కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి.. నెక్ట్స్ జరిగేది ఇదే
జమ్ము కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఉగ్రదాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన, వెనక ఉండి సహకారం అందించిన అందర్నీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని.. ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైందని హెచ్చరికలు జారీ చేశారు.
ఈసారి అంతకుమించి..
దాయాది దేశం భారత్ పై దశాబ్దాలుగా యుద్ధకాండ కొనసాగిస్తూనే ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి సరిహద్దుల గుండా అక్రమంగా చొరబడి కాల్పులకు పాల్పడుతూనే ఉన్నారు తీవ్రవాదులు. నిత్యం జమ్ముకాశ్మీర్ లో ఏదో ఒక అలజడి రేకెత్తుతూనే ఉంది. అయినా భారత ప్రభుత్వం ఎప్పుడూ పాకిస్థాన్ పై కఠినంగా వ్యవహరించలేదు. భారత్ పై పాకిస్థాన్ దాడులు జరిపిన ప్రతిసారీ ఇరువర్గాల మధ్య దౌత్య పరమైన చర్చలతోనే ముగించింది.
కానీ పచ్చని, ఆహ్లాదకరమైన పహల్గాం బైసరన్ వ్యాలీలో నెత్తుటి మరకలు చూసిన ప్రధాని మోదీ ప్రభుత్వం ఈసారి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. అటు పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలని సోషల్ మీడియా శివాలెత్తుతోంది. దీంతో మోదీ సర్కార్.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ తీసుకోని సంచలన నిర్ణయాలను తీసుకున్నారు.
ప్రధాని మోదీ మాటిచ్చారు..
పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. "మేము ప్రతి ఉగ్రవాదిని గుర్తిస్తాం. వెంబడిస్తాం. వారిని మట్టిలో కలిపేస్తాం. వాళ్లకు సహకరించిన, ప్రోత్సహించిన వారినీ వదిలిపెట్టం" అని ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ను అష్ట దిగ్భంధనంలోకి నెట్టి ఉక్కిరిబిక్కిరి చేయాలని భారత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 7 సంచలన నిర్ణయాలు తీసుకుంది.
సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు
భారత్- పాకిస్థాన్ మధ్య ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. నీటిని తక్షణమే నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. 1960 లో ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా భారత్, పాకిస్థాన్ ల మధ్య ఈ ఒప్పందం ఏర్పడింది. సింధూ నదీ జలాలు ఈ ఒప్పందం ఆధారంగా ఇరు దేశాలు పంచుకుంటాయి.
అధికారులు తగ్గింపు..
పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు సీనియర్ మిలిటరీ అధికారులను భారత్ వెనక్కు పంపించింది. ఇరు దేశాల్లో ఉన్న ఎంబసీలోని సిబ్బందిని 45శాతం తగ్గించింది. అంటే వీరి సంఖ్యను 45 నుంచి 30 కి తగ్గించింది. ఈ మేరకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పింది పాకిస్థాన్.
సార్క్ దేశాల వీసా రద్దు
ఇరు దేశాల మధ్య ఉన్న సార్క్ దేశాల వీసాను రద్దు చేసింది. దీంతో భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థానీ పౌరులు 48 గంటల్లోగా దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి చెందిన పౌరులకు భారత్ లో చోటు లేదని బలంగా చాటి చెప్పింది.
అటారీ-వాఘా బోర్డర్ మూసివేత
పాకిస్థాన్ పై చర్యల్లో భాగంగా పంజాబ్‌లోని అటారీ- వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత్ లో శాంతి నెలకొల్పేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్ ప్రజలకు నో ఎంట్రీ
పాకిస్థానీ ప్రజలకు వీసాలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక పాకిస్థాన్ ప్రజలకు వీసాలు జారీ చేసేది లేదని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన వీసాలనూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. టెర్రరిజం, టూరిజం ఒకే చోట ఉండలేవని ఈ నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. అంతేకాక ఇరు దేశాల మధ్య ఏటా జరిగే బోర్డర్ రిట్రీట్ వేడుకనూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది భారత్ ప్రభుత్వం.
ఎక్స్‌ర్ సైజ్ ఆక్రమన్..
భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్న నేపథ్యంలో గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రమన్ ఎక్స్‌ర్ సైజ్ నిర్వహించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో గస్తీ కాస్తోంది. యుద్ధానికి భారత్ సిద్ధమే అని ఈ ఎక్స్‌ర్ సైజ్ చాటుతోంది.
అల్తాఫ్ లల్లీ ఖతం..
మరోవైపు పహల్గాం ఉగ్రదాడితో అప్రమత్తమైన భద్రతాబలగాలు జమ్మూకాశ్మీర్‌లో సాగిస్తున్న ఉగ్రవేటలో కీలక విజయం సాధించాయి. తాజాగా లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి. అలాగే ఉగ్రవాదుల ఆచూకీ ఇచ్చిన వారికి రూ. 20 లక్షలు బహుమతిగా ఇస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది.

పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయి. గతంలా కాకుండా దాడి జరిగిన వెంటనే ఉగ్రవాదులను హంతమొందించే తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇది న్యూ ఇండియా.. ఇలాగే బదులిస్తాం అని చెబుతున్నట్లుగా భావించవచ్చు.












Click it and Unblock the Notifications