ఆ నీళ్లను మళ్లిస్తాం.. పాక్ నీటి కొరతతో అల్లాడిపోవాల్సిందే: అమిత్ షా
Amit Shah: పాకిస్థాన్‌తో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని(ఇండస్ వాటర్స్ ట్రీటీ) ఎప్పటికీ పునరుద్ధరించబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. పాకిస్థాన్ ఆకలితో అలమటించాల్సి వస్తుందని అమిత్ షా అన్నారు. పాకిస్థాన్ ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని, అందువల్ల సింధు జలాల ఒప్పందాన్ని ఎప్పటికీ పునరుద్ధరించబోమని అమిత్ షా స్పష్టం చేశారు. అన్యాయంగా పాకిస్థాన్ పొందుతున్న నీటిని నిలిపివేస్తామని, పాకిస్థాన్ నీటి కోసం అల్లాడేలా చేస్తామని ఆయన పేర్కొన్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. "సింధు జలాల ఒప్పందం ఎప్పటికీ పునరుద్ధరించబడదు. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేము, కానీ దానిని నిలిపివేసే హక్కు మాకు ఉంది. అదే మేం చేశాం. ఈ ఒప్పందం పీఠికలో రెండు దేశాలు శాంతి, పురోగతి సాధించాలనే విషయాలను పొందుపరిచారు. కానీ అది ఉల్లంఘించబడిన తర్వాత రక్షించడానికి ఏమీ మిగిలి లేదు" అని కేంద్ర మంత్రి అమిత్ షా గుర్తు చేశారు. ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సంబంధాలు తీవ్రంగా క్షీణించడంతో సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేశారు. పాకిస్థాన్ పౌరులను బహిష్కరించడం వంటి దౌత్యపరమైన నిర్ణయాలను కూడా భారత్ తీసుకుంది.

"భారత్‌కు చట్టబద్ధంగా చెందిన నీటిని మేము ఉపయోగిస్తాం. కాలువను నిర్మించడం ద్వారా పాకిస్థాన్‌కు వెళ్తున్న నీటిని రాజస్థాన్‌కు తరలిస్తాం. పాకిస్థాన్ అన్యాయంగా పొందుతున్న నీటి కోసం ఆకలితో అలమటిస్తుంది. ఇకపై పాక్ గొంతు ఎండాల్సిందే." అని అమిత్ షా పేర్కొన్నారు.
'కాశ్మీర్‌లో శాంతికి కావాలనే భంగం'
పహల్గామ్ దాడిని ఖండిస్తూ కాశ్మీర్‌లో శాంతికి భంగం కలిగించడానికి, పెరుగుతున్న పర్యాటకాన్ని ఆపడానికి, కాశ్మీర్ యువతను దారి మళ్లించడానికి చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నం అని అమిత్ షా అభివర్ణించారు. కశ్మీర్ లోయ ఇంతకు ముందు ఇంతటి ఘోరాన్ని చూడలేదని ఆయన అన్నారు. 'పాకిస్థాన్ ఏం చేసినా ఆలస్యం లేకుండా చర్య తీసుకోవడానికి వెనుకాడం" అని ఆయన అన్నారు. పర్యాటకులు కాశ్మీర్‌లో తిరిగి ప్రయాణించడం ప్రారంభించారని వెల్లడించారు. పాకిస్థాన్ భారతదేశంలో పౌర ప్రాంతాలపై దాడి చేసిందని.. అయితే భారత్ వారి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా తగిన సమాధానం ఇచ్చిందని అమిత్ షా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications