మణిపూర్ ఘటనపై చర్చకు పట్టు: మోడీ 30సెకన్ల సానుభూతిపై పార్లమెంట్ లో గందరగోళం!!
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండవ రోజు ప్రారంభమైన వెంటనే మధ్యాహ్నం 12 గంటల వరకు పార్లమెంట్ వాయిదా పడింది. మణిపూర్ ఘటన పై పార్లమెంట్ లో మంటలు కొనసాగుతున్నాయి. మణిపూర్ ఘటనపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.
మణిపూర్‌లో ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రధానంగా ఈ అంశాన్ని తీసుకొని పార్లమెంటు సమావేశాలలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ తో పాటు ప్రత్యర్థి పార్టీలు మూకుమ్మడిగా దాడిని పెంచాయి. విపక్ష ఎంపీలు పార్లమెంటు బయట కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మణిపూర్ ఘటన మీద పార్లమెంట్‌లో తప్పకుండా చర్చ జరగాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. స్టేట్‌లో, సెంట్రల్‌లో బిజెపి ప్రభుత్వాలే ఉన్నాయని తెలిపారు. ఈ ఘటన వల్ల ఇండియా పరువు పోయిందని, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ డిమాండ్ చేశారు.
ఇలా ఉంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ 1800 గంటల మౌనం తర్వాత మణిపూర్ ఘోరం పై 30 సెకండ్ల సానుభూతి తెలిపారని ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నాయి. ఇంత దారుణమైన ఘటనపై ప్రధాని మోడీ స్పందన ఇదేనా అంటూ మండిపడుతున్నారు. మణిపూర్లో అల్లర్లపై మొదటి నుంచి కేంద్రం అలసత్వం వహించినదని, హింస ప్రారంభమైన నెలరోజుల తర్వాత హోం మంత్రి రాష్ట్రంలో పర్యటించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

మణిపూర్‌లో మహిళల నగ్న వీడియోలు, వారిపై జరిగిన హింస దేశాన్ని సిగ్గుపడేలా చేశాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మోడీ స్పందనపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిమోడీ... ఇది దేశానికి అవమానం కలిగించే విషయం మాత్రమే కాదు ఈ సమస్య మణిపూర్‌లోని మహిళలకు తగిలిన తీవ్రమైన గాయం అన్నారు. హింసను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ పార్లమెంట్ లో దీనిపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.
అయితే మణిపూర్ ఘటనపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై నేడు లోక్సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడే అవకాశం ఉంది. మరి మణిపూర్ ఘటన ఎన్ని రోజులు సభలో ప్రకంపనలు సృష్టిస్తుందో అన్న అనుమానం వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications