ప్రధాని ఫోన్ చేస్తే సచిన్ ఫోన్ బిజీ, అలర్ట్ చేసిన శుక్లా
న్యూఢిల్లీ/ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుదాముకున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు మాస్టర్ ఫోన్ కాసేపు బిజీ అని వచ్చింది. భారత ప్రభుత్వం సచిన్‌కు, ప్రముఖ శాస్త్రవేత్త సిఎన్ఆర్ రావులకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరికీ ప్రధాని స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
సచిన్‌తో ఫోన్లో మాట్లాడటానికి ప్రధాని చాలాసేపు ప్రయత్నించాల్సి వచ్చింది. ప్రధాని ఫోన్ చేస్తున్నప్పుడు సచిన్ ఫోన్ చాలాసేపు బిజీ అని వచ్చింది. పలువురు అదే సమయంలో అభినందనలు తెలుపుతూ ఫోన్లు చేస్తుండటంతో ప్రధాని కాల్ కలువలేదు. ఈ విషయం సచిన్‌కు తెలియదు. దీంతో ప్రధాని బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాతో మాట్లాడి విషయం చెప్పారు. వెంటనే శుక్లా టెండుల్కర్‌ను అప్రమత్తం చేశారు.

కాగా, సచిన్‌ను ప్రధాని మన్మోహన్ మనసారా అభినందించారు. క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ఆటకు మరెన్నో ఏళ్లు తన సేవలు అందించాలని కోరారు. సచిన్ యువతకు అత్యుత్త ప్రతీకల్లో ఒకరని, క్రీడాకాలుకు ఆదర్శప్రాయుడని మన్మోహన్ అన్నారు. ఆ తర్వాత సిఎన్ఆర్ రావుకు మన్మోహన్ ఫోన్ చేసి అభినందించారు. భారతరత్నలకు సోనియా గాంధీ, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, పలువురు జాతీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ శాస్త్రవేత్త సిఎన్ఆర్ రావుకు భారత రత్న ప్రకటించడంపై కజైపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశ సైన్స్ రంగానికి ఆయన ఎనలేని సేవ చేశారని, భారత ప్రభుత్వ శాస్త్రీయ విధానాలను ఆయన ప్రభావితం చేశారని అన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ రసాయన శాస్త్రవేత్తల్లో సిఎన్ఆర్ రావు ఒకరని, ఆయన అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో పొందారని కొనియాడారు.












Click it and Unblock the Notifications