భూమికి జ్వరం. మరో 3 ఏళ్లలో భూమి బద్ధలైపోతుందా?
ప్రకృతి కాస్త శాంతించినట్టు కనిపించినా, మనుషులు చేస్తున్న పొరపాట్లు మాత్రం భూమిని నిప్పుల కొలిమిలా మారుస్తూనే ఉన్నాయి. గత రెండేళ్లతో (2023, 2024) పోలిస్తే 2025లో ఎండల తీవ్రత స్వల్పంగా తగ్గినట్లు అనిపించినా.. మానవ తప్పిదాల వల్ల భూమి వేడెక్కే ప్రక్రియ మాత్రం అస్సలు తగ్గలేదని శాస్త్రవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'లా నినా' (La Niña) చల్లటి పరిస్థితుల వల్లే గత ఏడాది ఉష్ణోగ్రతలు కాస్త అదుపులో ఉన్నాయని, లేదంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేదని తాజా 'ఇండికేటర్స్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్' (IGCC) నివేదిక హెచ్చరించింది.
అసలు కారణం మనుషులే!
ప్రపంచవ్యాప్తంగా 70 మందికి పైగా ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తలు కలిసి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. గత ఏడాది ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ కాలం కంటే 1.39 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. ఇందులో షాకింగ్ విషయమేమిటంటే.. ఆ 1.39 డిగ్రీలలో 1.37 డిగ్రీల వేడి పెరగడానికి కేవలం బొగ్గు, పెట్రోల్ వంటి జీవాశ్మ ఇంధనాలను విచ్చలవిడిగా వాడటం లాంటి మానవ చర్యలే కారణం. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) లెక్కల ప్రకారం, చరిత్రలోనే 2025వ సంవత్సరం మూడవ అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది.

మూడు సంవత్సరాల్లో 'లక్ష్యం' ముగిసే ప్రమాదం!
2015 నాటి పారిస్ ఒప్పందం ప్రకారం.. భూమి సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్ దాటకుండా చూసుకోవాలనేది ప్రపంచ దేశాల లక్ష్యం. కానీ, మనం విడుదల చేసే కార్బన్ డైయాక్సైడ్ పరిమితి (కార్బన్ బడ్జెట్) వేగంగా కరిగిపోతోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం, మనం సురక్షితంగా ఉండాలంటే ఇకపై కేవలం 130 బిలియన్ టన్నుల కార్బన్ డైయాక్సైడ్‌ను మాత్రమే వాతావరణంలోకి విడుదల చేయాలి. కానీ, ఇప్పుడున్న వేగంతో పొగలు వదులుకుంటూ పోతే, రాబోయే కేవలం మూడు సంవత్సరాలలోనే ఈ బడ్జెట్ మొత్తం ఖాళీ అయిపోతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తలకిందులవుతున్న భూమి శక్తి సమతుల్యత
భూమిపైకి వచ్చే సూర్యరశ్మికి, తిరిగి అంతరిక్షంలోకి వెళ్లే వేడికి మధ్య ఉండాల్సిన బ్యాలెన్స్ (శక్తి అసమతుల్యత) ఇప్పుడు పూర్తిగా దెబ్బతిన్నది. గ్రీన్‌హౌస్ వాయువులు పెరిగిపోవడం వల్ల అదనపు వేడి అంతా భూమిపైనే పేరుకుపోతోంది. ఈ వేడినంతటినీ సముద్రాలు పీల్చుకుంటుండటంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. 1901 నుంచి ఇప్పటివరకు సముద్ర మట్టం 23 సెంటీమీటర్లు పెరిగింది. అలాగే, సముద్రంలో విపరీతమైన వేడి గాలులు వీచే రోజుల సంఖ్య 1991తో పోలిస్తే మూడు రెట్లు పెరిగి, 2025 నాటికి 65 రోజులకు చేరింది.
ఆందోళనలో వాతావరణ నిపుణులు
భూమి ఆరోగ్యాన్ని కనిపెట్టుకుని ఉండే ఉపగ్రహాలు, వాతావరణ కేంద్రాలు, రీసెర్చ్ బెలూన్ల నిర్వహణకు ఇప్పుడు నిధుల కొరత ఏర్పడుతోందని శాస్త్రవేత్తలు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం సముద్రపు వేడిని కొలిచే వందలాది పరికరాలను తొలగించడం, ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాల్లో పరిశోధనలు తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులను ముందే గుర్తించే సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.
వాతావరణ వ్యవస్థ చాలా వేగంగా ప్రమాదకరమైన దిశలో ప్రయాణిస్తోందని, ప్రకృతి ఇచ్చే తాత్కాలిక చల్లదనాన్ని చూసి మోసపోకుండా, ఇప్పటికైనా ఉద్గారాలను తగ్గించకపోతే మున్ముందు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications