పౌరుల వరుస హత్యలు: భద్రతాదళాల అదుపులో 700 మందికిపైగా ఉగ్రవాద సానుభూతిపరులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు ఇటీవల ఆరు రోజుల వ్యవధిలో ఏడుగురు పౌరులను బలిగొన్న విషయం తెలిసిందే. హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని స్థానికంగా పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దేశ రాజధానిలో కూడా ఈ హత్యలకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో లోయలో సంఘ విద్రోహ కార్యకలాపాల కట్టడికి భద్రతా దళాలు భారీ ఎత్తున తనిఖీలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో శ్రీనగర్‌లో దాదాపు 70 మంది యువకులను అదుపులోకి తీసుకున్నాయి. జమ్మూకాశ్మీర్‌వ్యాప్తంగా మొత్తం 700 మందిని నిర్బంధించినట్లు సమాచారం.

మరోవైపు స్థానిక పోలీసులు సైతం.. రాళ్ల దాడులకు పాల్పడినవారు, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక, కేంద్రం ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉన్నతాధికారిని ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల సమన్వయానికి శ్రీనగర్‌కు పంపింది. స్థానికంగా ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆదివారం అనంతనాగ్, శ్రీనగర్, కుల్గాం, బారాముల్లా తదితర 16 చోట్ల దాడులు ప్రారంభించింది.
Recommended Video
లష్కరే తోయిబా తదితర ఉగ్రసంస్థల దన్నుతో లోయలో అశాంతికి కారణమవుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో వాయిస్ ఆఫ్ హింద్, ది రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్‌ఎఫ్) కేసుల దర్యాప్తులో భాగంగా ఈ సంస్థ సభ్యుల ఇళ్లపై దాడులు చేపడుతోంది. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన ఉగ్ర దాడుల్లో మొత్తం 28 మంది పౌరులు మృతి చెందినట్లు జమ్మూ- కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఇటీవల ఇద్దరు అధ్యాపకులను(ఒకరు హిందువు, మరొకరు సిక్కు) ఉగ్రవాదులు దారుణంగా హతమార్చారు. మొదట ఉపాధ్యాయులను వరుసలో నిలబెట్టి పేర్లను అడిగిమరీ వీరిద్దరిని మాత్రమే చంపి మిగితా వారిని వదిలేశారని స్థానికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications