మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి కన్నీటి వీడ్కోలు
Dr Manmohan Singh: ప్రఖ్యాత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి అంత్యక్రియలు ఆరంభం అయ్యాయి. దేశ రాజధానిలోని నిగమ్ బోధ్ ఘాట్ వద్ద అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికార లాంఛనాలంతో ఈ కార్యక్రమం కొనసాగనుంది.
డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరుసగా రెండుసార్లు ప్రధానమంత్రిగా పని చేశారాయన. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ఆ శాఖ మంత్రిగా పని చేశారాయన. ఆర్థిక వ్యవస్థకు జీవం పోశారు.

ఈ ఉదయం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అంతిమయాత్ర ఆరంభమైంది. మిలటరీ వాహనంపై నిగమ్ బోధ్ ఘాట్‌కు పార్థివదేహాన్ని అధికార, సైనిక లాంఛనాలతో తీసుకొచ్చారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే నివాళి అర్పించారు.
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, మారిషస్ విదేశాంగ మంత్రి మనీష్ గోబిన్.. ఆయనకు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సహా పలువురు మంత్రులు, అధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు అంత్యక్రియలకు హాజరైన వారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications