అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి.. కువైట్ సంచలన నిర్ణయం!
మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) బహ్రెయిన్, కువైట్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఆకస్మిక వైమానిక దాడుల నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రక్షణను దృష్టిలో ఉంచుకుని తమ ఎయిర్ స్పేస్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే అన్ని రకాల కమర్షియల్ విమాన సర్వీసులను రద్దు చేసింది. అంతేకాకుండా కువైట్ వైపు వస్తున్న అంతర్జాతీయ విమానాలను పొరుగు దేశాలకు మళ్లించారు. ఇరాన్ దాడుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ అత్యవసర చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడిని తిప్పికొట్టేందుకు కువైట్ సైన్యం రంగంలోకి దిగింది. కువైట్ మిలిటరీ జనరల్ స్థాఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నింటినీ అప్రమత్తం చేశారు. ఆకాశంలోనే ఇరాన్ క్షిపణులను, డ్రోన్లను గుర్తించి కువైట్ రక్షణ దళాలు విజయవంతంగా కూల్చివేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ శత్రు మూకల దాడుల నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు తీవ్రమైన రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
అమెరికా లక్ష్యంగా ఇరాన్ జరిపిన ఈ దాడుల్లో కువైట్, బహ్రెయిన్ దేశాల్లో ఉన్న దాదాపు 18 అమెరికా సైనిక స్థావరాలను ఐఆర్జీసీ టార్గెట్ చేసింది. ఇందులో కువైట్‌కు చెందిన అలీ అల్ సలేమ్, అహ్మద్ అల్ జాబర్ ఎయిర్‌బేస్‌లతో పాటు బహ్రెయిన్‌లోని 'షేక్ ఈసా' ఎయిర్‌బేస్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో వినాశకర దాడులు చేసింది. ఈ దాడుల వల్ల అమెరికాకు చెందిన కమాండ్ సెంటర్లు, ఫైటర్ జెట్ హ్యాంగర్లు, డ్రోన్ స్థావరాలు భారీగా దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది.
అమెరికా వరుసగా రెండు రోజుల పాటు ఇరాన్‌పై దాడులు చేయగా.. ఇరాన్ కూడా అంతే దీటుగా అమెరికాకు మద్దతుగా ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాలపై ప్రతీకార దాడికి దిగింది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ వంటి దేశాల్లో అమెరికా తన సైనికులను, ఫైటర్ జెట్లను, ఆయుధాలను మోహరించినందుకే ఇరాన్ ఈ దేశాలను లక్ష్యంగా చేసుకుంది. అమెరికా గనుక తన దాడులను ఆపకపోతే, రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ ప్రతీకార దాడులు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.













Click it and Unblock the Notifications