అసెంబ్లీ సాక్షిగా తల్లి మెడపై కత్తి పెట్టి.. అవినీతి మంత్రుల్ని అరెస్టు చేయాలంటూ
అది ఒడిశా రాజధాని భువనేశ్వర్.. సిటీ నడిబొడ్డున అసెంబ్లీ భవనం.. లోపల వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి.. కరోనా పరిస్థితు నేపథ్యంలో 60 ఏళ్లు దాటిన ఎమ్మెల్యేలు, మంత్రులు సభకు దూరంగా ఉంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ వాణిని వినిపిస్తున్నారు.. సీఎం నవీన్ పట్నాయక్ కూడా వీడియో ద్వారానే సమావేశాల్లో పాల్గొంటున్నారు.. గురువారం మధ్యాహ్నం సభ జరుగుతుండగానే అసెంబ్లీ భవనం ముందు అనూహ్య సంఘటన చోటుచేసుకుంది..

తల్లి మెడపై కత్తిపెట్టి..
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో అసెంబ్లీ భవన్ ఎదుట గురువారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సాక్షిగా ఒక యువకుడు తన కన్నతల్లి మెడపై కత్తిపెట్టి చంపేస్తానంటూ సైకోలాగా ప్రవర్తించాడు. రోడ్డపై ట్రాఫిక్ నిలిచిపోయి, వందలాది మంది చూస్తుండగా అతనిలా ప్రవర్తించడం అందరినీ కలవరపెట్టింది. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడికి పరుగులు తీశారు..

అవినీతి మంత్రులకు వ్యతిరేకంగా..
తల్లి మెడపై కత్తి పెట్టి.. ఎవరైనా దగ్గరికొస్తే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగిన ఆ యువకుడిని అదుపు చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేయాల్సి వచ్చింది. నీకు ఏం కావాలని పోలీసులు అడగ్గా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ ప్రభుత్వంలో కొందరు అవినీతి మంత్రులు ఉన్నారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. లేకుంటే తన తల్లిని చంపేస్తానంటూ యువకుడు గట్టిగట్టిగా అరిచాడు..

చివరికి ఏమైందంటే..
అసెంబ్లీ భవన్ ఎదుట దాదాపు అరగంటపాటు సాగిన ఉద్రిక్తత చివరికి పోలీసుల చాకచక్యంతో ముగిసింది. ఎలాంటి ప్రమాదం లేకుండా యువకుడి చేతిలో నుంచి కత్తి లాక్కున్న పోలీసులు.. తల్లి చెప్పిన విషయాలు విని షాక్ కు గురయ్యారు. సదరు యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని, ఆసుపత్రిలో చూపించేందుకే తాము బయటికొచ్చామని, ఆటోలో వెళుతుండగా.. అసెంబ్లీ భవన్ వద్దకు చేరుకోగానే ఇలా ప్రవర్తించాడని తల్లి వివరించింది. చివరికి ఆ తల్లికొడుకులను పోలీసులే తమ వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.












Click it and Unblock the Notifications