అపశకునపు పక్షి ఇప్పుడు ఆ ఊరికే గర్వకారణం: మోదీ
భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు ప్రకృతి సంపదకు, పర్యావరణ హితమైన జీవనశైలికి పుట్టినిల్లు. ఈ క్రమంలోనే పర్యావరణ పరిరక్షణ కోసం అక్కడి ప్రజలు సాగిస్తున్న విశేష కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా పరిచయం చేశారు. జూన్ 28న ప్రసారమైన తన 'మన్ కీ బాత్' 135వ కార్యక్రమంలో అస్సాంలోని అరుదైన 'హర్గిలా' పక్షి సంరక్షణ ఉదాహరణను, అలాగే మేఘాలయలోని 'జీవన వేర్ల వంతెనల' (లివింగ్ రూట్ బ్రిడ్జెస్) విశిష్టతను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సమాజంలో ఉన్న అపోహలను తొలగిస్తూ, ప్రకృతితో మమేకమై జీవించడం ఎలాగో ఈ రెండు అంశాలు నిరూపిస్తున్నాయని ప్రధాని మోదీ ప్రశంసించారు.

'హర్' అంటే ఎముకలు, 'గిలా' అంటే మింగడం అని అర్థం. ఈ పక్షులు ఎముకలను కూడా సునాయాసంగా మింగేయగలవు. అయితే, సుమారు 1.5 మీటర్ల ఎత్తు, వింతైన రూపం కారణంగా వీటిని చూసి ప్రజలు భయపడేవారు. అస్సాంలో కనిపించే అరుదైన హర్గిలా పక్షి సుదీర్ఘకాలంగా స్థానిక ప్రజల మూఢనమ్మకాలకు, భయాందోళనలకు బలవుతూ వచ్చింది. నిజానికి పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో, చనిపోయిన జంతువుల అవశేషాలను తొలగించడంలో ఈ పక్షులు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ, వీటి మనుగడను గుర్తించని స్థానికులు హర్గిలా పక్షుల గూళ్లు ఉన్న చెట్లను కూడా క్రూరంగా నరికివేసేవారు. కేవలం అజ్ఞానం వల్లే ఒక ఉపయోగకరమైన పక్షి జాతి వినాశనం అంచుకు చేరుకుందని ప్రధాని వివరించారు.
అపోహలను పటాపంచలు చేసిన 'హర్గిలా సైన్యం'
ఈ గడ్డు పరిస్థితుల్లో ఆ పక్షుల రక్షణ కోసం జీవశాస్త్రవేత్త పూర్ణిమ దేవి బర్మన్ నడుం బిగించారు. సమాజంలో బలంగా నాటుకుపోయిన ఈ మూఢనమ్మకాలను తొలగించాలని ఆమె గట్టిగా సంకల్పించారు. ఇందులో భాగంగా స్థానిక మహిళలను ఏకం చేసి, శాస్త్రీయ దృక్పథంతో వారికి అవగాహన కల్పించారు. పూర్ణిమ దేవి బర్మన్ చూపిన బాటలో నడిచిన మహిళలు క్రమంగా ఒక పెద్ద ఉద్యమంగా రూపాంతరం చెందారు. అలా ఏర్పడిందే ఈనాటి పర్యావరణ రక్షక దళం 'హర్గిలా ఆర్మీ'. నేడు వేలాది మంది గ్రామీణ మహిళలు ఈ పక్షులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
సమాజంలో వచ్చిన ఈ విప్లవాత్మక మార్పు పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఇళ్ల దరిదాపుల్లోకి వస్తేనే అరిష్టంగా భావించి తరిమికొట్టిన పక్షి, నేడు ఆ అస్సాం గ్రామాల ఆత్మగౌరవానికి, గుర్తింపునకు ప్రతీకగా నిలిచిందని మోదీ పేర్కొన్నారు. జీవవైవిధ్యాన్ని కాపాడటానికి సమాజ భాగస్వామ్యం ఎంత అవసరమో, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఎంతటి మార్పునకు దారితీస్తుందో ఈ హర్గిలా సంరక్షణ ఉద్యమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అస్సాం స్ఫూర్తిదాయక పక్షి సంరక్షణ ఉదంతాన్ని వివరించిన అనంతరం ప్రధాని మోదీ తన ప్రసంగంలో మేఘాలయ పర్వత శ్రేణులలోని అపురూపమైన జీవన వేర్ల వంతెనల వైపు దృష్టి సారించారు. మేఘాలయ అంటేనే మేఘాల నిలయమని, అక్కడి ప్రజల ఆత్మీయత పర్యాటకులను ఎప్పటికీ ఆకట్టుకుంటుందని అన్నారు. అయితే వీటన్నింటికంటే ఎంతో ప్రత్యేకమైనవి అక్కడి స్థానిక గిరిజనులు నిర్మించే సహజసిద్ధమైన వంతెనలని చెప్పారు. ఇవి కేవలం కొద్ది రోజుల్లోనో లేదా కొద్ది సంవత్సరాల్లోనో కట్టేవి కాదని, వీటి తయారీ వెనుక దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ, పట్టుదల దాగి ఉన్నాయని ప్రధాని వివరించారు.
యునెస్కో గుర్తింపు దిశగా జీవన వంతెనల ప్రయాణం
మేఘాలయలో లభించే రబ్బరు చెట్ల వేర్లను ఒక క్రమ పద్ధతిలో అల్లుతూ కాలక్రమేణా ఈ వంతెనలకు రూపాన్ని ఇస్తారు. ఈ వంతెనల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి సాధారణ సిమెంట్ కట్టడాల లాగా పాడైపోవు సరే కదా, కాలం గడిచేకొద్దీ మరింత బలంగా మారుతాయి. ప్రకృతితో మానవుడు ఏ విధంగా సామరస్యంగా జీవించవచ్చో మరియు పర్యావరణానికి ఎటువంటి హాని చేయకుండా అద్భుతాలను ఎలా సృష్టించవచ్చో చెప్పడానికి ఈ వంతెనలు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. ఇవి మన దేశానికి మరియు మన భూమికి లభించిన గొప్ప వారసత్వ సంపద అని ప్రధాని కొనియాడారు.
ప్రస్తుతం భూగోళం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు వాతావరణ మార్పులు. ఈ గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను తట్టుకుని నిలబడేలా ఈ వంతెనలను కాపాడుకునే బాధ్యతను మేఘాలయ ప్రజలు ఎంతో సమర్థవంతంగా భూజానికెత్తుకున్నారని మోదీ ప్రశంసించారు. గతంలో ఈ వంతెనలు ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి ఉండేదని, అయితే స్థానిక ప్రజలే స్వయంగా చొరవ తీసుకుని వాటి సంఖ్యను లెక్కించారని చెప్పారు. ఈ అపురూప సహజ నిర్మాణాలను యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్‌వర్క్‌లో చేర్చాల్సిందిగా భారత్ ఇప్పటికే అధికారికంగా దరఖాస్తు చేసిందని ఆయన వెల్లడించారు.
ఈశాన్య భారతదేశంలో పర్యావరణ సమతుల్యత కోసం జరుగుతున్న ఈ రెండు వినూత్న ప్రయత్నాలు దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి స్ఫూర్తి కలిగిస్తాయని ప్రధానమంత్రి మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మనుషులు మరియు ప్రకృతి పరస్పర అవగాహనతో కలిసి సాగినప్పుడే సుస్థిరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని ఈ ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. సంప్రదాయ పద్ధతుల్లో ప్రకృతిని గౌరవించడం, స్థానిక వనరులను కాపాడుకోవడం ద్వారానే వాతావరణ మార్పులకు సరైన పరిష్కారాన్ని కనుగొనగలమని ఈ మన్ కీ బాత్ వేదికగా చెప్పిన విశేషాలు చాటిచెబుతున్నాయి.














Click it and Unblock the Notifications