భారత్ న్యూస్ కవర్ చేసిన పాక్ ఛానెల్.. అక్కడి ప్రభుత్వం ఏం చేసిందంటే..?
దివంగత గాయని ఆశా భోస్లేకు నివాళి ఘటిస్తూ భారతీయ కంటెంట్‌ను ప్రసారం చేసినందుకు పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (PEMRA) ఒక వార్తా ఛానెల్‌కు సంజాయిషీ నోటీసు ఇచ్చింది. ఇది 2018 నుండి అమలులో ఉన్న భారతీయ కంటెంట్ ప్రసార నిషేధాన్ని ఉల్లంఘించిందని PEMRA ఆరోపించింది. ఈ ఘటన మీడియా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
గాయని ఆశా భోస్లే 2026, ఏప్రిల్ 12న ముంబైలో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె మరణం ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను కలచివేసింది. పాకిస్తానీ జియో న్యూస్ ఆమెకు నివాళి అర్పించగా, ఇదే ప్రసారం ఛానెల్‌ను ప్రస్తుతం సమస్యల్లోకి నెట్టింది.
పీటీఐ నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లో 2018 నుండి భారతీయ కంటెంట్ ప్రసారాలపై నిషేధం కొనసాగుతోంది. PEMRA సోమవారం నాడు జియో న్యూస్‌కు నోటీసు జారీ చేసి, ఆశా భోస్లే మరణవార్త సమయంలో భారతీయ కంటెంట్‌ను ఎందుకు ప్రసారం చేశారో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కోరింది.
జియో న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ అజహర్ అబ్బాస్ ఎక్స్ లో దీనిపై స్పందించారు. "కళాకారుల గురించినివేదించేటప్పుడు వారి సేవలను గుర్తుచేసుకోవడం ఆనవాయితీ. ఆశా భోస్లే వంటి దిగ్గజ గాయని పాటలను ఇంకా ఎక్కువగా ప్రసారం చేయాల్సింది. కానీ PEMRA దీనిని పరిమితం చేసింది."
అబ్బాస్ తన పోస్ట్‌లో ఇంకా రాస్తూ, "ఆశా భోస్లే స్వయంగా పాకిస్తాన్ గాయని నూర్ జహాన్‌ను 'పెద్దక్క' అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆమె నుస్రత్ ఫతే అలీ ఖాన్‌తో కలసి పనిచేశారు, నాసిర్ కాజ్మీ వంటి ఉర్దూ కవుల కవిత్వానికి జీవం పోశారు." కళకు సరిహద్దులుండవని ఆయన చెప్పారు.
అబ్బాస్ ముగిస్తూ, "యుద్ధాలు, ఘర్షణల సమయంలో కళ, కళాకారులు బాధితులు కారాదు. మేధావులు, సంగీతకారులు, సృష్టికర్తలు తరచుగా ద్వేషం, విభజనలకు వ్యతిరేకంగా నిలబడి, ప్రజలను దగ్గర చేస్తారు" అని వ్యాఖ్యానించారు. శాంతి స్థాపనలో కళాకారుల పాత్ర కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.
పాకిస్తాన్ సుప్రీంకోర్టు విధించిన భారతీయ కంటెంట్ ప్రసార నిషేధాన్ని జియో న్యూస్ ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిందని PEMRA స్పష్టం చేసింది. ఈ ప్రసారం ద్వారా ఛానెల్, PEMRA రూల్స్ 2009, 2012 రెగ్యులేషన్స్, 2015 కోడ్ ఆఫ్ కండక్ట్ నుండి పలు నిబంధనలను ఉల్లంఘించిందని నోటీసులో పేర్కొంది.
జియో న్యూస్ సీఈఓను ఏప్రిల్ 27న హాజరు కావాలని PEMRA ఆదేశించింది. ఛానెల్‌పై చట్టపరమైన చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో వివరించి, 14 రోజుల్లోగా లిఖితపూర్వక సంజాయిషీని సమర్పించాలని నోటీసులో స్పష్టం చేసింది.

ఆశా భోస్లే 2026, ఏప్రిల్ 12న 92వ ఏట తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్కులో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. సినీ, సంగీత, రాజకీయ ప్రముఖులు ఆమె వీడ్కోలుకు హాజరై నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications