Afghanistan: గర్జిస్తున్న పంజ్‌షీర్-ఆదిలోనే తాలిబన్లకు గట్టి ఎదురు దెబ్బ-8 మంది ఫైటర్స్ హతం..
ఆఫ్గన్ గడ్డ నుంచి అమెరికా దళాల నిష్క్రమణతో తాము విజయం సాధించామని తాలిబన్లు ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఇది ఆఫ్గన్ల విజయమని... ఆఫ్గనిస్తాన్‌కు ఇప్పుడే పూర్తి స్వాతంత్య్రం లభించిందని పేర్కొన్నారు. ఇది తాలిబన్ల విజయమా కాదా అనే చర్చను పక్కకు పెడితే... ఇప్పటికీ ఓ అసంతృప్తి వారిని వెంటాడుతూనే ఉంది. పంజ్‌షీర్ ప్రావిన్స్ కొరకరాని కొయ్యగా మారడంతో... దాన్ని వశం చేసుకునేందుకు తాలిబన్లు తమ శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తున్నారు.ఈ క్రమంలో వారికి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Recommended Video

8మంది తాలిబన్లు హతం
వారం రోజుల క్రితమే పదుల సంఖ్యలో వాహనాల్లో పంజ్‌షీర్ వైపు కదిలిన తాలిబన్ ఫైటర్లు... సోమవారం(ఆగస్టు 30) అక్కడ అడుగుపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ పంజ్‌షీర్ యోధులు ఆదిలోనే తాలిబన్లను చావుదెబ్బ కొట్టారు.పంజ్‌షీర్ తిరుగుబాటు దళం చేసిన దాడిలో 8 మంది తాలిబన్లు హతమయ్యారు. పంజ్‌షీర్ నాయకుడు అహ్మద్ మసౌద్ ప్రతినిధి ఫహీం దష్టీ దీనిపై స్పందించారు. 'పంజ్‌షీర్‌లో సోమవారం రాత్రి స్థానిక దళానికి,తాలిబన్లకు మధ్య జరిగిన పోరాటంలో 8 మంది తాలిబన్ సభ్యులు హతమయ్యారు. ఇరువైపులా కొంతమందికి గాయాలయ్యాయి.కేవలం పంజ్‌షీర్ ప్రావిన్స్ కోసం కాదు... ఆఫ్గనిస్తాన్ కోసం మేము తాలిబన్లతో పోరాడుతున్నాం.ఆఫ్గనిస్తాన్ మహిళలు,మైనారిటీల హక్కుల పట్ల మేము ఆందోళనతో ఉన్నాం. ఇప్పటికైనా తాలిబన్లు అందరికీ సమానత్వ హక్కులు కల్పిస్తామని చెప్పాలి.' అని పేర్కొన్నారు.

అప్పట్లో తాలిబన్లకు చుక్కలు చూపించిన గడ్డ...
1985లో సోవియెట్ యూనియన్‌కు,1996లో తాలిబన్లకు పంజ్‌షీర్ చుక్కలు చూపించింది. దేశం మొత్తాన్ని ఆక్రమించిన తాలిబన్లు అక్కడ మాత్రం అడుగుపెట్టలేకపోయారు. ఆఫ్గనిస్తాన్‌లో నేషనల్ హీరోగా ఆరాధించే ఒకప్పటి సైన్యాధిపతి అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్ ప్రస్తుతం పంజ్‌షీర్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. తాలిబన్లకు తలవంచేది లేదని ఇటీవలే మసౌద్ ప్రకటించారు. పంజ్‌షీర్‌కు చెందిన 9వేల మందికి సాయుధ శిక్షణ ఇస్తున్నామని... తాలిబన్లను తరిమికొడుతామని ప్రకటించారు. అందుకు తగిన ఆయుధాలు కూడా తమ వద్ద ఉన్నాయని... ఇలాంటి రోజు ఒకటి వస్తుందనే తన తండ్రి కాలం నుంచి ఆయుధాలు సేకరిస్తున్నామని తెలిపారు. అయితే ఫ్రాన్స్,యూరోప్,అరబ్,అమెరికా దేశాల నుంచి తాము సాయం కోరుతున్నట్లు చెప్పారు. మసౌద్ విజ్ఞప్తిపై ఇప్పటివరకూ ఏ దేశం స్పందించలేదు.

తాలిబన్ వర్సెస్ పంజ్‌షీర్... ఎన్ని రోజులు...
అంతర్జాతీయ సమాజపు మద్దతు కరువవడంతో మసౌద్ నాయకత్వం తాలిబన్లకు లొంగిపోతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు అతను సిద్దపడుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ పంజ్‌షీర్ తాలిబన్లకు లొంగిపోలేదు. తాలిబన్లతో తాడో పేడో తేల్చుకునేందుకు వారితో పోరాడుతోంది.సాయుధ పంథాలోనే వారిపై తిరుగుబాటు జరుపుతోంది. ఈ పోరాటం ఎన్ని రోజుల్లో ముగుస్తుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే సుదీర్ఘ కాలం పోరాటం కొనసాగితే పంజ్‌షీర్ ఎంతవరకు తాలిబన్లను ఎదుర్కోగలదనేది వేచి చూడాలి.

ప్రపంచమంతా గమనిస్తోంది...
ఆఫ్గన్ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోవడంతో ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ తనను తాను ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పంజ్‌షీర్‌లోనే మకాం వేసి తాలిబన్లపై తిరుగుబాటుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ వ్యూహాల ఫలితంగానే ఇటీవల బాగ్లన్ ప్రావిన్స్‌లోని మూడు జిల్లాలను ప్రజా తిరుగుబాటుతో తాలిబన్ల నుంచి విముక్తి చేయగలిగారు. కానీ తాలిబన్లు తిరిగి వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకోగలిగారు. పంజ్‌షీర్ తిరుగుబాటు విజయవంతమైతే అది దేశమంతా పాకే అవకాశం ఉంది. అందుకే పంజ్‌షీర్ పోరాటాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది.












Click it and Unblock the Notifications