ప్రపంచ పటంలో పాక్ కనపడదు గ్యారెంటి: సింగ్
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ను అస్థిరపరచడానికి పాకిస్థాన్ శక్తి వంచన లేకుండా పని చేస్తుందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ మండిపడ్డారు. పాకిస్థాన్ త్వరలో ప్రపంచ పటంలో తెరమరుగు అవుతుందని ఆయన అన్నారు.
పాక్ కనుమరుగు అయ్యే రోజు చాల దగ్గర్లోనే ఉందని, ఆ విషయం పాకిస్థాన్ కూ తెలుసని ఆయన చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లో హింస చోటు చేసుకోవడానికి పాకిస్థాన్ కారణం అని నిర్మల్ సింగ్ ఆరోపించారు.
అమరవీరుడు బ్రిగేడియర్ రాజేంద్ర సింగ్ 69వ సంస్మరణ దినం సందర్బంగా నిర్మల్ సింగ్ మాట్లాడుతూ పాకిస్థాన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో యువతను రెచ్చగొట్టి పాక్ పబ్బం గడుపుకోంటుందని ఆరోపించారు.

పాక్ అక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైనిక బలగాలు సర్జికల్ దాడులు చేసిన తరువాత ఆదేశం కుదురుగా ఉండలేకపోతుందని చెప్పారు. అప్పటి నుంచి పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని గుర్తు చేశారు.
ప్రస్తుతం కాశ్మీర్ లోయలో జరుగుతన్న అల్లర్లకు పాకిస్థాన్ దే బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ అన్నారు. బంగ్లాదేశ్ ఏర్పడిన నాటి పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయని నిర్మల్ సింగ్ గుర్తు చేశారు.
అయితే నిత్యం పాక్ మాకు ఏమీ తెలీదు, మేము అమాయకులం అని ప్రపంచాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నదని, ప్రపంచ దేశాలు మాత్రం పాక్ ఆడుతున్న నాటకాలను చూస్తున్నదని చెప్పారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదన్నట్లుగా పాక్ వ్యవహరిస్తున్నదని నిర్మల్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.












Click it and Unblock the Notifications