మళ్లీ భారత పర్యటనకు జో బైడెన్
న్యూఢిల్లీ: కొద్ది రోజుల కిందటే దేశంలో జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఈ నెల 9,10 తేదీల్లో దేశ రాజధానిలోని భారత్ మండపం వేదికగా సాగిన ఈ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా, బ్రిటన్ ప్రధానమంత్రులు లీ కియాంగ్, రిషి సునాక్.. ఇలా వివిధ అగ్ర దేశాధినేతలు, ప్రధానమంత్రులు హాజరయ్యారు.
ఈ సమావేశానికి హాజరైన జో బైడెన్.. అతి కొద్ది రోజుల్లోనే మరోసారి భారత పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ఆయన భారత్‌లో పర్యటించవచ్చు. దీనికి అవసరమైన ప్రతిపాదనలను తాము పరిశీలిస్తోన్నామని అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ వెల్లడించింది.

వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలంటూ జో బైడెన్‌ను ఆహ్వానించారు ప్రధాని మోదీ. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ నిర్ధారించారు. రిపబ్లిక్ డే పరేడ్ ఉత్సవాలకు బైడెన్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందిందని చెప్పారు.
అదే సమయంలో భారత్‌లో క్వాడ్ సమ్మిట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. రిపబ్లిక్ డే పరేడ్‌తో పాటు ఈ సమావేశంలోనూ బైడెన్ హాజరు కావొచ్చు. జనవరిలో క్వాడ్ సమ్మిట్ ఏర్పాటవుతుందా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఎరిక్ గార్సెట్టి చెప్పారు. క్వాడ్‌లో భారత్‌తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలకు సభ్యత్వం ఉంది.
ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏదైనా ఓ దేశాధ్యక్షుడు లేదా ప్రధానిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. 2015లో బరాక్ ఒబామా, 2016లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోసిస్ హొల్లాండె, 2017లో అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహ్మద్ బిన్ జయెద్ అల్ నహ్యాన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
2018లో 10 ఆసియా దేశాధినేతలు రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్నారు. 2019, 2020లో దక్షిణాఫ్రికా, బ్రెజిల్ అధ్యక్షు సిరిల్ రమాఫోసా, జైర్ బోల్స్‌నారో అటెండ్ అయ్యారు. 2021, 2022ల్లో కోవిడ్ వల్ల ముఖ్యఅతిథులను ఆహ్వానించలేదు. ఈ ఏడాది ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications