వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటు: రేపటి నుంచి వర్షాకాల సమావేశాలు, మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలివే

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

జులై 19, సోమవారం, నుంచి మొదలుకాబోతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరగబోతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు డజనుకుపైగా కొత్త బిల్లులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సిద్ధంచేసింది. అయితే, కరోనావైరస్ సెకండ్ వేవ్‌ సమయంలో ప్రభుత్వం చేసిన తప్పిదాలు, రైతుల నిరసనలు, సరిహద్దుల్లో చైనా కార్యకలాపాలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని తూర్పారబట్టేందుకు విపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.

వర్షాకాల సమావేశాల సమయంలో పార్లమెంటు వెలుపల తమ రైతులు నిరసనలు చేపడతారని భారతీయ కిసాన్ యూనియన్ ఇప్పటికే స్పష్టంచేసింది. దీని వల్ల పార్లమెంటులో గందరగోళం మరింత పెరిగే అవకాశముంది.

ముఖ్యంగా కోవిడ్-19 వ్యాప్తికి కళ్లెం వేయడంలో విఫలం కావడం, దేశ రాజధాని దిల్లీలో ఆక్సిజన్ అందక మరణాలు సంభవించడం తదితర అంశాలపై ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరుకున పడేయాలని విపక్షాలు భావిస్తున్నాయి.

మరోవైపు రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగిందని జూన్ 23న కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకుంది. అయితే ఆ తర్వాత నుంచి మళ్లీ వ్యాక్సీన్ కార్యక్రమాలు నత్తనడకన సాగటం మొదలుపెట్టాయి. ఈ అంశంపై కూడా ప్రభుత్వానికి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది.

వ్యూహాల మార్పు..

రాజ్యసభలో తమ సభాపక్ష నేతగా పీయూష్ గోయల్‌కు మోదీ సర్కారు బాధ్యతలు అప్పగించింది. ఇదివరకు థావర్‌చంద్ గహ్లోత్ ఈ పదవిలో ఉండేవారు. ఆయనను కర్నాటక గవర్నర్‌గా నియమించడంతో పీయూష్ గోయల్‌కు ఈ పదవి దక్కింది.

భిన్న పార్టీల్లోని నేతలతో పీయూష్ గోయల్‌కు మంచి సంబంధాలున్నాయి. మరోవైపు సభా కార్యక్రమాల నిర్వహణలోనూ ఆయనకు అనుభవముంది. దీంతో ఆయన్ను తమ సభాపక్ష నేతగా మోదీ ప్రభుత్వం ఎంచుకుంది.

ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నాయకుల్ని గోయల్ కలిశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ, ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ తదితరులను ఆయన కలిశారు. సభా కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడాలని ఆయన అభ్యర్థించారు.

లోక్‌సభలో తమ సభాపక్ష నేతగా అధిర్ రంజన్ చౌధరినే కొనసాగిస్తున్నట్లు కాంగ్రెస్ స్పష్టంచేసింది. ఆయన్ను ఈ పదవి నుంచి తొలగిస్తారని కొన్ని రోజుల నుంచి ఊహాగానాలు వచ్చాయి.

మరోవైపు సభ ప్రశాంతంగా నిర్వహించేందుకు, ఫలప్రదం అయ్యేందుకు సహకరించాలని సభ్యులను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోరారు.

కరోనా వ్యాప్తి భయం నడుమ

పార్లమెంటును కూడా కరోనావైరస్ వ్యాప్తి ఆందోళన వెంటాడుతోంది. గత మూడు పార్లమెంటు సమావేశాలను వైరస్ వ్యాప్తి ఆందోళనల నడుమ మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. 2020 శీతకాల సమావేశాలు అయితే, అసలు నిర్వహించనే లేదు.

ఇప్పటికీ కరోనావైరస్ వ్యాప్తి ముప్పు తొలగిపోలేదు. అందుకే ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో కేవలం 280 మంది సభ్యులు మాత్రమే లోక్‌సభలోని ప్రధాన చర్చా ప్రాంగణంలో కూర్చుంటారు. మరో 259 మంది సందర్శకుల గ్యాలరీల్లో కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు. రాజ్యసభలోనూ ఇలాంటి ఏర్పాట్లు చేశారు.

కరోనావైరస్ వ్యాపించకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా స్పష్టంచేశారు. అధికారులు, మీడియా కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

వ్యాక్సీన్ రెండు డోసులు లేదా ఒక డోసు తీసుకున్న సభ్యులు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సిన పనిలేదు. పార్లమెంటు భవన సముదాయంలో కూడా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసేలా ఏర్పాట్లు చేశారు.

లోక్‌సభలో 441 మంది సభ్యులు ఇప్పటికే వ్యాక్సీన్లు తీసుకున్నారని, మిగతా వారు ఆరోగ్య కారణాలతో వ్యాక్సీన్లు తీసుకోలేదని బిర్లా తెలిపారు.

కరోనావైరస్ వ్యాప్తి ఆందోళనల నడుమ పార్లమెంటును చూసేందుకు సందర్శకులకు అనుమతిలేదని బిర్లా వివరించారు.

మొదటి రోజు ఏం జరుగుతుంది?

ఇటీవల ఎన్నికైన నలుగురు కొత్త ఎంపీలు తొలిరోజు సమావేశాల్లో ప్రమాణం చేస్తారు. తిరుపతి నుంచి ఎన్నికైన వైఎస్సార్‌సీపీ నాయకుడు గురుమూర్తి, బెలగావి నుంచి ఎన్నికైన బీజేపీ నాయకుడు మంగళ్ సురేశ్ అంగడి, మళప్పురం నుంచి ఎన్నికైన ముస్లిం లీగ్ నాయకుడు అబ్దుసమాద్ సమదాని, కన్యాకుమారి నుంచి ఎన్నికైన కాంగ్రెస్ నాయకుడు విజయ్ కుమార్ తదితరులు ప్రమాణం చేస్తారు.

ప్రమాణ స్వీకారం అనంతరం బడ్జెట్, వర్షాకాల సమావేశాల మధ్య కాలంలో మరణించిన 40 మంది మాజీ ఎంపీలకు నివాళులు అర్పిస్తారు.

ఆ తర్వాత కొత్తగా మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న నాయకుల్ని మోదీ సభకు పరిచయం చేస్తారు.

బిల్లులు ఇవీ..

తొలి రోజు సభలో ఫ్యాక్టరింగ్ నియంత్రణ (సవరణ) బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. ఫ్యాక్టరింగ్ వ్యాపార లావాదేవీల్లో పాలుపంచుకునే సంస్థల పరిధిని విస్తరించడమే లక్ష్యంగా ఈ బిల్లును సిద్ధంచేశారు. ఫ్యాక్టరింగ్ అనేది రెండు ఆర్థిక సంస్థల మధ్య రుణ బదిలీ కోసం జరిగే ఓ వ్యాపార లావాదేవీ.

మరోవైపు కొత్తగా క్యాబినెట్‌లో చోటు సంపాదించిన పశుపతి కుమార్.. ''నేషనల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫూడ్ టెక్నాలజీ, ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ బిల్లు’’ను ప్రవేశపెడతారు. దేశంలోని కొన్ని ఫూడ్ టెక్నాలజీ సంస్థలను జాతీయ ప్రాధాన్యతా సంస్థలుగా గుర్తించేందుకు ఈ బిల్లును సిద్ధంచేశారు.

తన మేనల్లుడు, ఎల్జేపీ నాయకుడైన చిరాగ్ పాసవాన్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసి పశుపతి ఇటీవల వార్తల్లో నిలిచారు. అయితే, చిరాగ్ స్థానంలో పశుపతిని పార్టీ లోక్‌సభా పక్షనేతగా నియమిస్తున్నట్లు ఎల్జేపీ స్పష్టంచేసింది.

మోదీ

ఆమోదం పొందేందుకు..

వర్షాకాల సమావేశాల్లో ఆమోదింప చేసుకునేందుకు 15 కొత్త బిల్లులు, తొమ్మిది పెండింగ్ బిల్లులు, అరడజను ఆర్డినెన్సులను ప్రభుత్వం సిద్ధం చేసింది.

డీఎన్‌ఏ టెక్నాలజీ బిల్లు; తల్లిదండ్రులు, వృద్ధుల సంక్షేమ బిల్లు; నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫూడ్ టెక్నాలజీ; మారిటైమ్ అసిస్టెన్స్ అండ్ నేవిగేషన్ బిల్లు, బాలల సంరక్షణ బిల్లులను ఆమోదింప జేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థల్లో నిరసనలపై నిషేధం విధించేందుకు సిద్ధంచేసిన వివాదాస్పద ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లును కూడా ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

కొత్త సినిమాటోగ్రాఫ్ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతారని వార్తలు వస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని సమీక్షించాలని కోరే అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లు కల్పిస్తోంది. క్యాబినెట్ అనుమతి అనంతరం ఈ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Parliament: The monsoon sessions from tomorrow are the questions that the Opposition will face on the Modi government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X