Parliament : ముందుకెళ్లని అవిశ్వాసం ! అట్టుడుకుతున్న పార్లమెంట్ -2 గంటలకు మణిపూర్ చర్చ..
పార్లమెంట్ సమావేశాల్లో ఇవాళ కూడా మణిపూర్ నిరసనలు మిన్నంటాయి. ఉభయసభలు ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే విపక్షాలు అవిశ్వాస తీర్మానంతో పాటు మణిపూర్ పై నిరసనలు వ్యక్తం చేశాయి. దీంతో ఉభయసభల్లోనూ కార్యకలాపాలు నిలిచిపోయాయి. విపక్షాలకు సర్దిచెప్పేందుకు సభాపతులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఇరుసభలూ వరుసగా వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే అవిశ్వాస తీర్మానానికి బదులుగా మణిపూర్ పై చర్చకు కేంద్రం సిద్ధమైంది.
మణిపూర్ అంశం ఇవాళ పార్లమెంట్ ను మరోసారి కుదిపేసింది. ఇండియా కూటమితో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య పార్లమెంట్ లో ప్రతిష్టంభన కొనసాగింది. లోక్‌సభలో నినాదాలు, నిరసనల మధ్య ప్రారంభమైన నిమిషాలకే సభా కార్యక్రమాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. మరోవైపు మణిపూర్‌పై రూల్ 176 కింద స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్యసభలో సభా నాయకుడు పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ప్రతిపాదనను చైర్మన్ ఆమోదించారు. కానీ ప్రతిపక్షం రూల్ 267 కింద చర్చకు పట్టుబట్టింది. చర్చకు ముందు ప్రధానమంత్రి ప్రకటన చేయాలని పట్టుబడుతోంది. దీంతో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

మణిపూర్ లో జరుగుతున్న హింసాకాండపై జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన ప్రారంభమైనప్పటి ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.ప్రతిపక్షాల ఇండియా కూటమికి చెందిన ఎంపీలు హింసాకాండతో దెబ్బతిన్న మణిపూర్ లో రెండు రోజుల పర్యటన తర్వాత ఆదివారం న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ లో నిజనిర్ధారణ పర్యటన ముగించుకున్న ఎంపీల 21 మంది సభ్యుల బహుళ-పార్టీ ప్రతినిధి బృందం ఇవాళ పార్లమెంట్‌లోని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో సమావేశమై ఫ్లోర్ లీడర్‌లకు పరిస్ధితిని వివరించింది.
దీంతో ప్రధాని ప్రకటన తర్వాతే పార్లమెంట్ లో దీనిపై చర్చకు అంగీకరించాలని విపక్షాలు నిర్ణయించాయి. అయితే ఇందుకు కేంద్రం ఒప్పుకోవడం లేదు. చర్చ తర్వాతే ప్రకటన ఉంటుందని చెబుతోంది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు కూడా మణిపూర్ చర్చ జరగడం అసాధ్యంగానే కనిపిస్తోంది. మరోవైపు తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం భయపడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications