లోక్ సభలో ప్రియాంక గాంధీ రచ్చ రచ్చ
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ (MGNREGA) స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) బిల్లు, 2025'ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. గ్రామీణాభివృద్ధిలో గత ప్రభుత్వాల కన్నా తాము ఎంతో ఎక్కువ చేశామని, గ్రామీణులకు పక్కా ఇళ్లు మొదలుకుని అనేక రకాల సౌకర్యాలను కల్పించామని పేర్కొన్నారు.
ఉపాధి హామీ స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లు టేబుల్ అయిన వెంటనే నిరసనలకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహాత్మా గాంధీ పేరును చరిత్ర పుటల్లో నుంచి చెరిపివేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సంవత్సరంలో 100 రోజుల పాటు గ్రామీణులకు ఖచ్చితంగా ఉపాధిని కల్పించడానికి ఉద్దేశించిన ఈ బిల్లును స్క్రాప్ చేయాలనుకోవడం అవివేకమని మండిపడ్డారు.

ఈ నిరసనలకు కాంగ్రెస్ లోక్ సభ సభ్యురాలు కాంగ్రెస్ ప్రియాంక గాంధీ సారథ్యాన్ని వహించారు. ఉపాధి హామీ చట్టం రద్దు, మహాత్మా గాంధీ పేరు తొలగింపు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మరింత పరిశీలన కోసం ఈ బిల్లును పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపాలని డిమాండ్ చేశారు. మహాత్ముడి ఫొటోలను ప్రతిపక్ష సభ్యులు సభలో ప్రదర్శించారు. జాతిపిత పేరు తొలగింపును వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు. గట్టిగా నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.
జాతిపిత పేరు మార్చడం పట్ల ప్రభుత్వానికి ఎందుకు అంత ఆసక్తి చూపుతోందని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో MGNREGA చట్టం ఏకగ్రీవంగా పార్లమెంట్ లో ఆమోదం పొందిందని గుర్తు చేశారు. అప్పట్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు ఏ ఒక్క పార్టీ కూడా వ్యతిరేకించలేదని, ఇది అందరి ఆమోదంతో చట్టంగా రూపాంతంరం చెందిందని అన్నారు. ఉపాధిని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచుతున్నామన్న ప్రభుత్వం వాదనలను ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.
ఇప్పటివరకు 90 శాతం నిధుల చెల్లింపు బాధ్యత కేంద్రానిదేనని, తాజా ప్రతిపాదనల ప్రకారం.. ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్రాలకు బదిలీ చేస్తోందని ప్రియాంక గాంధీ అన్నారు. పేద రాష్ట్రాలు ఈ మొత్తాన్ని భరించలేవని, చివరికి ఈ పథకం కుప్పకూలుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పథకం పేరు మార్పు ముసుగులో దీన్ని రద్దు చేయాలనుకుంటున్నారుని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, సహా పలువురు సీనియర్ నాయకులు నిరసనలకు దిగారు.












Click it and Unblock the Notifications