Today in Parliament: అజయ్ మిశ్రపై చర్యలకు డిమాండ్ - బయోలాజికల్ డైవర్సిటీ బిల్లు ప్రతిపాదన..!!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈ రోజున సభలో ప్రధానంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర పై చర్యలకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి సిట్ నివేదిక ఆధారంగా చర్యలు కోసం లోక్ సభను బుధవారం స్థంభింప చేసాయి. ఈ రోజు సైతం ఇదే అంశం పైన ప్రతిపక్షాలు సమావేశాలను అడ్డుకొనే అవకాశం కనిపిస్తోంది. ఇక, తాజాగా అజయ్ మిశ్ర మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో రైతులపై చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఆయన కుమారుడు ఆశిష్ మిశ్ర అరెస్టయిన విషయం తెలిసిందే.
ఈ ఘటన ప్రణాళికతో చేసిన కుట్రే అని సిట్ నిన్న వెల్లడించింది. దీనిపై ఆయన్ను ప్రశ్నించగా.. విలేకరులపై చిందులు తొక్కారు. దుర్భాషలాడుతూ వారిని నెట్టేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక, వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా అజయ్ మిశ్రను కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులు ఆదేశించారు. దీంతో..ఆయన పైన చర్యలు తీసుకుంటారనే ప్రచారం మొదలైంది. ఇక, సభలో నిర్దేశించిన బిజినెస్ ప్రకారం ముందుగా ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. ఆ తరువాత మంత్రులు తమ శాఖలకు చెందిన పేపర్లను సభ ముందు ఉంచనున్నారు.

స్టాండింగ్ కమిటీ రిపోర్టుల తరువాత కేంద్ర ప్రభుత్వం బయో డైవర్సిటీ బిల్లును ప్రతిపాదించనుంది. భూపేందర్ యాదవ్ ది బయోలాజికల్ డైవర్సిటీ సవరణ బిల్లు, 2021 ను సభలో ప్రవేశ పెట్టనున్నారు. దీంతో పాటుగా ధరల పెరుగుదల పైన బుధవారం జరగాల్సిన చర్చను ఈ రోజుకు వాయిదా వేసారు. రాజ్యసభలోనూ సభ్యుల సస్పెన్షన్ పైన రచ్చ కంటిన్యూ అవుతోంది. సభ్యులు క్షమాపణ చెబితేనే సభలోకి అనుమతిస్తామని ఛైర్మన్ తేల్చి చెప్పారు. దీంతో..ఈ సమస్య పరిష్కారం కోసం శరద్ పవార్ రాజ్యసభ ఛైర్మన్ తో మాట్లాడే బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు సభలో అజయ్ మిశ్రా పైన చర్యల దిశగా ప్రతిపక్షాలు డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications