పతంజలిపై బ్యాన్: కేంద్రం కళ్లు మూసుకుని కూర్చుందా: సుప్రీంకోర్టు ఫైర్
Patanjali: ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీలకు దేశ అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. పతంజలి ఉత్పత్తుల అడ్వర్టయిజ్‌మెంట్స్‌ను నిషేధించింది. కోర్టు ఆదేశాల ఉల్లంఘన నోటీసులనూ పంపించింది. కేంద్ర ప్రభుత్వానికీ చీవాట్లు పెట్టింది.
తమ ఆయుర్వేద ఉత్పత్తులు కరోనా వైరస్ వంటి మహమ్మారిని నయం చేస్తాయంటూ గతంలో పతంజలి ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల కిందట విస్తృతంగా వ్యాపార ప్రకటనలను ఇచ్చింది. ఈ యాడ్స్‌పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేకుండానే పతంజలి ఈ రకమైన ప్రచారం చేస్తోందంటూ పేర్కొంది. సుప్రీంకోర్టులో పిటీషన్‌ను దాఖలు చేసింది.

దీనిపై జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఘాటు వ్యాఖ్యలు చేసింది. నేడు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అడ్వర్టయిజ్‌మెంట్లను తక్షణమే నిషేధించాలని ఆదేశించింది.
డ్రగ్స్ అండ్ మేజిక్ రెమెడీస్ యాక్ట్ కింద పతంజలి యాజమాన్యం తమ ఉత్పత్తులపై అడ్వర్టయిజ్‌మెంట్స్ గానీ మార్కెటింగ్ గానీ చేపట్టకూడదని ఆదేశించింది. పతంజలి గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీసులను జారీ చేసింది. కోటి రూపాయల వరకు జరిమానా ఎందుకు విధించకూడదని ప్రశ్నించింది.
చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుని ఉన్నట్టు కనిపిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. రెండు సంవత్సరాల పాటు డ్రగ్స్ అండ్ మేజిక్ రెమెడీస్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టమౌతోన్నప్పటికీ కేంద్రం ఎందుకు చర్యలను తీసుకోలేదని నిలదీసింది.












Click it and Unblock the Notifications