పన్నీర్‌లో కలవరం.. నేడు సచివాలయానికి.. 'ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు?'
ఇంకా టచ్ లోకి రాని ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులను నేరుగా కలవడంతో పాటు, సోషల్ మీడియా ద్వారా తనకు మద్దతుగా ప్రచారాన్ని ఉధృతం చేయాలనే భావనలో పన్నీర్ సెల్వం ఉన్నట్టు సమాచారం.
చెన్నై: ఎంపీలు, కార్యకర్తలు తనకు అండగా నిలబడ్డ ఎమ్మెల్యేల నుంచి మాత్రం ఊహించినంత స్పందన రాకపోవడంతో ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలో కలవరం మొదలైంది. ఇలాంటి సమయంలో దాదాపు 10రోజుల సంక్షోభం తర్వాత ఆయన తొలిసారిగా సచివాలయానికి వెళ్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నేటి మధ్యాహ్నాం సచివాలయానికి వెళ్లనున్న ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుబ్రహ్మణ్య స్వామి లాంటి నేతలు డిమాండ్ చేస్తుండటంతో.. విద్యాసాగర్ రావు ఈరోజు నిర్ణయం ప్రకటిస్తారా? అన్నది కూడా ఉత్కంఠకు తెరదీస్తోన్న అంశం.

పన్నీర్‌ను వారించిన అధికారులు:
ఇదిలా ఉంటే అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలను ఎలా తనవైపుకు తిప్పుకోవాలనే ప్లాన్ లో పన్నీర్ తలమునకలయ్యారు. ఎమ్మెల్యేలను దాచి ఉంచిన రిసార్టుకు స్వయంగా తానే వెళ్లి వారితో మాట్లాడాలని పన్నీర్ అనుకున్నప్పటికీ.. అది ప్రైవేట్ ప్రదేశం కావడంతో ఆయన్ను అధికారులు వారించినట్టు తెలుస్తోంది.

వ్యూహ రచనలో పన్నీర్:
మొత్తం 25మంది ఎమ్మెల్యేలు తమ గూటికి చేరుతారని సెల్వం భావించినప్పటికీ.. మంత్రి పాండియరాజన్ మాత్రమే ఆయనకు మద్దతుగా నిలిచారు.
మరోవైపు శశికళ శిబిరం నుంచి జంప్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు పన్నీర్ గూటికి చేరుతారని వార్తలు వచ్చినప్పటికీ.. ఇంతవరకు వారు పన్నీర్ తో టచ్ లోకి రాలేదు. దీంతో ఎమ్మెల్యే మద్దతు కూడగట్టడానికి ఎటువంటి పంథా అనుసరించాలనే యోచనలో ఉన్నారాయన.

ఒత్తిడి పెంచాలనుకుంటున్న పన్నీర్:
శశికళ శిబిరం నుంచి ఎమ్మెల్యేలంతా తనవైపుకు కదులుతారనుకున్న పన్నీర్ కు పరిణామాలు మాత్రం ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. దీంతో ఎక్కడినుంచి ఆట మొదలుపెట్టాలని ఆయన తర్జన భర్జన పడుతున్నారు.
ఇదే క్రమంలో ఆదివారం నాడు ముఖ్య నేతలతో విస్తృతంగా చర్చించిన ఆయన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా వారిని తనవైపు తిప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇందుకోసం కుటుంబ సభ్యులను నేరుగా కలవడంతో పాటు, సోషల్ మీడియా ద్వారా తనకు మద్దతుగా ప్రచారాన్ని ఉధృతం చేయాలనే భావనలో ఉన్నట్టు సమాచారం.

వాళ్లంతా ఎక్కడా?:
అన్నాడీఎంకె ఎమ్మెల్యేలను దాచి ఉంచిన రిసార్టులో కాంచిపురం ఎస్పీ ముత్తరసి జరిపిన దాడిలో కేవలం 94మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. అన్నాడీఎంకె నుంచి మొత్తం 134మంది ఎమ్మెల్యేలు గెలవగా.. ప్రస్తుతం 32మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారన్న దానిపై స్పష్టత లేదు. దీంతో వాళ్లెక్కడున్నారో తెలుసుకుని మంతనాలు జరిపేందుకు పన్నీర్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications