2024లో ఉమ్మడిగా పోటీ- విపక్షాల ప్రకటన-పట్నా మీటింగ్ లో కాంగ్రెస్ వర్సెస్ ఆప్-రాహుల్ కీలక హామీ..
2024లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసే పోటీ చేయాలని ఇవాళ బీహార్ రాజధాని పట్నాలో సమావేశమైన విపక్ష పార్టీలు ప్రకటించాయి. తమ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా వచ్చే ఎన్నికల్లో మాత్రం కలిసి అవగాహనతో పోటీ చేయాలని నిర్ణయించాయి. పట్నాలో నిర్వహించిన విపక్షాల కీలక భేటీకి హాజరైన విపక్షాల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం ఉమ్మడి ప్రకటన చేశారు.
అన్ని పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించాయని, అయితే వివరాలను ఖరారు చేసేందుకు హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో వచ్చే నెలలో మరో సమావేశం జరుగుతుందని ఈ భేటీ నిర్వహించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు.16 విపక్ష పార్టీలు హాజరైన ఈ భేటీ నాలుగు గంటలపాటు జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఉమ్మడి మీడియా సమావేశానికి మాత్రం హాజరుకాలేదు. విమాన ప్రయాణాల కారణంగా వారిద్దరు ప్రెస్ మీట్ కు హాజరు కాలేదని నితీశ్ తెలిపారు.

మరోవైపు విపక్షాల భేటీ తర్వాత మాట్లాడిన ఆప్ నేతలు.. కాంగ్రెస్ ఢిల్లీపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ను బహిరంగంగా వ్యతిరేకించే వరకూ భవిష్యత్తులో జరిగే విపక్ష భేటీల్లో భాగస్వాములు కాబోమని బాంబుపేల్చారు. అలాగే విపక్షాల సమావేశంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆర్డినెన్స్ అంశంపై కాంగ్రెస్ వైఖరి అడగగా.. ఖర్గే.. బీజేపీతో ఒప్పందం కారణంగా కాంగ్రెస్ వైఖరి తీసుకోవడం లేదన్న ఆప్ ప్రధాన అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఆరోపణను ప్రస్తావించారు.
మరోవైపు విపక్షాల భేటీలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. తోటి విపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయంలో పట్టువిడుపులు ప్రదర్శిస్తామని కీలక హామీ ఇచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తాము బలంగా ఉన్న చోట్ల మద్దతివ్వాలని ప్రాంతీయ పార్టీలు కోరుతున్న నేపథ్యంలో రాహుల్ ఈ ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications