పావులు కదుపుతున్న శశికళ: మోడీకి పన్నీరు సెల్వం లేఖ
ఓ వైపు దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళ పార్టీ పగ్గాలు చేపట్టే దిశగా, అలాగే అధికారం దిశగా పావులు కదుపుతున్న సమయంలో ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
చెన్నై: ఓ వైపు దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళ పార్టీ పగ్గాలు చేపట్టే దిశగా, అలాగే అధికారం దిశగా పావులు కదుపుతున్న సమయంలో ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రధానికి లేఖ రాయడం ఇది తొలిసారి.
ఓ వైపు శశికళ పావులు కదుపుతుండగా మరోవైపు, తమిళ జాలర్ల మనసులు గెలుచుకునేందుకే పన్నీరు సెల్వం ఈ లేఖ రాశారని అంటున్నారు. జయ మృతి తర్వాత తమిళ రాజకీయాలు వేడెక్కాయి. శశికళ తన మెదకుడుకు పదును పెడుతున్న సమయంలో మోడీకి పన్నీరు రాసిన లేఖ తమిళనాట చర్చనీయాంశంగా మారింది.
కచ్చతీవు ద్వీపంలో నిర్వహించే సెయింట్ ఆంటోనీ చర్చి ప్రతిష్ఠిత వేడుకలకు హాజరయ్యేలా తమిళనాడు జాలర్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. భారత, శ్రీలంక సరిహద్దుల్లోని ఈ దీవిని 1974లో శ్రీలంకకు అప్పగిస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక్కడికి వెళ్లాలంటే కేంద్ర విదేశాంగ శాఖ అనుమతులు తీసుకోవడం తప్పనిసరి.

తమిళనాడు జాలర్లు కచ్చతీవులో నూతనంగా నిర్మించిన చర్చి ప్రతిష్ఠిత వేడుకలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారనీ, భక్తుల సంఖ్యపై ఆంక్షలు లేకుండా అనుమతులు ఇచ్చేలా విదేశాంగ శాఖను ఆదేశించాలని పన్నీర్ సెల్వం తన లేఖలో కోరారు.
కనీసం వందమందికి అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు ముఖ్యకార్యదర్శి లేఖ రాస్తే కేవలం 20 మందికే విదేశాంగ శాఖ అనుమతిచ్చిందని ప్రధాని మోడీ దృష్టికి తెచ్చారు. ఇరు దేశాల జాలర్ల సంప్రదాయాన్ని కాపాడేలా ఇక్కడ నిర్మించే చర్చిని కూడా సంయుక్తంగా చేపట్టాలని జయలలిత గతంలో లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 7న జరగాల్సిన కచ్చతీవు ఆలయ ప్రతిష్ఠ వేడుకలను జయలలిత మృతికి సంతాపంగా వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications