వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పైడి జైరాజ్: తెలుగు నేల నుంచి తొలి పాన్ ఇండియా సూపర్ స్టార్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

తెలుగు సినిమా ఇటీవలి కాలంలో తన పరిధిని విస్తరించుకుంది. టాలీవుడ్ ఎల్లలు విస్తృతమయ్యాయి. తెలుగు చిత్రాల ప్రభావం బాలీవుడ్ 'బాక్సాఫీస్' పై స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు సినిమా ఇప్పుడు తెలుగు మాట్లాడే వారికి మాత్రమే పరిమితం కాదు, ఉత్తరాదిని మెప్పించి 'పాన్ ఇండియా'స్థాయికి చేరింది. 'బాహుబలి', పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి తెలుగు సినిమాలు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.

దర్శకుడు రాజమౌళి, హీరోలు ప్రభాస్, దగ్గుబాటి రాణా, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లుగా మారారు. తెలుగు నేల నుంచి పాన్-ఇండియా స్టార్ అనగానే గతంలో ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న సినీ ప్రేక్షకులకు రావొచ్చు. ఆ ప్రశ్నకు సమాధానం- పైడి జైరాజ్.

Paidi Jairaj

తన నటన, పదునైన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్ లతో 90 ఏళ్ల క్రితం హిందీ(బొంబాయి) చిత్ర సీమను మెప్పించి తొలి తెలుగు పాన్ ఇండియా స్టార్ గా సినీ విమర్శకుల మన్ననలు పొందిన అచ్చ తెలుగు వ్యక్తి 'పైడి జైరాజ్'. తన కాలంలో బాలీవుడ్ అగ్రశ్రేణి హీరోల్లో ఒకరుగా ఆయన గుర్తింపు పొందారు.

ఎవరీ పైడి జైరాజ్?

హిందీ సినిమా రంగంలో పి.జైరాజ్‌గా ప్రసిద్దిచెందిన 'పైడి జైరాజ్' కాల ప్రవాహంలో మరుగున పడిపోయిన చరిత్రగా చెప్పొచ్చు. ఈ కాలం తెలుగు సినీ ప్రేమికులకు అంతగా తెలియని పేరు.

'జైరాజ్' అసలు పేరు 'పైడిపతి జైరుల నాయుడు'. సెప్టెంబర్ 28, 1909లో ఆనాటి నైజాం రాజ్యం లోని 'కరీంనగర్' ఆయన జన్మించారు. తండ్రి అచ్యుతయ్య నాయుడు నైజాం ప్రభుత్వ ప్రజా పనుల శాఖ(పీడబ్లూడీ) లో చీఫ్ అకౌంటెంట్ గా పనిచేసేవారు. తల్లి పేరు తాయారమ్మ. మొత్తం 9 మంది సంతానంలో జైరాజ్ అందరికన్నా చిన్నవారు.

'భారత కోకిల' సరోజిని నాయుడు భర్త 'ముత్యాల గోవింద రాజులు నాయుడు', జైరాజ్ కు స్వయానా మేనమామ. జైరాజ్ చిన్నతనంలోనే కుటుంబం కరీంనగర్ నుండి హైదరాబాద్ కు మారింది. అక్కడే ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలన్న కుటుంబ సభ్యుల కోరికకు భిన్నంగా ఆయన సినిమా రంగంలో ప్రవేశించారు.

సుమారు ఆరు దశాబ్ధాలు సాగిన ఆయన సినీ ప్రస్థానం లో హిందీ, ఉర్దూ,ఇంగ్లీష్, భోజ్ పురీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో 300 కు పైగా సినిమాల్లో నటించారు. హీరో, విలన్, దర్శకత్వం, నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్ట్, అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ కెమెరా మెన్ , టీవీ సీరియళ్ల దర్శకత్వం.. ఇలా వివిధ విభాగాల్లో పనిచేసి బహుముఖ ప్రతిభ కనబర్చారు.

భారత సినీ రంగానికి చేసిన సేవలకు గాను పైడి జైరాజ్‌ను కేంద్ర ప్రభుత్వం 1980లో ప్రతిష్ఠాత్మక 'దాదా సాహేబ్ ఫాల్కే'అవార్డుతో గౌరవించింది.

పక్కా హైదరాబాదీ ముల్కీ( లోకల్)

హైదరాబాద్ కు కుటుంబం మారిన కొన్నాళ్లకే జైరాజ్ తండ్రి చనిపోయారు. హైదరాబాద్ లో సాహితీ గోష్ఠులకు కేరాఫ్ గా ఉన్న 'గోల్డెన్ థ్రెషోల్ట్' (సరోజినీ నాయడు నివాసం), అకాడా ( వ్యాయామశాల) జైరాజ్ రోజువారీ జీవితంలో భాగంగా ఉండేవి.

''సరోజినీ నాయుడు, ఆమె సోదరుడు కవి,రచయిత హరీంద్రనాథ్ చటోపాధ్యాయ ( విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి తొలి ఎంపి గా గెలుపొందారు) ఆధ్వర్యంలో నెలకొల్పిన 'షెక్స్ పియర్ క్లబ్' లో నాటకాల్లో చిన్నపాత్రలను వేసేవారు జైరాజ్. వ్యాయామ విద్య తో పాటు కత్తి సాము, గుర్రపు స్వారీలను అభ్యసించారు. తన 17వ ఏట 'వరల్డ్ బాడీ బ్యూటిఫుల్ కాంపిటీషన్' లో 7వ స్థానంలో నిలిచారు పైడి జైరాజ్. ఈ విషయాన్ని ఆయనే అప్పట్లో ఆలిండియా రేడియో ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

ఇంజనీర్ కావాల్సింది హీరో' అయ్యారు

'డాక్టర్ అవ్వాల్సింది యాక్టర్ అయ్యాను' అనే మాట సినీ రంగంలో తరచూ వినిపించే మాట. అయితే, ఇంజనీర్ కావాల్సిన జైరాజ్ యాక్టర్ అయ్యారు.

జైరాజ్ సోదరుడు 'సుందర్రాజు నాయుడు' నైజాం స్టేట్‍లో పేరొందిన ఇంజనీర్. జైరాజ్ ఇంగ్లాండ్‌లో ఇంజనీరింగ్ చదవాలని ఆయన కోరిక. దానికి విరుద్దంగా నిజాం కాలేజీలో బీఎస్సీ డిగ్రీ చదువు మధ్యలో వదిలేసి 'బొంబాయి' వెళ్లారు జైరాజ్. ఆ సమయంలో భారతదేశంలో సినిమా నిర్మాణ రంగానికి బొంబాయి, కలకత్తా, మద్రాస్ కేంద్రాలుగా ఉన్నాయి. అది మూకీ సినిమాల యుగం.

''హైదరాబాద్ నేపథ్యంతో వచ్చిన జైరాజ్‌కు హిందీ, దక్కన్ ఉర్ధూతో పాటు ఆంగ్ల భాషలపై పట్టు ఉండేది. ఆకర్షించే శారీర సౌష్టవం ఆయనకు సినిమా అవకాశాలు తట్టేందుకు ఉపయోగపడింది. అయితే, బొంబాయి వెళ్లిన తొలిరోజుల్లో హీరో అవకాశాలకు ముందు చిత్ర నిర్మాణ స్టూడియోల్లో స్టంట్ మాస్టర్‌గా కొద్దికాలం పనిచేశారు. పోస్టర్ పెయింటింగ్, టైటిల్ కార్డ్స్ రాయడం చేశారు''అని కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు, సినీ రచయిత, నందీ అవార్డ్ గ్రహీత 'పొన్నం రవిచంద్ర' బీబీసీకి వివరించారు.

జైరాజ్ సమగ్ర సినీ జీవితం పై 'ఇన్విన్సిబుల్ హీరో' పేరుతో పొన్నం రవిచంద్ర నిర్మించిన డాక్యుమెంటరీ... 2019లో జరిగిన షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(చైనా), కలకత్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, దిల్లీలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లలో ప్రదర్శితమైంది. హైదరాబాద్‌లోని ఇఫ్లూలో, రవీంద్రభారతిలో, ఇతర ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు చిత్రోత్సవాల్లో ఇది ప్రదర్శితమైంది.

