట్ల దూరంలో ఆగిపోయిందా పార్టీ. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 112 మంది సభ్యుల బలం అవసరం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దక్కింది 104 సీట్లే. కాంగ్రెస్ కు 79, జేడీఎస్ కు 37 మంది సభ్యుల బలం ఉంది. అత్యధిక స్థానాలను గెలుచుకున్న పార్టీగా బీజేపీ ఏర్పడినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్, జేడీఎస్ కూటమి కట్టాయి. మ్యాజిక్ ఫిగర్ ను అందుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

బొటాబొటి మెజారిటీతో సర్కార్ ను నెట్టుకుంటూ..

బొటాబొటి మెజారిటీతో సర్కార్ ను నెట్టుకుంటూ..

తక్కువ సీట్లే అయినప్పటికీ.. తమకు మద్దతు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి పదవిని జేడీఎస్ కు వదులుకుంది కాంగ్రెస్. ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకుంది. సంకీర్ణ ప్రభుత్వానికి ఉన్నది బొటాబొటి మెజారిటీ. పైగా అసంతృప్తులు అధికం. ఈ పాయింట్ ను పట్టుకున్న ప్రతిపక్ష నేత యడ్యూరప్ప.. ఆపరేషన్ కమలను ఆరంభించారు. అసంతృప్త ఎమ్మెల్యేలకు గాలం వేశారు. దీని ప్రభావం కాంగ్రెస్, జేడీఎస్ లపై తీవ్రంగా ఉంది. ప్రత్యేకించి- కాంగ్రెస్ పై. కాంగ్రెస్సే ఎందుకంటే- అసంతృప్త ఎమ్మెల్యేలు ఆ పార్టీలోనే కావాల్సినంత మంది దొరుకుతారు.

పైగా జేడీఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇష్టపడని వారు, 38 స్థానాలు మాత్రమే తెచ్చుకున్న కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడాన్ని జీర్ణించుకోలేని వారు చాలామందే ఉన్నారు కాంగ్రెస్ లో. అందుకే- అలాంటి వారందరినీ లైనులో పెట్టింది బీజేపీ. దీనికోసం క్యాంపు రాజకీయాలకు తెర తీసింది. ఆపరేషన్ కమల.. కాంగ్రెస్ కు కంటిమీద కునుకు లేకుండా చేసింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? పార్టీలోనే ఉన్నారా? లేక ఫిరాయించారా? అని ఏరోజుకారోజు లెక్క చూసుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది హస్తం పార్టీ. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్ నగేష్ (ముళబాగిలు), ఆర్ శంకర్ (రాణిబెన్నూరు) ఇదివరకే గుడ్ బై చెప్పారు. వారిలో శంకర్ అటవీశాఖ మంత్రిగా పనిచేశారు.

కాంగ్రెస్ ఒక్కటే కాదు మిత్రపక్షమైన జేడీఎస్ గానీ, ప్రతిపక్ష బీజేపీ గానీ ఇందుకు మినహాయింపేమీ కాదు. ప్రతిపక్షంలో ఉన్న తామే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించగా, అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఇంకెంతగా చెలరేగిపోతుందనే భయం బీజేపీలో ఉంది. అందుకే- మూడు పార్టీలు కూడా క్యాంపు రాజకీయాల మీద ఆధారపడ్డాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రభుత్వం కొంటోందని బీజేపీ ఆరోపిస్తోంది. తమ ఎమ్మెల్యేలను గుర్ గావ్ లోని రిసార్ట్ లో ఉంచింది. కాంగ్రెస్ కూడా క్యాంపు రాజకీయాల్లో భాగంగా, కొంతమందిని ముంబైకి, మరికొంత మందిని బెంగళూరు శివార్లలోని రిసార్టుకూ తరలించింది.

ఆపరేషన్ కమల..ఆడియో టేపులతో బట్టబయలు

ఆపరేషన్ కమల..ఆడియో టేపులతో బట్టబయలు


వీలైన ప్రతీసారీ యడ్యూరప్ప అధికార సంకీర్ణ ప్రభుత్వంలోని అసంతృప్త ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూనే వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి బలం చేకూర్చుతూ జేడీఎస్ కు చెందిన గుర్మిట్ కల్ ఎమ్మెల్యే నాగనగౌడకు 50 కోట్ల రూపాయలను ఇస్తామని, పార్టీ ఫిరాయించాలని యడ్యూరప్ప ఆయనతో మాట్లాడిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్ వెలుగులోకి వచ్చింది. స్పీకర్ రమేష్ కుమార్ ను కూడా 50 కోట్ల రూపాయలతో బుక్ చేసుకున్నామంటూ బీజేపీ ఎమ్మెల్యేలు తమతో మాట్లాడారంటూ నాగనగౌడ కుమారుడు శరణ గౌడ ముఖ్యమంత్రి కుమారస్వామి సమక్షంలోనే వెల్లడించారు.

ఆ బ్యాచ్ కు ఆయనే పెద్ద దిక్కు

ఆ బ్యాచ్ కు ఆయనే పెద్ద దిక్కు

కుమారస్వామి మంత్రి వర్గం నుంచి బయటికి వచ్చిన కాంగ్రెస్ శాసనసభ్యుడు రమేష్ జార్కిహోళి అసంతృప్త ఎమ్మెల్యేకు పెద్ద దిక్కుగా మారినట్లు చెబుతున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేల్లో తనకంటూ ఓ వర్గాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారని, ఉద్దేశపూరకంగా పార్టీ అధిష్ఠానానికి కంట్లో నలుసుగా మారారనీ అంటున్నారు. తాజాగా జార్కిహోళితొో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. జార్కిహోళి (గోకాక్), బీ నాగేంద్ర (బళ్లారి గ్రామీణం), మహేష్ కుమటళ్లి (అథణి), ఉమేష్ జాదవ్ (చించోళి)లపై వేటు వేసింది పీసీసీ. ఈ నలుగురూ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కంప్లి ఎమ్మెల్యే గణేష్ కూడా ప్రస్తుతం సస్పెన్షన్ లోనే ఉన్నారు. రిసార్ట్ లో జరిగిన గొడవలో గణేష్ తన తోటి ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దీనితో పీసీసీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.

మంత్రివర్గం నుంచి తప్పించారని అసంతృప్తితో రగిలిపోతున్నారు జార్కిహోళి. దీనికితోడు- సస్పెన్షన్ కు గురికావడం పుండు మీద కారం చల్లినట్టయింది. తనతో పాటు మిగిలిన ముగ్గురినీ తీసుకుని ఆయన పార్టీ ఫిరాయించడం అంటూ జరిగితే.. కుమారస్వామి సర్కార్ ప్రమాదంలో పడినట్టే. సస్పెన్షన్ కు గురైన ఈ నలుగురితో బీజేపీ టచ్ లోకి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నలుగురితో పాటు సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చిన ఇద్దరు స్వతంత్రులు నగేష్, శంకర్ లను కలుపుకొంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందనేది విశ్లేషకుల అంచనా.

English summary
Congress-JDS co alliance government facing major threat from Operation Lotus made by State BJP leaders. BJP leaders also not step down from their Operation. BJP wants form a government in Karnataka with the help of Congress rebel MLAs. Karnataka PCC taken stringent action against four of MLAs, who skipped legislature party meeting yesterday. The four MLAs suspended from the party. BJP eyes on the four law makers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X