• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అప్పుడు అనాథగా ఆత్మహత్యాయత్నం: ఇప్పుడు సీఎం అయ్యారు

|

ఈటానగర్: ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన కలిఖో పుల్ జీవితం ఒక స్పూర్తి పాఠంగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన తన జీవితంలో పడని కష్టం లేదు. ఎదుర్కోని సమస్యా లేదు. ఆయన జీవితం అనాథగా మొదలైంది. ఆత్మహత్యతో అంతం కావాల్సిన ఆ జీవితం మలుపు తిరిగి ఆత్మవిశ్వాసంతో ఒక రాష్ట్ర అత్యున్నత పదవి ముఖ్యమంత్రి పీఠం కూర్చుంది.

విశేషమేంటంటే ఆయన పేరులోనే ఉంది ఆయన జీవిత సారాంశం. కలిఖో పుల్ అంటే మంచి భవిష్యత్ అని అర్థం కావడం గమనార్హం. అతని తల్లి ఎంత ప్రేమతో ఆయనకీ పేరు పెట్టారు. అయితే మంచి భవిష్యత్ కోసం.. దాదాపు సగం జీవితం ఆయన కష్టాలతోనే గడిపేశారు.

పుల్ జీవిత గమనాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే.. పుల్‌ 13నెలల చిన్నారిగా ఉన్నప్పుడు తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. మరో ఐదేళ్లకు అల్లారు ముద్దుగా చూసుకుంటూ వచ్చిన తండ్రి కూడా అనారోగ్యంతో చనిపోయాడు. అలా ఆరేళ్ల వయసులో తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని అనాథలా మిగిలాడు పుల్‌. చుట్టుపక్కల వాళ్లెవరూ పట్టించుకోలేదు. చుట్టాలెవరూ దగ్గరకు తీయలేదు.

 Orphan, Carpenter, Chowkidar and Now CM: Inspiring Story of Arunachal's Kalikho Pul

కాగా, ఎక్కడికెళ్లాలో తెలీక దిక్కుతోచని స్థితిలో ఉన్న పుల్‌ని పక్క ఊళ్లొ ఉండే అతడి అత్తయ్య తీసుకెళ్లింది. అదీ అతడి మీద ప్రేమతోనో, చదివించి పెద్ద చేయాలనో కాదు. ఇంట్లో పనులకు పనికొస్తాడని కావడం గమనార్హం. దీంతో ఆరేళ్ల వరకూ పుల్‌ బడి మొహాన్ని చూడలేదు. ప్రతిరోజూ అడవికెళ్లడం, కట్టెలు కొట్టుకొని రావడమే అత్తయ్యవాళ్లింట్లో అతని పని.

పుల్‌ కట్టెలు తీసుకొస్తేనే అతడికి ఆ రోజు అన్నం దొరికేది. ఆటల్లో పడో, ఆరోగ్యం బాలేకో అడవికి వెళ్లలేకపోతే ఆ పూటకి పస్తుంచేది పుల్ అత్తయ్య. దీంతో చదువుకీ, అందమైన బాల్యానికీ దూరమైన పుల్.. అడవి చెట్ల మధ్యే పెరిగాడు. పదేళ్ల వయసొచ్చేసరికి పక్క ఊళ్లొని 'హవాయి క్రాఫ్ట్‌ సెంటర్‌'లో వడ్రంగి పని నేర్చుకోవడానికి వెళ్లాడు. అక్కడ రోజుకి రూపాయిన్నర స్టైపెండ్‌ అందేది. అత్తయ్య కుటుంబం మీద ఆధారపడకుండా ఆ డబ్బులతోనే ఎలాగోలా సొంతంగా జీవించడం మొదలుపెట్టాడు.

పనిలో నైపుణ్యం సాధించే కొద్దీ స్టైపెండ్‌ కూడా పెరుగుతూ వచ్చింది. దీంతో అక్కడే ఉంటూ కుర్చీలూ మంచాలతో మొదలుపెట్టి రెండేళ్ల పాటు చెక్కతో రకరకాల కళాకృతులు తయారు చేసేవరకు నైపుణ్యం పెంచుకున్నాడు. అతడి ప్రతిభ ఆ శిక్షణా కేంద్రం నిర్వాహకులనూ ఆకర్షించింది. అక్కడుండే ట్యూటర్‌ సెలవు మీద వెళ్లడంతో శిక్షణ పూర్తయ్యాక పుల్‌కే మూడు నెలల పాటు జీతమిచ్చి శిక్షకుడిగా పనిచేసే అవకాశం కల్పించారు.

పుల్‌ పనిచేస్తోన్న హవాయి క్రాఫ్ట్‌ సెంటర్‌కు ఎక్కువగా ఆర్మీ, పారా మిలటరీ, ప్రభుత్వ అధికారులు వస్తుండేవారు. వాళ్లందరూ హిందీ, ఇంగ్లిష్‌లోనే మాట్లాడేవాళ్లు. పుల్‌కి అస్సమీస్‌ తప్ప మరో భాష రాదు. వినియోగదారులు చెప్పేది తనకు అర్థమవ్వాలంటే హిందీ కానీ, ఇంగ్లిష్‌ కానీ నేర్చుకోవాల్సిందే అనుకున్నాడు. ఈ నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో పదకొండేళ్ల వయసులో ఓ నైట్‌ స్కూల్‌లో ఒకటో తరగతిలో చేరాడు పుల్‌. ఇతర సబ్జెక్టులతో తనకు అవసరం లేదనీ, హిందీ ఇంగ్లిష్‌ మాత్రమే బాగా నేర్పించమనీ టీచర్లని అడిగేవాడు.

 Orphan, Carpenter, Chowkidar and Now CM: Inspiring Story of Arunachal's Kalikho Pul

కాగా, ఓరోజు పుల్‌ చదువుకుంటున్న స్కూల్‌కి ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ కమిషనర్‌ తనిఖీకి వచ్చారు. అందరికంటే పెద్దవాడు, చురుగ్గా ఉంటాడు కాబట్టి వాళ్లని ఆహ్వానించే బాధ్యతని స్కూల్‌ పుల్‌కే అప్పగించింది. స్కూల్లో చదువు ఎలా చెబుతున్నారంటూ మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన పుల్‌, చివర్లో ఓ ప్రార్థన గీతాన్నీ పాడాడు. చెక్క పని నేర్చుకునే పిల్లాడు అంత బాగా మాట్లాడటం, పాడటం డిప్యూటీ కమిషనర్‌ దృష్టిని ఆకర్షించింది.

వెంటనే అతడి గురించి ఆరా తీశారు. విషయం తెలుసుకొని ఆయనే చొరవ తీసుకుని పుల్‌ని డే స్కూల్‌కి మార్పించి, నేరుగా ఆరో తరగతిలో అడ్మిషన్‌ ఇప్పించాడు. అదే పుల్‌ జీవితానికి కీలక మలుపు. పొద్దున చదువుకుంటూనే రాత్రుళ్లు హస్తకళల కేంద్రంలో శిక్షకుడిగా పనిచేసేవాడు.

నిరాశ, నిస్పృహలతో ఆత్మహత్యా యత్నం

తరగతులు మారే కొద్దీ పుల్‌కి ఖర్చులూ ఎక్కువయ్యాయి. అతడు పనిచేసే చోట వచ్చే డబ్బులు బతకడానికీ చదువుకీ సరిపోయేవి కావు. దీంతో తెలిసిన వాళ్ల ద్వారా అతికష్టమ్మీద ఓ ప్రభుత్వ కార్యాలయంలో నైట్‌ వాచ్‌మన్‌గా ఉద్యోగం సంపాదించాడు. సాయంత్రం 5గంటలకు ఆ కార్యాలయంలో జాతీయ జెండాను అవనతం చేయడం, ఉదయం ఐదింటికి జెండా ఎగరేయడం, ఆ మధ్యలో కార్యాలయానికి కాపలా కాయడం అతడి పని. నెలకు రూ.212 జీతం వచ్చేది.

రాత్రి ఉద్యోగం, పొద్దున స్కూలుతో రోజుకి నాలుగైదు గంటలకు మించి నిద్ర ఉండేది కాదు. ఆ జీతం కూడా సరిపోకపోవడంతో ఖాళీ సమయంలో సిగరెట్లూ, పాన్‌లూ అమ్ముతూ ఎంతో కొంత సంపాదించుకునేవాడు. కానీ, దురదృష్టం పుల్‌ని మరోసారి దెబ్బకొట్టింది. అనుభవిస్తోన్న పేదరికానికి తోడు కడుపులో అల్సర్ల సమస్య అతడిని మరింత బాధపెట్టింది. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక ఆరేళ్లపాటు అలానే భరించాడు.

కానీ, చివరికి ఆపరేషన్‌ చేయించుకోకుంటే సమస్య పూర్తిగా ముదిరిపోయే పరిస్థితి వచ్చింది. డబ్బుల కోసం బంధువుల్ని ఆశ్రయిస్తే ఒకరు రెండు రూపాయలూ, మరొకరు ఐదు రూపాయలూ చేతిలో పెట్టారు. ఆ క్షణం తనకంటూ ఎవరూ లేరనీ, తాను బతికి సాధించేది ఏమీ లేదనీ పుల్‌కి అనిపించింది. ఆత్మహత్య చేసుకుందామని దగ్గర్లోని ఓ నదిమీదున్న బ్రిడ్జి పైకెక్కాడు. కానీ, చుట్టూ మనుషులు ఉండటంతో దూకడానికి అతడికి ధైర్యం సరిపోలేదు. దాదాపు 40 నిమిషాలు అక్కడే ఎదురు చూశాక, చనిపోవడం తనవల్ల కాదనిపించి వెనుతిరిగాడు.

 Orphan, Carpenter, Chowkidar and Now CM: Inspiring Story of Arunachal's Kalikho Pul

ఆత్మవిశ్వాసంతో ముందడుగు

జీవితంలో డబ్బు ఎంత అవసరమో బంధువుల ప్రవర్తనతో పుల్‌కి అర్థమైంది. ఎలాగైనా ఆపరేషన్‌ చేయించుకోవాలనీ, బతికి సాధించి తానేంటో నిరూపించాలనీ అనుకున్నాడు. నేరుగా తనని స్కూల్లో చేర్పించిన డిప్యూటీ కమిషనర్‌ నేగి దగ్గరకు వెళ్లి తన పరిస్థితి వివరించాడు. అతడిని చూసి జాలిపడ్డ నేగి చేతిలో రూ. 2,500 పెట్టి పంపించాడు. ఆ డబ్బుతో చికిత్స చేయించుకున్న పుల్‌.. తర్వాత ముఖ్యమంత్రికి అభ్యర్థన పెట్టుకొని, దాన్నుంచి వచ్చిన మెడికల్‌ గ్రాంట్‌తో నేగి డబ్బులు తిరిగిచ్చేసి జీవితాన్ని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాడు.

క్రమంగా పుల్‌ ఆరోగ్యం మెరుగు పడింది. పుల్‌కి వెదురుతో ఫెన్సింగ్‌ నిర్మించడం, గుడిసెలు అల్లడం బాగా వచ్చు. అదే విషయాన్ని తనకు పరిచయమున్న వాళ్లందరికీ చెబుతూ, ఏదైనా అవసరముంటే కబురుపెట్టమనేవాడు. అలా ఓ జూనియర్‌ ఇంజినీర్‌ ఇంటిచుట్టూ వెదురుతో ఫెన్సింగ్‌ నిర్మించే పని దొరికింది. మూడ్రోజుల పాటూ ఒక్కడే అడవికి వెళ్లి వెదురుని నరుక్కొని వచ్చి ఆ నిర్మాణాన్ని పూర్తిచేశాడు. దానికి అతడికి రూ. 400 దక్కింది. ఆ తర్వాత 600రూపాయలకు ఓ గుడిసె నిర్మించే పని దొరికింది.

ఇలా ఒకదాని తర్వాత ఒక పని చేసుకుంటూ చదువును కొనసాగించాడు. అలా చదువుకుంటూనే ఓ చిన్నస్థాయి కాంట్రాక్టర్‌గా మారాడు. పనికీ, చదువుకీ మధ్య పుల్‌ నిద్రనీ.. వ్యక్తిగత జీవితాన్నీ త్యాగం చేశాడు తప్ప పుస్తకాలని ఏ రోజూ పక్కకి పెట్టలేదు. ఓవైపు ఇంటర్‌ చదువుతూనే మరోపక్క తాను సంపాదించుకున్న డబ్బులతో నాలుగు సెకండ్‌ హ్యాండ్‌ ట్రక్కులనీ కొని వాటిని అద్దెకి తిప్పేవాడు.

చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా

చిన్న కాంట్రాక్టర్‌గా మొదలుపెట్టి డిగ్రీకి వచ్చేనాటికి పక్కా ఇళ్లు నిర్మించే కాంట్రాక్టులూ చేసే స్థాయికి ఎదిగాడు పుల్‌. చదువూ, కాంట్రాక్టులకి తోడు కాలేజీ విద్యార్థి సంఘానికి జనరల్‌ సెక్రటరీ బాధ్యతలతో పుల్‌ క్షణం తీరికలేకుండా గడిపేవాడు. డిగ్రీ చివరి సంవత్సరానికి వచ్చేనాటికి పుల్‌ మూడు లక్షల ఖర్చుతో ఓ సొంత ఇంటినీ నిర్మించుకున్నాడు.