మరాఠీ రచయిత, నిర్మాత 'మామా వారేర్కర్' తో ఏర్పడ్డ పరిచయంతో జైరాజ్‌కు మొదటి సినిమా అవకాశం వచ్చింది. ముంబయిలో సినిమాల్లో చేస్తుండగానే పంజాబ్ నేపథ్యం ఉన్న 'సావిత్రి'తో జైరాజ్ వివాహం అయ్యింది. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు.

టాకీ, మూకీ సినిమాల సంధానకర్త

''భారతీయ సినిమా రంగం మూకీ నుండి టాకీ గా మాటలు నేర్చి... ప్లే బ్యాక్, 35 ఎంఎం, 70 ఎంఎం, బ్లాక్ అండ్ వైట్, కలర్ సినిమాగా రూపాంతరం చెందిన దశను జైరాజ్ చూశారు. ప్రపంచంలోనే ఏటా అత్యధిక సినిమాలు రూపొందించే 'బాలీవుడ్" గా హిందీ సినిమా సాగించిన ప్రస్థానానికి ప్రత్యక్షసాక్షిగా నిలిచిన అచ్చ తెలుగు వ్యక్తి పైడి జైరాజ్.

సినిమా మూకీ ( సైలెంట్ సినిమా) నుండి టాకీకి మారడం చిత్రనిర్మాణరంగంలో ప్రధాన మైలురాయిగా భావిస్తారు.

''మూకీ సినీ నటుల్లో చాలా మంది టాకీల్లో రాణించలేకపోయారు. టాకీ సినిమాల్లో నటులు తమ పాటలను తామే పాడుకునే పద్దతి ఉండేది. అప్పటికి ప్లే బ్యాక్ లేదు. జైరాజ్ తొలుత ఇబ్బంది పడ్డా ఆ తర్వాత నిలదొక్కుకున్నారు. మూకీ నుంచి టాకీ విజయవంతంగా మారిన అతికొద్ది మంది నటుల్లో పైడి జైరాజ్ ఒకరు'' అని సినీ విమర్శకులు 'వారాల ఆనంద్' అన్నారు.

1930 లో 'నాగేంద్ర మజుందార్' దర్శకత్వంలో వచ్చిన 'జగ్ మగాతీ జవానీ' జైరాజ్ నటించిన మొదటి మూకీ చిత్రం. అందులో సహాయ నటుడు పాత్ర వేశారు. ఆ సినిమాలో యాక్షన్ సీన్ లలో హీరో కు డూప్ గా కూడా నటించారు. హీరోగా ఆయన నటించిన మొదటి మూకీ చిత్రం 'రసీలీ రాణీ'.మొత్తం 11 మూకీ చిత్రాల్లో ఆయన నటించారు.

తొలి రోజుల్లో హీరో గా జైరాజ్ నెలకు 75 రూపాయల జీతంతో పనిచేశారు. ఆ రోజుల్లో ఒక సినిమా నిర్మాణం గరిష్టంగా రెండు నెలల లోపే పూర్తయ్యేది. ఒక సినిమాకు వంద రూపాయలకంటే తక్కువ పారితోషికం అందుకున్న రోజులు అవి.

1931 లో భారతీయ తొలి టాకీ చిత్రం 'ఆలం అరా' రూపొందింది. ఆ మరుసటి ఏడాది (1932 లో) వచ్చిన 'షికారీ' జైరాజ్ నటించిన తొలి టాకీ చిత్రం. అందులో బౌద్ద భిక్షువు పాత్రలో ఆయన నటించారు. ఈ సినిమా నిర్మాణం ఆయన సొంతూరు హైదరాబాద్‌లో జరిగింది.

ఒక్క తెలుగు సినిమాలోనూ చేయని జైరాజ్

300 కు పైగా చిత్రాల్లో నటించిన పైడి జైరాజ్ తన మాతృభాష తెలుగులో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించలేదు. 'చిత్తూరు నాగయ్య'తో ఓ తెలుగు సినిమాకు అగ్రిమెంట్ పై సంతకాలు జరిగినా ఆ తర్వాత కొద్ది రోజులకే నాగయ్య మరణంతో ఆ చిత్ర నిర్మాణం జరగలేదు. అయితే తెలుగు చిత్రం 'పల్లెటూరి పిల్ల' హిందీ రీమేక్ అయిన 'ఇన్సానియత్'లో ఆయన ఒక పాత్రను పోషించారు.

చిత్తూరు నాగయ్యతో కనకదుర్గ అనే చిత్రంలో నటించాలని ఆయన అనుకున్నారు. కానీ నాగయ్య మరణంతో ఆ ప్రతిపాదన ఆగిపోయింది. పైడి జైరాజ్ కొడుకు పైడి దిలీప్ రాజ్ ఆస్మాన్ మహల్ వంటి కొన్ని చిత్రాల్లో కథానాయకుడుగా నటించారు. మరో అబ్బాయి ఇంజనీర్ గా అమెరికాలో పనిచేశారు.

జైరాజ్ జ్ఞాపకాల్లో హైదరాబాద్

"హైదరాబాద్ ఒక సాంస్కృతిక కేంద్రం. నా బాల్య స్మృతులన్నీ ఇక్కడివే. మా అత్తయ్య సరోజిని నాయుడు నివాసం గోల్డెన్ థ్రెషోల్ట్ కు తరచుగా వెళ్లేవాడిని. నా విద్యాభ్యాసం హైదరాబాద్ లోని ఆల్ సైన్స్ స్కూల్, ఛాదర్ ఘాట్ హైస్కూల్, నిజాం కాలేజీలో సాగింది" అని తెలుగు సినీ పరిశ్రమ వజ్రోత్సవాల సందర్భంగా ఒక తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.

హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో జైరాజ్ ఫ్యామిలీ ఆకాలంలో నివసించింది. బంధు,మిత్రులను కలవడానికి తరచూ జైరాజ్ హైదరాబాద్ వచ్చేవారు. ఫతే మైదాన్ క్లబ్ లో ఆయన మెంబర్షిప్ ఉండేది.

తెలుగు సినిమా పరిశ్రమలో ఎల్వీ ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావులతో సంబందాలు ఉండేవి. హైదరాబాద్ వచ్చినపుడు అక్కినేని ఇంట్లో జైరాజ్ బస చేసేవారని, జైరాజ్ సమీప బంధువు 'కాసారపు రమేష్' బీబీసీతో చెప్పారు.

తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుండి హైదరాబాద్ తరలివచ్చే క్రమంలో స్థానికంగా మౌలిక వసతుల కల్పన లో ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని ఆయన ప్రభావితం చేశారని, అనాటి దేశ రాజకీయ ప్రముఖులతో జైరాజ్ కు ఉన్న సన్నిహిత సంబందాలు, చెన్నారెడ్డితో ఉన్న స్నేహం ఇందుకు ఉపయోగపడి ఉండొచ్చని సినీ విమర్శకులు 'వారాల ఆనంద్' బీబీసీకి చెప్పారు.

భారత వెండితెర తొలి యాక్షన్ హీరో-తొలి సూపర్ మ్యాన్

చారిత్రక, సాంఘీక, ప్రేమ కథా, ఫాంటసీ,యాక్షన్ వంటి విభిన్న చిత్రాల్లో పైడి జైరాజ్ నటించారు. గుర్రం స్వారీ, కత్తిసాముల్లో జైరాజ్ ప్రతిభ వెండితెరపై తొలి యాక్షన్ హీరో గా ఆయనకు గుర్తింపు తెచ్చాయి.

సామ్రాట్ పృథ్వీరాజ్ , రాజ్ పుతానీ, అమర్ సింగ్ రాథోడ్, వీర్ దుర్గాదాస్, జై చిత్తోడ్ సినిమాల్లో ఆయన పోషించిన రాజపుత్ర వీరుల చారిత్రక పాత్రలు మంచి పేరు తెచ్చాయి.

''తన సహ నటులు పృథ్వీరాజ్ కపూర్, అశోక్ కుమార్ లాంటి వారు సున్నితమైన ప్రేమ సన్నివేషాల్లో నటిస్తున్న సమయంలో పైడి జైరాజ్ వెండి తెరపై యాక్షన్ సీన్స్, స్టంట్స్ చేశారు. హైదరాబాద్ వ్యాయామశాలల్లో పొందిన తర్పీదు నటనా జీవితంలో ఆయనకు తోడ్పడింది'' అని తెలంగాణ భాషా-సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ బీబీసీ తో అన్నారు.

భగత్ సింగ్ కథాంశంతో నిర్మించిన తొలి భారతీయ సినిమా "షహీద్-ఏ-ఆజాం- భగత్ సింగ్" చిత్రంలో కోస్టార్ గా జైరాజ్ పనిచేసారు.

షాజహాన్,రజియా సుల్తానా, లాల్ ఖిలా, ముంతాజ్ మహల్, చంద్రశేఖర్ ఆజాద్, హథీం తాయి, అమర్ కహానీ, బాబీ, షోలే, డాన్, ఖూన్ బరే మాంగే, ఆయన నటించిన మరికొన్ని ప్రసిద్ద చిత్రాలు.

1956 లో వచ్చిన ఫాంటసీ చిత్రం ''హథీం తాయి'' (1956)లో సినిమాలోని 'పర్వర్ దిగారే ఆలం' పాటను పది సార్లకు పైగా రివైండ్ చేసుకుని చివరి నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ విన్నారని జైరాజ్ గతంలో ఇచ్చిన రేడియో ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ రోజుల్లో 'రేడియో సిలోన్, ఆల్ ఇండియా రేడియో వారి వివిధ భారతీ సర్వీస్ లో భాగంగా ప్రసారమైన'బినాకా గీత్ మాలా' కార్యక్రమంలో ఎక్కువగా శ్రోతలు కోరిన గీతాల్లో ఒకటిగా ఇది ఉంది.

హథీం తాయిలో జైరాజ్ నటనకు నిజాం రాగి నాణేలతో తులాభారం చేసారని, ఆ నాణేలు ఇప్పటికీ వారి కుటుంబ సభ్యుల వద్ద గుర్తుగా ఉన్నాయి' అని పొన్నం రవిచంద్ర బీబీసీ తో చెప్పారు.

'రిటర్న్ ఆఫ్ మిస్టర్ సూపర్ మ్యాన్'(1960 సం.) సినిమా తో ఆయన 60లలోనే భారతీయులకు తొలిసారి 'సూపర్ మ్యాన్' క్యారెక్టర్ ను పరిచయం చేశారు.

నాటి అగ్ర కథానాయికలు..దేవికారాణీ, దుర్గా కోటే,సురయ్యా, నిరుపా రాయ్, మధుబాల, నర్గీస్, గీతా బాలీ, మీనా కుమారి, మెహతాబ్, లీలా చట్నీస్, నూర్జహాన్ లతో నటించారు. మధుబాల, మీనా కుమారీ లు బాలనటులు గా ఆ తర్వాతి కాలంలో హీరోయిన్లుగా జైరాజ్ సరసన నటించారు.

తన తరం లో పృథ్వీరాజ్ కపూర్,శాంతారాం, రాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, అశోక్ కుమార్ లతో, ఆ తర్వాతి తరంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, శతృఘణ్ సిన్హా లాంటి వారితో కలిసి జైరాజ్ పనిచేశారు.

హిందీ సంగీత ప్రపంచంలో మహ్మద్ రఫీ, నౌషద్, సైగల్ , ఆర్ డీ. బర్మన్, లతా మంగేష్కర్ లతో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి.

నటుడు,దర్శకుడు,నిర్మాత

ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1945 లో ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ప్రతిమ' లో 'దిలీప్ కుమార్' ప్రధాన హీరో గా వెండితెర కు పరిచయం అయ్యారు. జైరాజ్ 1951 లో పి.జే ఫిల్మ్ పేరుతో సొంత చిత్ర నిర్మాణ యూనిట్ ప్రారంభించారు. సాగర్ (1951),రాజ్ ఘర్, మోహర్ (1959) జైరాజ్ దర్శకత్వం వహించిన మిగితా చిత్రాలు.

ప్రసిద్ద ఆంగ్ల కవి 'లార్డ్ టెన్నిసన్' కవిత ఎనోక్ ఆర్డెన్ ఆధారంగా జైరాజ్ నిర్మించిన 'సాగర్' చిత్రం ద్వారా నర్గీస్ వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. అయితే ఈ చిత్రం కమర్షియల్ గా నష్టాలను మిగిల్చింది. ''సాగర్ సినిమా ఆశించినట్టు ఆడలేదు. అయితే ఆ సినిమాతో నా గౌరవం పెరిగింది''అని జైరాజ్ ఆకాశవాణి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

టెలివిజన్ రంగంలో తానాబానా, కథాసాగర్ వంటి టివి సీరియళ్లకు పైడి జైరాజ్ దర్శకత్వం వహించారు.

ఇండో రష్యన్ కో-ప్రొడక్షన్ లో వచ్చిన పరదేశీ(1957) తో పాటు మాయా, నైన్ హవర్స్ టు రామా(1963) ఇంగ్లీష్ చిత్రాల్లోనూ జైరాజ్ నటించారు.

ఆయన నటించిన రెండు సినిమాలు ఆనాటి ప్రభుత్వాల నిషేధానికి గురయ్యాయి.

ముంబాయి నేత మిల్లు కార్మికుల దుర్భర జీవితాల ఆధారంగా నిర్మించిన 'మిల్ మజ్దూర్' (1934) అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిషేదించింది. ఈ సినిమాలో ప్రసిద్ద హిందీ రచయిత 'మున్షీ ప్రేమ్ చంద్'తక్కువ నిడివిగల పాత్రలో కనిపించారు.

మహాత్మా గాంధీ హత్యోదంతం నేపథ్యంగా 'నాథురాం గాడ్సే' ప్రధాన పాత్ర గా వచ్చిన ఫిక్షన్ సినిమా 'నైన్ హవర్స్ టు రామా' (1963)ను భారత ప్రభుత్వ నిషేధించింది. ఈ సినిమాలో జైరాజ్ గాంధీ ప్రధాన అనుచరుడు, ఆనాటి ప్రముఖ పారిశ్రామిక వేత్త జి.డి.బిర్లా పాత్ర పోషించారు.

ఈ సినిమా సెన్సార్ బోర్డ్ ముందుకు రాగా ఆనాటి కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి 'బెజవాడ గోపాల్ రెడ్డి' సెన్సార్ బోర్డ్ ప్రివ్యూ షోకు ప్రధాని నెహ్రూ, ఇతర మంత్రులను ఆహ్వానించారు. అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఈ సినిమా ప్రివ్యూ చూశారు. ఈ సినిమా నిషేధం పై ఆ రోజుల్లో రాజ్యసభలో జరిగిన చర్చ లో నెహ్రూ సమాధానం ఇచ్చారు.

పేద కళాకారుల సంక్షేమం

సినిమా, టీవీ రంగంలోని పేద కళాకారులు, కార్మికుల సంక్షేమం కోసం జైరాజ్ కృషిచేశారు. 'సినిమా అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' ఏర్పాటులో కీలక భూమిక పోషించారు.

సేవా కార్యక్రమాలు, జాతీయ రక్షణ నిధి విరాళాల సేకరణకు ఆరోజుల్లోనే 'స్టార్ క్రికెట్' పోటీలను నిర్వహించారు.

పైడి జైరాజ్ అంతిమ యాత్ర సందర్భంగా ఆయన పార్థీవ దేహం పై 'సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' బ్యానర్ ను కప్పడం ఆయనకు ఆ సంఘం తో ఉన్న అవినాభావ సంబందానికి ప్రతీకగా భావిస్తారు.

''జైరాజ్ స్టార్డమ్ మాత్రమే అనుభవించకుండా, తెర వెనుక పనిచేస్తున్న సినీ కార్మికులు,టెక్నీషియన్ల సంక్షేమం కోసం పాటుపడ్డారు. సహ నటుడు పృథ్వీరాజ్ కపూర్ తో కలిసి బొంబాయి నుండి మద్రాస్ వరకు కమర్షియల్ షో లు చేసి నిధులు సమకూర్చారు'' అని సినీ విమర్శకులు వారాల ఆనంద్ బీబీసీతో అన్నారు.

'ఫిల్మ్ ఫేర్ అవార్డు' కార్యక్రమ నిర్వహణలో ముఖ్య పాత్ర పోషించానని పైడి జైరాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

పుస్తక ప్రియుడు

పైడి జైరాజ్ పుస్తక ప్రియుడు. ఖాళీ సమయాల్లో బొంబాయి (ముంబాయి) పాతపుస్తక విక్రయ కేంద్రాలు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవి. ఫిలాసఫీ, సైకాలజీ, మెటా ఫిజిక్స్, హోమియోపతి,ధార్మిక అంశాలపై ఎక్కువగా పుస్తకాలు చదివేవారు. పుస్తక పఠనం, అధ్యాయనం పై ఆసక్తి, ఇతర వ్యాపకాలపై గతంలో ఆల్ ఇండియా రేడియో వారి ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన పలు విషయాలు ఆయన మాటల్లో...

'ఆ రోజు నేను దాదాసాహేబ్ ఫాల్కే అవార్డ్ కు ఎంపికైన రోజు. అవార్డ్‌కు ఎంపికైనట్టు దిల్లీ నుండి ఫోన్ వచ్చింది. ఆ సమయంలో నేను ఇంట్లో లేకపోవడంతో, ఖచ్చితంగా బుక్ షాప్ ల వద్దే ఉంటానన్న నమ్మకంతో వారికి ఫోన్ చేసి నాతో ఫోన్ చేయించాల్సిందిగా నా కుటుంబ సభ్యులు కోరారు. వారు ఊహించినట్టే నేను పాతపుస్తకాల సేకరణలో తలమునకలై ఉన్నాను. ఇంటి నుండి ఫోన్ వచ్చిందన్న విషయం తెలిసి ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారేమో అని కంగారుగా ఇంటికి చేరుకున్నాను. అప్పుడు అవార్డ్ వచ్చిన విషయం నాకు తెలిసింది'' అని ఆయన చెప్పారు.

''ప్రతి పుస్తకాన్ని నేను గురువుగా భావిస్తాను.. పుస్తకం ఎప్పుడు కొన్నాను, ఎప్పుడు పూర్తిచేసాను, ఎప్పుడు మళ్లీ దాన్ని తిరిగి చదివాను లాంటి నోట్స్ వాటిలో రాసుకునేవాడిని. వివిధ మతాల అధ్యాయనంలో భాగంగా.. టావోయిజం, షింజోయిజం, ఇస్లాం, బౌద్ధ, జైన ,హిందూ మతగ్రంథాలు చదివాను. ఆస్ట్రాలజీ, పెయింటింగ్, రచనా వ్యాసాంగంలో కూడా నాకు ప్రవేశం ఉండేది. ఓ సినిమాకు పనిచేసే క్రమంలో విదేశీ టెక్నీషియన్ సహకారంతో జర్మనీ భాషను నేర్చుకున్నాను’’అని చెప్పుకున్నారాయన.

'టిప్పూ సుల్తాన్' సినిమాలో ఆ పాత్ర లక్షణాల అధ్యయనం కోసం లండన్ మ్యూజియం వెళ్లి అక్కడి పరిశోధన పత్రాలను స్వయంగా చదివినట్లు చెప్పుకున్నారు పైడి జైరాజ్

'స్పాండిలైటిస్' తో చాలా కాలం బాధపడ్డ జైరాజ్ కు హోమియోపతి వైద్యం తో ఉపశమనం దొరికింది.''ఆ తర్వాత కాలంలో ఆయన హోమియోపతి వైద్యం కూడా అభ్యసించారు.

తన కాలంలో సినిమా రంగంలో వచ్చిన మార్పులకు జైరాజ్ సాక్షిగా నిలిచారు. వాటికి అనుగుణంగా ఆయన మారుతూ వచ్చారు.

''పైడి జైరాజ్ అంటే ఒక సినిమా నటుడు మాత్రమే కాదు బహుముఖ ప్రజ్ఞావంతుడు.తెలంగాణ ప్రాంతం గర్వించదగ్గ సినీ వైతాళికుడు జైరాజ్. గత ఏడు సంవత్సరాలుగా పైడి జైరాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నాం. ప్రతి ఏటా 5 రోజులపాటు పైడి జైరాజ్ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నాం''అని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ బీబీసీకి తెలిపారు.

ఆగష్టు 11, 2000 సంవత్సరంలో తన 90వ ఏట పైడి జైరాజ్, ముంబయిలో కన్నుమూసారు.

హైదరాబాద్ రవీంధ్ర భారతిలో పైడి జైరాజ్ పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రివ్యూ థియేటర్ ఏర్పాటు చేసింది. 2017 లో ప్రపంచ తెలుగు మహాసభల(హైదరాబాద్) సందర్బంగా జైరాజ్ పై ప్రత్యేక మోనోగ్రాఫ్ ను రూపొందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Paidi Jairaj: First pan India superstar from Telugu soil
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X