గుంపులుగా ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు: కరోనాకు గేట్‌వేలుగా: కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత నుంచి దేశం క్రమంగా కుదురుకుంటోంది. కొద్దిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతూ వస్తోన్నాయి. కరోనా మరణాలు సైతం అదే స్థాయిలో తగ్గాయి. ఇదివరకట్లా వేల సంఖ్యలో నమోదు కావట్లేదు. మంగళవారం నాటి బులెటిన్ ప్రకారం.. దేశంలో 31,443 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రికవరి రేటు 97.28 శాతంగా నమోదైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రాష్ట్రాలు కేడా కరోనా వైరస్ ఆంక్షలను సడలించాయి. దేవస్థానాలు, పర్యాటక కేంద్రాలకు ద్వారాలు తెరిచాయి. రాష్ట్రాల మధ్య యథేచ్ఛగా రాకపోకలు సాగించే వాతావరణం ఉంది.
ఇప్పుడు ఆ పరిస్థితులే మరోసారి కరోనా వ్యాప్తి చెందడానికి దారి తీస్తాయనే వాదనలు ఉన్నాయి. పర్యాటక కేంద్రాలకు సందర్శకులు పెద్ద సంఖ్యలో వెళ్తోండటం పట్ల కేంద్ర ప్రభుత్వం సైతం ఆందోళన వ్యక్తం చేసింది. పర్యాటక కేంద్రాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమౌతాయని, సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి సూచించారు. కరోనా వైరస్‌కు పర్యాటక ప్రాంతాలు గేట్‌వేలుగా మారే అవకాశం ఉందని చెప్పారు. కరోనాపై పోరాటం ఇంకా ముగియలేదని, దేశ ప్రజలందరూ తప్పనిసరిగా కోవిడ్ ప్రొటోకాల్స్‌ను అనుసరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా విజ్ఞప్తి చేశారని అన్నారు.

దేశంలో నెలకొన్న ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రఖ్యాత కన్వర్ యాత్రను ఈ ఏడాది రద్దు చేసినట్లు జీ కిషన్ రెడ్డి తెలిపారు. దేశ ప్రజలు, ఆర్థిక రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్ విస్తరించడం వల్ల సంభవించే విపత్కర పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుంపులు గుంపులుగా పర్యాటక కేంద్రాలకు వెళ్లడం.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టవుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న మార్గదర్శకాలు, నిబంధనలను అనుసరించాలని సూచించారు.
మాస్కులను ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం తప్పనిసరిగా పాటించాలని అన్నారు. లాక్‌డౌన్ తరహా పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని కిషన్ రెడ్డి అన్నారు. కరోనా వైరస్ థర్డ్‌వేవ్ రావొచ్చంటూ నిపుణులు చేసిన హెచ్చరికల నేపథ్యంలో కన్వర్ యాత్రను రద్దు చేశామని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే కన్వర్ యాత్ర రద్దు కావడం వరుసగా ఇది రెండోసారి. రెండు వారాల పాటు సాగే ఈ యాత్రం ఈ ఏడాది 25వ తేదీన ఇది ప్రారంభం కావాల్సి ఉంది. భక్తులు కాలి నడకన హరిద్వార్ వంటి క్షేత్రాలకు చేరుకుని గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు.












Click it and Unblock the Notifications