రాజ్యసభ నుంచి టీడీపీ, వైసీపీ మినహా విపక్షాల బాయ్ కాట్-ఎంపీల సస్పెన్షన్ రద్దు చేయనందుకు...
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ వ్యవహారం కలకలం రేపుతూనే ఉంది. కొన్ని రోజులుగా 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తేయాలని కోరుతూ కేంద్రం, రాజ్యసభ ఛైర్మన్ తో చర్చలు జరుపుతున్న విపక్షాలు... అందుకు ఒప్పుకోకపోవడంతో ఇవాళ సభా కార్యకలాపాలను బాయ్ కాట్ చేశాయి. అయితే ఇందులో టీడీపీ, వైసీపీ ఎంపీలు మాత్రం ఎన్డీయే సర్కార్ కు మద్దతుగా సభలోనే ఉండిపోయాయి.
ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా రాజ్యసభ కార్యకలాపాల్ని బహిష్కరించిన వారిలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, టీఆర్ఎస్, ఆప్, లెఫ్ట్ ఎంపీలు ఉన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ మేరకు సభా కార్యకలాపాల్ని అడ్డుకుని నిరసన తెలిపిన ఎంపీలు.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ను ఎంపీల సస్పెన్షన్ ఎత్తేయాలని కోరారు. లేకపోతే సభను బాయ్ కాట్ చేసి వెళ్లిపోతామని హెచ్చరించాయి. అయినా రాజ్యసభ ఛైర్మన్ పట్టించుకోకపోవడంతో విపక్షాలు బాయ్ కాట్ చేసి బయటకు వచ్చేశాయి. అనంతరం సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.

అంతకుముందు విపక్ష ఎంపీల సస్పెన్షన్ వ్యవహారాన్ని లేవనెత్తిన విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గేను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అడ్డుకున్నారు. ప్రతీరోజూ ఇదే విషయాన్ని మీరు లేవనెత్తుతున్నారని ఆక్షేపించారు. మీరు తప్పు చేస్తున్నారు. పది రోజులుగా సభను నడవనీయడం లేదన్నారు. మీరు ఈ విషయంపై నన్ను బలవంత పెట్టలేరని వెంకయ్య ఖర్గేకు తెలిపారు. అనంతరం ఇతర విపక్షాలతో కలిసి ఖర్గే ఆందోళన చేపట్టారు. చివరికి సభ్యులు బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు.
మరోవైపు ఇప్పటికే కేంద్రానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న టీడీపీ,వైసీపీ ఎంపీలు రాజ్యసభలో విపక్ష సభ్యుల బాయ్ కాట్ కు దూరంగా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ కు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు సైతం విపక్ష సభ్యులకు మద్దతుగా బాయ్ కాట్ చేసినా టీడీపీ, వైసీపీ మాత్రం కేంద్రానికి మద్దతుగా రాజ్యసభలోనే ఉండిపోవడం విశేషం. దీంతో రాజ్యసభ కార్యకలాపాల్లో టీడీపీ, వైసీపీ తొలిసారి కేంద్రానికి బహిరంగ మిత్రపక్షాల్లా కనిపించాయి.












Click it and Unblock the Notifications