ఎయిర్‌పోర్ట్‌లో దారుణం: చెకింగ్ పేరుతో విదేశీ మహిళపై లైంగిక వేధింపులు!
బెంగళూరు నగరంలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది ఒకరు కొరియా దేశానికి చెందిన మహిళా పర్యాటకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడైన మహ్మద్ అఫాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
సోమవారం(జనవరి 19) నాడు బాధితురాలు కొరియా వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇమ్మిగ్రేషన్ తనిఖీలు ముగించుకుని టెర్మినల్ వైపు వెళ్తుండగా.. ఎయిరిండియా శాట్స్ సంస్థలో గ్రౌండ్ స్టాఫ్ పని చేస్తున్న అఫాన్ ఆమెను అడ్డుకున్నాడు. ఆమె చెక్-ఇన్ లగేజీలో ఏదో సమస్య ఉందని, స్క్రీనింగ్ సమయంలో 'బీప్' శబ్దం వచ్చిందని అబద్ధం చెప్పాడు. సాధారణ స్క్రీనింగ్ కౌంటర్ వద్దకు వెళ్తే సమయం పడుతుందని, దానివల్ల ఆమె విమానం మిస్ అయ్యే అవకాశం ఉందని భయపెట్టాడు. తనిఖీ పేరుతో ఆమెను పురుషుల వాష్‌రూమ్ సమీపానికి తీసుకెళ్లి ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం ఆమెను గట్టిగా హగ్ చేసుకుని థాంక్యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

తక్షణ చర్యలు
బాధితురాలు వెంటనే ఈ విషయాన్ని విమానాశ్రయ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అధికారులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. అఫాన్ చేసిన దారుణం స్పష్టంగా కనిపించింది. దీంతో విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఎయిరిండియా శాట్స్ తీవ్రంగా స్పందించింది. నిందితుడు అఫాన్‌ను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించారు. ఇది ఎన్నటికీ క్షమించరాని నేరమని.. బాధితురాలికి అవసరమైన సహకారం అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై తదుపరి విచారణ జరుపుతున్నారు. విమానాశ్రయం వంటి అత్యంత భద్రత ఉండే ప్రదేశంలో ఇలాంటి ఘటన జరగడం ప్రయాణికులలో భయాందోళనలు కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications