సోషల్ మీడియా బ్యాన్! పార్లమెంట్లో 'డిజిటల్ సేఫ్టీ యాక్ట్' బిల్లు
ఆన్‌లైన్ మాయాజాలం, సోషల్ మీడియా వ్యసనం నుంచి చిన్నారులను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త విప్లవం మొదలైంది. చేతిలో స్మార్ట్‌ఫోన్, కళ్లలో అంతులేని స్క్రోలింగ్ ప్రపంచంతో లోకాన్ని మరిచిపోతున్న బాల్యాన్ని రక్షించుకోవడానికి డిజిటల్ సరిహద్దులు సిద్ధమవుతున్నాయి. అల్గారిథమిక్ రికమెండేషన్ల ఉచ్చులో పడి ఆందోళన, ఒంటరితనం, డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్న నేటి తరాన్ని వాస్తవ ప్రపంచంలోకి మళ్లించేందుకు కఠినమైన చట్టాల అవసరం ప్రపంచ దేశాలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.
ఈ నేపథ్యంలోనే, 16 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ కెనడా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త డిజిటల్ భద్రతా బిల్లును (డిజిటల్ సేఫ్టీ యాక్ట్) ఆ దేశ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ ద్వారా కలిగే హానికరమైన ప్రభావాలు అత్యంత తీవ్రంగా ఉన్నాయని, పిల్లల భద్రతను ఏమాత్రం విస్మరించకూడదని కెనడియన్ ఐడెంటిటీ అండ్ కల్చర్ మంత్రి మార్క్ మిల్లర్ స్పష్టం చేశారు. అయితే, నిర్దేశిత భద్రతా ప్రమాణాలను పాటించే ప్లాట్‌ఫామ్‌లకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
నిబంధనలను ఉల్లంఘించి పిల్లలకు యాక్సెస్ ఇచ్చే కంపెనీలపై కెనడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. ఆయా సంస్థల ప్రపంచవ్యాప్త ఆదాయంలో 3 శాతం లేదా గరిష్టంగా C$10 మిలియన్ల (దాదాపు 7.2 మిలియన్ డాలర్లు) భారీ జరిమానా విధిస్తారు. అలాగే, అనుమతి లేకుండా షేర్ చేసే అశ్లీల చిత్రాలను రిపోర్ట్ చేసిన 24 గంటల్లోగా ఆయా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని ఈ బిల్లు స్పష్టం చేసింది.
ప్రత్యేక డిజిటల్ రెగ్యులేటరీ సంస్థ
AI చాట్‌బాట్‌లను పర్యవేక్షించడానికి, వాటికి భద్రతా ప్రమాణాలను రూపొందించడానికి ఒక ప్రత్యేక డిజిటల్ రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఓపెన్‌ఏఐ సంస్థపై దేశంలో నమోదైన న్యాయపరమైన వ్యాజ్యాల నేపథ్యంలో ఈ ప్రతిపాదన రావడం గమనార్హం. పిల్లలను సోషల్ మీడియా మాయాజాలం నుంచి కాపాడి, వారు వాస్తవ ప్రపంచంలో మెరుగైన నైపుణ్యాలను అలవర్చుకునేలా ప్రోత్సహించడానికి ఈ చట్టం తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ బిల్లు పూర్తిగా ఆమోదం పొంది, అమలులోకి రావడానికి దాదాపు రెండేళ్లపైనే సమయం పట్టవచ్చని అంచనా.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నిషేధాల జోరు
సోషల్ మీడియా నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చ రోజురోజుకూ బలపడుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాలు 16 ఏళ్ల లోపు పిల్లలపై పూర్తి స్థాయి నిషేధాన్ని విధించగా.. బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాలు పాక్షిక ఆంక్షలను అమలు చేస్తున్నాయి. మరోవైపు ఫ్రాన్స్, డెన్మార్క్, పోలాండ్ దేశాలు సైతం కఠినమైన నిబంధనలను పరిశీలిస్తున్నాయి. గ్రీస్ దేశం సైతం అడుగు ముందుకు వేసి, 15 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై నిషేధాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
భారత్‌లోనూ నిషేధం అత్యావశ్యం!
ప్రపంచ దేశాల బాటలోనే భారతదేశంలో కూడా పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్‌లో చౌకైన ఇంటర్నెట్ లభ్యత కారణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా కోట్ల మంది బాలలు స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలవుతున్నారు. ఇది వారి చదువును దెబ్బతీయడమే కాకుండా సైబర్ బుల్లీయింగ్, ఆన్‌లైన్ వేధింపులు, రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదకర పరిణామాలకి దారితీస్తోంది. భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థలను కాపాడుకుంటూ, భావి భారత పౌరులను మానసిక ఒత్తిడి నుంచి దూరం చేసి వారి శారీరక, మేధో వికాసానికి బాటలు వేయాలంటే మన దేశంలోనూ కఠినమైన 'డిజిటల్ సేఫ్టీ' చట్టాలు రావడం తక్షణ అవసరం.














Click it and Unblock the Notifications