అల్సర్‌ నుంచి బయటపడ్డ నాటి నుంచీ అతడి సంపాదనలో సగం సొంతానికీ, మిగతా సగం పేద రోగుల వైద్యానికీ కేటాయిస్తూ వస్తుండేవాడు. కాంట్రాక్టర్‌గా మారాక ప్రభుత్వాస్పత్రులకు వెళ్తూ రోగుల అవసరాలు తెలుసుకొని ఆర్థిక సాయం చేసేవాడు. అలా క్రమంగా అతడి ఔదార్యం గురించి ఆనోటా ఈనోటా అందరికీ తెలియడం మొదలుపెట్టింది. విద్యార్థి సంఘం నాయకుడిగానూ మంచి పేరు సంపాదించాడు.

డిగ్రీ పూర్తయ్యాక, లా కాలేజీలో చేరాడు. మరోవైపు కాంట్రాక్టర్‌గా ఎదుగుతూ 37 ప్రభుత్వ భవనాలూ, డజనుకు పైగా బ్రిడ్జిలూ, వందల కిలోమీటర్ల రోడ్లూ నిర్మించాడు. అతడు నిర్మించిన భవనాల నాణ్యత నచ్చడంతో ప్రభుత్వం టెండర్లు లేకుండానే అతడికి పనులను అప్పజెప్పేది.

చిన్న వయసులోనే స్థానికంగా పుల్‌ సంపాదించిన పేరు కాంగ్రెస్‌ పార్టీ దృష్టిని ఆకర్షించింది. అతడు పార్టీలో సభ్యుడుకాకపోయినా తమ తరఫున పోటీ చేయాలంటూ ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది. ప్రభుత్వ కాంట్రాక్టులనే ప్రజా సేవగా భావిస్తూ చేస్తూ వచ్చాడు పుల్‌. అలాంటిది నేరుగా ప్రభుత్వం తరఫునే పనిచేసే అవకాశం వచ్చేసరికి ఆనందంగా ఒప్పుకున్నాడు. ఎన్నికల్లో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు.

22ఏళ్లకే వరించిన మంత్రి పదవి

తొలి ఎన్నికల్లో పుల్‌ అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించి, పాతికేళ్లకే మంత్రిగా మారాడు. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రత్యర్థులపైన 90శాతం కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతోనే గెలుస్తూ వచ్చాడు. మంత్రిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాడు. 'ఒకప్పుడు ఆపరేషన్‌ కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి అపాంగ్‌ రెండువేల ఐదొందలు గ్రాంట్‌ ఇచ్చారు. అదే వ్యక్తి ఈ రోజు నా పెళ్లికి అతిథిగా హాజరవడాన్ని నమ్మలేకపోతున్నా' అంటూ పుల్‌ తన పెళ్లిలో కన్నీటి పర్యంతమయ్యారు.

23ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 22ఏళ్లు పుల్‌ మంత్రిగా పనిచేశారంటేనే ప్రజలకూ అధికార పక్షానికీ ఆయనపైన ఎంత నమ్మకమో అర్థమవుతుంది. ఈటానగర్‌లోని పుల్‌ అధికార నివాసం ఓ ఆస్పత్రినే తలపిస్తుంది. నిత్యం ఆయన సాయం కోరి వచ్చే రోగులు ఉండటానికి ఆయన ఇంట్లోనే కొన్ని గదులు కేటాయించారు.

ఇరవై నాలుగ్గంటలూ అక్కడ వైద్యులను అందుబాటులో ఉంచి వచ్చిన వాళ్లను పరీక్షించే ఏర్పాట్లు చేశారు. ఇరవై ఏళ్లుగా రాజకీయంగానూ బలపడుతూ వచ్చిన పుల్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో అనిశ్చితి కారణంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనకు ఇటీవలే తెరదించారు. ఇతర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రానికి తొమ్మిదో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

తనకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదని చెప్పే పుల్.. కష్టమే దేవుడని అంటారు. తన జీవితమే ఇందుకు నిదర్శనమని చెప్తుంటారు పుల్. ఇక నుంచి 24గంటలపాటు ప్రజా సేవలోనే ఉంటానని ఆయన చెబుతున్నారు. ఒక మంచి ముఖ్యమంత్రి నాయకత్వంలో అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆశిద్దాం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hailing from a border village in remote Anjaw district of Arunachal Pradesh, Kalikho Pul trekked a long way in his political career to became the eighth chief minister of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more