థర్డ్ వేవ్: మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసుల పెరుగుదలపై ప్రధాని మోడీ ఆందోళన, కీలక సూచనలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో మరోసారి కరోనావైరస్ కేసులు పెరుగుతుండటంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని.. శుక్రవారం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు మాట్లాడారు. సెకండ్ వేవ్‌లో అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా కొత్త కరోనా కేసులు పెరుగుతుండటంపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్‌కు ముందు జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

థర్డ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించారు. మనం నిర్లక్ష్యంగా ఉంటే థర్డ్ వేవ్ ఊహించినదానికంటే ముందుగానే రావొచ్చని హెచ్చరించారు. అందుకే కరోనా పరీక్షలను పెంచుతూనే కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం కరోనా అత్యవసర సాయం కింద ఇప్పటికే 24వేల కోట్లను విడుదల చేసిందని, కరోనా చికిత్స అవసరమైన సౌకర్యాలను కల్పించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్ లాంటివి కేసులను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు పెంచాలన్నారు. మనమంతా కలిసి పోరాడితేనే కరోనా మహమ్మారిని జయించగలమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే మరోసారి కరోనా మహమ్మారి ప్రభావం మనపై తీవ్రంగా అవకాశం ఉందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications