వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పడయప్ప: పర్యటకులతో సరదాగా ఫోటోలకు పోజులిచ్చే ఈ ఏనుగుకు ఇప్పుడు ఎందుకు చెడ్డపేరు వస్తోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పడయప్ప

దక్షిణాది రాష్ట్రం కేరళలో ''పడయప్ప’’ చాలా ఫేమస్.

చేటల్లాంటి చెవులతో అటుగా వచ్చే పర్యటకులతో ఆడుతూ ఈ అడవి ఏనుగు మంచి పేరు తెచ్చుకుంది. దీని దంతాలు కూడా పొడవుగా ఆకట్టుకునేలా కనిపిస్తాయి.

కేరళ ప్రజలతో పడయప్పకు దశాబ్దాల అనుబంధముంది.

మున్నార్ పట్టణ ప్రాంతంలో ఇది తిరుగుతూ కనిపించేది. దీన్ని అందరూ ''జెంటిల్ జెయంట్’’ అని పిలుచుకుంటారు. పడయప్ప ఎవరిపైనా దాడిచేసి గాయపరచినట్లు వార్తలు కూడా ఎప్పుడూ లేవు. అయితే, అప్పుడప్పుడు ప్రజల ఇళ్ల మధ్యకు వచ్చి ఆహార పదార్థాలను స్వాహా చేయడం, రాత్రిపూట పొలాల మీద పడటం లాంటివి మాత్రం చేసేది.

1999 నాటి బ్లాక్‌బస్టర్ సినిమా ''పడయప్ప’’ పేరునే దీనికి పట్టారు. ఈ సినిమాలో రజినీకాంత్ పేరు పడయప్ప. ఇది తెలుగులో నరసింహాగా విడుదలైంది.

ఇక్కడకు వచ్చే పర్యటకులు కూడా పడయప్పను చాలా ఇష్టపడుతుంటారు. ఈ భారీ ఏనుగుతో తీసుకున్న ఫోటోలు ఇప్పటికీ చాలా సోషల్ మీడియా అకౌంట్లలో కనిపిస్తాయి.

ప్రస్తుతం 50 ఏళ్లకు పైబడిన ఈ ఏనుగు కొన్ని నెలలుగా చెడ్డ పేరు తెచ్చుకుంటోంది.

ఒకప్పుడు మనుషుల పక్కన హాయిగా తిరిగే ఈ ఏనుగు ఇప్పుడు కాస్త భిన్నంగా ప్రవర్తిస్తోంది. మనుషులు కనిపిస్తే చిర్రెత్తినట్లు దూకుడుగా కదులుతోంది.

పడయప్ప

గత జనవరిలో ఒక ట్రక్కు, ఒక ఆటో ముందు అద్దాలను పడయప్ప బద్దలుకొట్టింది. మరోవైపు బీన్స్ పొలంలోకి వెళ్లి అక్కడి పంట మొత్తాన్ని స్వాహాచేసింది.

పడయప్ప హింసాత్మకంగా ప్రవర్తిస్తున్న ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయని, దీని ప్రవర్తన పూర్తిగా మారినట్లు కనిపిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

అయితే, ఈ ఏనుగుకు మదం ఎక్కుతూ ఉండొచ్చని కొందరు అంటున్నారు. కొన్నిసార్లు మగ ఏనుగుల్లో కొన్ని హార్మోన్ స్థాయిలు పెరుగుతుంటాయి. ఫలితంగా అవి దూకుడుగా, హింసాత్మకంగా ప్రవర్తిస్తుంటాయి. దీన్నే మదం ఎక్కడంగా చెబుతుంటారు.

అయితే, తన ఆవాసాన్ని క్రమంగా మనుషులు ఆక్రమించడంతో దీని ప్రవర్తనా ఇలా మారుతోందని కొందరు నిపుణులు వివరిస్తున్నారు.

''మదం ఎక్కినప్పటికీ, మనం రెచ్చ గొడితేనే ఏనుగులు హింసాత్మకంగా ప్రవర్తిస్తాయి’’అని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్‌లోని ఆసియా ఏనుగుల నిపుణుల బృందం సభ్యుడు డా. పీఎస్ ఈశా చెప్పారు.

''మనుషులు ఎలాంటి అవాంతరాలు సృష్టించని, సువిశాల ఆవాసం పడయప్పకు కావాలి. హాయిగా తిరగడానికి, తినడానికి దానికి ఎలాంటి అడ్డూ ఉండకూడదు. ఇలాంటి ఏనుగులకు రక్షణ అవసరం. వీటి ఆవాసం తగ్గిపోకుండా చర్యలు తీసుకోవాలి’’అని ఈశా వివరించారు.

పడయప్ప

మనుషులు-జంతువుల మధ్య ఘర్షణ పరిస్థితులు భారత్‌లో తరచూ కనిపిస్తుంటాయి. జంతువుల ఆవాస ప్రాంతాలు తగ్గిపోవడంతో ఆహారం, ఆశ్రయం కోసం అవి ప్రజలు జీవించే ప్రాంతాల్లోకి వస్తుంటాయి. ఒక్క కేరళలోనే గుంపు నుంచి తప్పిపోయిన కొన్ని ఏనుగులు 2018 నుంచి 2022 మధ్య 105 మందిని హతమార్చాయి.

జనవరి నెలలోనే పాలక్కడ్ జిల్లాలో మనుషులపై దాడి చేసిన ఒక ఏనుగును అటవీ అధికారులు పట్టుకున్నారు. అయితే, దీని శరీరంపై డజనుకుపైగా పెల్లెట్‌ గాయాలు కనిపించాయి. బహుశా ఎయిర్ గన్‌లతో దీనిపై కాల్పులు జరిపారు. నెలలపాటు ఇది తమ గ్రామాల్లో విధ్వంసం సృష్టించిందని, ఒక వ్యక్తిని కూడా చంపేసిందని స్థానికులు చెబుతున్నారు.

అయితే, పడయప్ప అలాంటికాదని దాని ఆవాసానికి పరిసరాల్లో జీవించేవారు అంటున్నారు.

''మా ఇంటికి పడయప్ప మూడుసార్లు వచ్చింది. అరటిపళ్లు, వెదురుకర్రలను తింది. అది చాలా మంచిది’’అని మున్నార్ పట్టణంలో జీవించే లలిత మణి చెప్పారు.

''ఒకసారి మా పొలంలో దాదాపు పది అరటిచెట్ల వేర్లతోపాటు పడయప్ప బయటకులాగింది. కాసేపు అక్కడే నిలబడింది, తర్వాత అరటిపళ్లను తినేసి, ప్రశాంతంగా వెళ్లిపోయింది’’అని మణి వివరించారు.

''నాకు తన మీద ఎప్పుడూ కోపం వచ్చేది కాదు. పాపం అది మూగజీవి. దానికి ఆకలి వేసినప్పుడు మాత్రమే వచ్చేది. ఎవరికీ హాని చేసేది కాదు’’అని ఆమె చెప్పారు.

పడయప్ప

మున్నార్ చుట్టు పక్కల అటవీ ప్రాంతంలోనే పయడప్ప ఎక్కువగా కనిపించేది. కొన్నిసార్లు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా అలా వెళ్లివచ్చేది.

''పడయప్ప చాలా హుందాగా నడుస్తుంది. దాని ఎడమ దంతం కుడి దంతం కంటే కాస్త పెద్దగా ఉంటుంది’’అని 2014 నుంచి పడయప్ప కదలికలను కనిపెడుతున్న వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ హెడ్లీ రెంజిత్ చెప్పారు.

రెండు నెలలకు కనీసం ఒకసారైనా పడయప్ప తనకు కనిపించేదని రెంజిత్ వివరించారు. ''నేను కాస్త దూరం నుంచే ఫోటోలు తీసేవాడిని. అది నన్ను అసలు పట్టించుకునేదికాదు. కానీ, ఒక్కోసారి కెమెరాకు ఫోజులు ఇస్తున్నట్లుగా కనిపించేది. నేను చూసిన ఏనుగుల్లో మనుషులతో అత్యంత ప్రేమగా నడుచుకునేది ఇదే’’అని ఆయన వివరించారు.

చుట్టుపక్కల ఉండేవారితో అప్పుడప్పుడు సరదాగా ప్రవర్తించడంతో పయడప్ప లోకల్ సెలబ్రిటీగా పేరుండేది.

ఇది రోడ్డు దాటేటప్పుడు స్థానికులు తమ వాహనాలను కాసేపు ఆపేవారు. కొంతమంది దీనితో సెల్ఫీలు కూడా తీసుకునేవారు. మరోవైపు అప్పుడప్పుడు తమ దుకాణాలకు వచ్చి ఆహారం స్వాహా చేసినా తమకు ఎలాంటి అభ్యంతరమూ ఉండేదికాదని, ఎందుకంటే తను వస్తే, కస్టమర్లు కూడా పెరుగుతారని వారు చెబుతున్నారు.

''పడయప్ప మాకు బ్రాండ్ అంబాసిడర్ లాంటిది’’అని స్థానిక పర్యటక సంస్థ షోకేస్ మున్నార్ వైస్ ప్రెసిడెంట్ వినోద్ వట్టెక్కట్ చెప్పారు.

అయితే, పడయప్ప ప్రవర్తనలో మార్పులను చూసి నేడు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

గత డిసెంబరులో తన దారికి అడ్డువచ్చిన రెండు బైకులను పడయప్ప ధ్వంసం చేసింది. వాటిపై ఉండేవారు బైక్‌ల మీద నుంచే దానితో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించినట్లుగా వీడియోలో కనిపిస్తోంది.

గత ఏప్రిల్‌లోనూ 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ముందు అద్దాన్ని పడయప్ప ధ్వంసం చేసింది.

అయితే, ఈ ఘటన వెను ఏం జరిగిందో రెంజిత్ వివరించారు. ''పడయప్ప దారిలో అప్పుడు అడ్డుగా ఒక బస్సు వచ్చింది. సాధారణంగా అయితే, బస్సులను ఆపుతారు. కానీ, ఆ డ్రైవర్ మాత్రం పడయప్పతో పోటీపడి బస్సును వేగంగా తీసుకెళ్లాడు. అది పడయప్పకు నచ్చలేదు. దీంతో తొండాన్ని బస్సు అద్దం కేసి కొట్టింది’’అని ఆయన వివరించారు.

చాలా మంది బస్సులు, ఆటో డ్రైవర్‌లు హారన్ పదేపదే కొడుతూ పడయప్పను రెచ్చగొడుతుంటారని మున్నార్‌లో వ్యవసాయ కూలీగా పనిచేసే సురేశ్ పాల్‌రాజ్ చెప్పారు.

గత డిసెంబరులో తన టీ తోటల్లోకి రాకుండా భారీ శబ్దాలతో పడయప్పను భయపెట్టిన ఒక వ్యక్తిపై అటవీ అధికారులు కేసు కూడా నమోదుచేశారు.

''మరోవైపు కోవిడ్-19 వ్యాప్తి తర్వాత మళ్లీ ఇక్కడ పర్యటకుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీని వల్ల ఏనుగుకు ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు’’అని కొందరు జంతు ప్రేమికులు చెబుతున్నారు.

''పడయప్ప ప్రవర్తన మాకేమీ అసాధారణంగా అనిపించడం లేదు. అటవీ ఏనుగులకు మరీ దగ్గరకు వెళ్లి సెల్ఫీలు తీసుకోకూడు. అలా వెళ్తే వాటికి కోపం వస్తుంది’’అని అటవీ జంతువుల నిపుణుడు జేమ్స్ జచరియా చెప్పారు. ఆయన రెండు దశాబ్దల నుంచి పడయప్పను చూస్తున్నారు.

''తనకు ముప్పుగా అనిపిస్తోంది కాబట్టే అదే ఉద్రేకంతో ప్రవర్తిస్తోంది. అయితే, అది దాడిచేస్తుందని మనం భావించకూడదు’’అని ఆయన చెప్పారు.

పడయప్ప రోజూ వార్తల్లో నిలుస్తుండటంతో దీని గురించి ఇక్కడ చర్చ జరుగుతోంది. ''పడయప్ప ఒక అటవీ ఏనుగు.. దానితో మర్యాదగా, జాగ్రత్తగా నడుచుకోవాలి’’అని ఇటీవల ఒక వార్తాపత్రిక ఎడిటోరియల్ కూడా ప్రచురించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Padayappa: Why is this elephant, who was jokingly posing for photos with tourists, now getting a bad name?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X