ఎలాంటి మేజిక్ జరక్కపోవచ్చు- ఓటు వేసిన ప్రధాని
Vice President of India: ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొద్ది సేపటి కిందటే ఆరంభమైంది. పార్లమెంట్ సభ్యులు 15వ ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటోన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బరిలో దిగారు. ఆయనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిని పోటీకి నిలిపింది ఇండియా బ్లాక్. ఈ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీఏ తరపున మొదట ఆయనే ఓటు వేశారు. ఉదయం సరిగ్గా 10 గంటలకు పార్లమెంట్ హౌస్ కు చేరుకున్నారు. ఆ వెంటనే ఓటు వేశారు. క్రమంగా పలువురు కేంద్రమంత్రులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ హౌస్ కు చేరుకుంటోన్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ హౌస్ సందడిగా మారింది.

కొత్త పార్లమెంట్ భవనంలో రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వేసిన ప్రతి ఓటుకు ఒకే విలువ ఉంటుంది. ప్రస్తుతం లోక్‌సభలో 542 మంది సభ్యులు, రాజ్యసభలో 239 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం ఓటర్లు 781 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గెలవడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 391. బీఆర్‌ఎస్, బీజేడీల నుండి 11మంది సభ్యులు దూరంగా ఉండటంతో.. మెజారిటీ మార్కు 386గా నిర్ధారించారు.
మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితి, బిజూ జనతా దళ్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. దీనివల్ల గెలుపు మార్జిన్ తగ్గే అవకాశం ఉంది. బీజేడీకి- 7, బీఆర్ఎస్- 4 ఎంపీలు ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల బలం పెరిగినందువల్ల ఈసారి ఎన్నికలు మరింత హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. రాజ్యసభలో ఆరు సీట్లు, లోక్‌సభలో ఒక సీటు ఖాళీగా ఉన్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలుపుకొని ప్రస్తుతం సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతుగా 429 మంది, సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ లెక్క ప్రకారం చూస్తే సీపీ రాధాకృష్ణన్ గెలవడం ఖాయమైంది. దీనికోసం మాక్ పోలింగ్ సైతం నిర్వహించారు. ఈ మెజారిటీని మరింత పెంచుకోవాలని భావిస్తోంది ఎన్డీఏ. ఇండియా బ్లాక్ కు చెందిన కొంతమంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేస్తారని బలంగా నమ్ముతోంది.












Click it and Unblock the Notifications