160 ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థిని- దిమ్మతిరిగేలా డీకే మెజారిటీ
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. తాజా సమాచారం ప్రకారం- 136 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇందులో పలు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. అధికార భారతీయ జనతా పార్టీ 63 నియోజకవర్గాలకే పరిమితమైంది. పలువురు మంత్రులు ఓటమిపాలయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్) బాగా నష్టపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే 16 స్థానాలను జేడీఎస్ కోల్పోయింది. ప్రస్తుతం 22 నియోజకవర్గాల్లో జేడీఎస్ ఆధిక్యతలో ఉంది. ఇతరులు నాలుగు చోట్ల లీడింగ్‌లో ఉన్నారు. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 113 స్థానాలు అవసరం. ఈ మార్క్‌ను అలవోకగా అందుకుంది కాంగ్రెస్.

కర్ణాటకలో విజయం సాధించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా శ్రమించింది. ఏఐసీసీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గె, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య.. పార్టీ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేయగలిగారు. హైకమాండ్ మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త వరకు క్యాడర్‌ను సమన్వయం చేసుకోగలిగారు.
డీకే శివకుమార్ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. కనకపుర నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు ఆర్ అశోకపై భారీ ఆధిక్యంతో విజయఢంకా మోగించారు. 1,24,841 ఓట్ల తేడాతో డీకే శివకుమార్ విజయం సాధించారు. 2018 నాటి ఎన్నికలతో పోల్చుకుంటే ఆయన మెజారిటీ భారీగా పెరిగింది. అప్పట్లో ఆయనకు లభించిన ఓట్లు 79,909 కాగా.. ఈ సారి లక్ష మార్క్‌ను దాటారు.

మరోవంక- కాంగ్రెస్ పార్టీకే చెందిన సౌమ్యా రెడ్డి అత్యల్ప మెజారిటీని సాధించారు. బెంగళూరులోని జయనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారామె. తొలి రౌండ్ నుంచీ వెనుకంజలో ఉంటూ వచ్చిన సౌమ్యారెడ్డి చివరికి 160 ఓట్ల తేడాతో ఒడ్డెక్కారు. నామమాత్రపు మెజారిటీ కావడం వల్ల బీజేపీ అభ్యర్థి రామ్మూర్తి రీకౌంటింగ్ కోసం డిమాండ్ చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే సౌమ్యా రెడ్డి హుటాహుటిన ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకున్నారు. గెలిచిన నేపథ్యంలో- అప్పటికే విజయోత్సవాలను జరుపుకొంటోన్న సౌమ్యారెడ్డి, ఆమె అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పరుగులు పెట్టారు. రీకౌంటింగ్ కోసం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోలేమని, వినతిపత్రాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉందని రిటర్నింగ్ అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications