అయ్యప్ప స్వామిపై పేరడీ పాటేంట్రా- పిచ్చి కాకపోతే
కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజూ వేలాదిమంది దర్శించుకుంటోన్నారు. డిసెంబర్ 26వ తేదీన మండలం పూజలు ముగియనున్నాయి. మకరవిళక్కు కోసం మళ్లీ 30వ తేదీన స్వామివారి ఆలయాన్ని తెరుస్తారు. ఈ 16వ తేదీన మండలం పూజల కోసం అయ్యప్ప స్వామివారి ఆలయం తెరచుకుంది. అయ్యప్ప స్వామిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 20 లక్షలు దాటింది.
ఈ పరిస్థితుల మధ్య అయ్యప్ప స్వామిపై రూపొందించిన ఓ పేరడీ పాట దుమారం రేపుతోంది. కేరళ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైరల్ అయిన 'పూతియే కెట్టియే' అనే రాజకీయ వ్యంగ్య గీతంపై ఫిర్యాదు నమోదైంది. అయ్యప్ప భక్తి గీతం 'పోట్టియే కెట్టియే'కు పేరడీగా దీన్ని చిత్రీకరించారు. ఈ పాటను వామపక్షాల సారథ్యంలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ పై దుమ్మెత్తిపోయడానికి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ఉపయోగించాయి.

శబరిమలలో సీపీఎం కార్యకర్తలు బంగారం అక్రమ రవాణా చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ పాట రాశారు. దీన్ని అయ్యప్ప స్వామి భక్తి గీతంగా కంపోజ్ చేశారు. ఈ పాట ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపోటములపై తీవ్రంగా ప్రభావాన్ని చూపింది. పిల్లలతో సహా అందరినీ ఆకట్టుకున్న ఈ గీతం- సోషల్ మీడియా రీల్ మేకర్స్‌కు కూడా ఎంతో ఆదరణ పొందింది. ఈ వ్యంగ్య గీతాన్ని ఎల్డీఎఫ్ తో పాటు గోల్డ్ థెఫ్ట్ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టిని ఉద్దేశించి రాశారు.
ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామిని కించపరిచేలా, కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ పాట ఉందనే కారణంతో ఎల్డీఎఫ్ రంగంలోకి దిగింది. తిరువాభరణం పాద సంరక్ష సమితి ప్రధాన కార్యదర్శి ప్రసాద్ కుజికల్.. పోలీస్ డైరెక్టర్ జనరల్ కు ఫిర్యాదు చేశారు. వ్యంగ్య గీతం అయ్యప్ప భక్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని, భక్తి గీతాన్ని రాజకీయ లబ్ధి కోసం దుర్వినియోగం చేశారని ఆయన పేర్కొన్నారు.
డీజీపీ ఈ ఫిర్యాదును అదనపు డీజీపీకి పంపారు. దీనిపై కేసు నమోదు చేయడానికి అవకాశం ఉందో లేదో అంచనా వేయాలని డీజీపీ ఆదేశించారు. డానిష్ మలప్పురం ఈ గీతాన్ని ఆలపించారు. ఈ పాటకు కుంజబ్దుల్లా సాహిత్యాన్ని అందించారు. మలప్పురానికి చెందిన సుబైర్, హనీఫా మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ పేరడీ పాట స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.












Click it and Unblock the Notifications