పరుగులు పెడుతున్న పేటీఎం షేర్ల ధర: ఒక్కో షేర్‌పై..
ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన పేటీఎం షేర్ల ధర పరుగులు పెడుతోంది. అయిదు శాతం మేర పెరుగుదల కనిపించింది. చాలాకాలం తరువాత 700 రూపాయల మార్క్‌ను అధిగమించింది. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభమైనప్పటి నుంచీ అప్పర్ సర్కుట్‌లోనే ట్రేడ్ అవుతోన్నాయి ఈ కంపెనీ షేర్లు.
2022-2023 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం జనవరి-ఫిబ్రవరి-మార్చి కాలానికి సంబంధించిన ఫలితాలను పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నాలుగో త్రైమాసికంలో కంపెనీ నష్టాలు భారీగా తగ్గాయి. 168.4 కోట్ల రూపాయల నష్టాలను చూపించింది. 2021-2022 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోల్చుకుంటే సుమారు 600 కోట్ల రూపాయల నష్టాలను తగ్గించుకోగలిగింది.

ఆ త్రైమాసికంలో 761.4కోట్ల రూపాయల నష్టాలను చూపించింది వన్ 97 కమ్యూనికేషన్స్. ఇప్పుడీ నష్టాలను 168 కోట్లకు తగ్గించుకోగలిగింది. చివరి త్రైమాసికంలో 51 శాతం లాభాలను ఆర్జించామని, ఫలితంగా నష్టాలు తగ్గాయని వివరించింది. గ్రాస్ మార్కంటైస్ వాల్యూ, సబ్‌స్క్రిప్షన్స్ రెవెన్యూ, రుణాల మంజూరు భారీ పెరగడం, యూపీఐ కార్యకలాపాల్లో పెరుగుదల నమోదు కావడం వంటి కారణాలతో 51 శాతం లాభాలను నమోదు చేసినట్లు పేర్కొంది.
ఈ చివరి త్రైమాసికంలో 2,334 కోట్ల రూపాయల మేర రెవెన్యూ ఆపరేషన్స్‌ను నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో నమోదైన రెవెన్యూ 1,540.9 కోట్ల రూపాయలు. సౌండ్ బాక్స్, పాయింట్ ఆఫ్ సేల్ వంటి పేమెంట్ డివైజ్‌ల సబ్‌స్క్రిప్షన్ సర్వీసులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది మార్చి చివరి నాటికి 68 లక్షల మేర మర్చంట్ పేయింగ్ సబ్‌స్క్రిప్షన్ డివైజ్‌ల వినియోగం రికార్డయంది. గత ఏడాది మార్చి నాటికి ఈ సంఖ్య 29 లక్షలే.
కంపెనీ ఆర్థిక లావాదేవీల్లో 51 శాతం పురోభివృద్ధి నమోదు కావడం పేటీఎం షేర్ల ధరలు భారీగా పెరగడానికి కారణమైంది. ఈ ఉదయం బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లల్లో 695 రూపాయల వద్ద పేటీఎం షేర్ల ట్రేడింగ్ ఆరంభమైంది. క్రమంగా ఇది 700 రూపాయల మార్క్‌ను దాటింది. మధ్యాహ్నానికి 724 రూపాయల వద్ద ట్రేడింగ్ రికార్డయింది.
ఒకదశలో 727 రూపాయల వరకు వెళ్లిందీ షేర్ ప్రైస్. శుక్రవారం సాయంత్రం ముగిసిన ట్రేడింగ్‌తో పోల్చుకుని చూస్తే ఒక్కో షేర్‌పై 34 రూపాయల మేర పెరుగుదలను నమోదు చేసుకుంది. ఇది కాస్తా పేటిఎం రిటైల్ ఇన్వెస్టర్లల్లో జోష్ నింపింది. మున్ముందు ఇదే ట్రెండ్ కొనసాగుతోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.












Click it and Unblock the Notifications