సరిహద్దు గ్రామాలపై తెగబడిన పాక్ బలగాలు: స్త్రీ మృతి
జమ్మూ: భారత, పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ బలగాలు శనివారంనాడు జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామాలపై తెగబడ్డాయి. బిఎస్ఎఫ్ శిబిరాలపై కూడా ఫిరంగి దాడులు, కాల్పులు జరిపాయి. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో పాకిస్తాన్ బలగాలు తెగబడ్డాయి.
గ్రామాలను, 13 సరిహద్దు ఔట్ పోస్టులను లక్ష్యం చేసుకుని భారీ ఫిరింగి దాడులకు పాకిస్తాన్ బలగాలు పాల్పడ్డాయి. సాంబా సెక్టార్‌లో పాకిస్తాన్ బలగాలు జరిపిన ఫిరంగి దాడుల్లో ఓ మహిళ మరణించినట్లు, మరో ఇద్దరు గాయపడినట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి.

నూతన సంవత్సరం సందర్భంగా పాకిస్తాన్ బలగాలు దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ఓ బిఎస్ఎఫ్ జవాను మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. శుక్రవారం వరకు పాకిస్తాన్ బలగాలను భారత సైన్యం తిప్పికొట్టడంలో మునిగిపోయింది. ఇందులో ఐదుగురు పాకిస్తాన్ రేంజర్లు మరణించారు.
గత రాత్రి పదకొండున్నర గంటల నుంచి ఏ విధమైన రెచ్చగొట్టే సంఘటనలు జరగకుండానే కథువా, సాంబా జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల్లోని పోస్టులపై, పౌర నివాసాలపై పాకిస్తాన్ బలగాలు భారీ కాల్పులకు, ఫిరంగి దాడులకు పాల్పడినట్లు బిఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాకేష్ శర్మ పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు.
భారత బలగాలు ధీటుగా ఎదుర్కున్నాయని, ఎదురు కాల్పులు శనివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఆగిపోయాయని ఆయన చెప్పారు. మళ్లీ శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఫిరంగి దాడులకు కాల్పులకు పాకిస్తాన్ బలగాలు పాల్పడ్డాయి. గ్రామాలను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ బలగాలు దాడులు చేస్తున్నాయి.
పాకిస్తాన్ దాడులతో కథువా, సాంబా జిల్లాలోని మన్యారి, పాన్సర్, బోబియా, లోందీ, సాడేచక్, చైలారి, చాచ్‌వాల్, మంగు చక్, రేగాల్, మావా, సాధో, చక్ ఫకీరా వంటి సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయేందుకు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications