'రాజీపడే ప్రసక్తే లేదు'.. అమెరికా టారిఫ్ లపై ప్రధాని మోదీ సంచలనం
భారత్ పై అమెరికా 50 శాతం టారిఫ్ లు విధించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి అధికంగా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లు విధించారు. అయితే అమెరికా చర్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని రైతులు, పశు పోషకులు, చిన్న తరహా పరిశ్రమల కార్మికుల ప్రయోజనాల కోసం ఎంత ఒత్తిడినైనా తట్టుకుంటామని అంతేకాని రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
" ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక వృద్ధి కోసం రాజకీయాలు చేస్తున్నారు. అహ్మదాబాద్ గడ్డపై ఉండి చెప్తున్న. దేశంలోని రైతులు, పశు పోషకులు, చిన్న తరహా పరిశ్రమల కార్మికులకు ఇదే నా హామీ. నేను మళ్లీ మళ్లీ చెప్తున్న మీకు ఇబ్బంది కలిగించే, నష్టం కలిగించే ఏ విధానాన్ని మోదీ అంగీకరించరు. నా ప్రభుత్వం ఎప్పుడూ మీకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించదు. ఎంత ఒత్తిడినైనా తట్టుకుంటాం. మరింత శక్తివంతంగా మారుతాం. ప్రస్తుతం ఆత్మనిర్భర భారత్ కు గుజరాత్ ఎంతో సహకరిస్తోంది. గత 20 ఏళ్లుగా గుజరాత్ అభివృద్ధి ఇందుకు కారణంగా చెప్పొచ్చు" అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ తో భారత శక్తి సామర్థ్యాలు పాకిస్థాన్ తో పాటు ప్రపంచ దేశాలకు తెలిసివచ్చాయన్నారు. భారత్ విల్ పవర్ ప్రపంచానికి అర్థమైందన్నారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ టెర్రరిస్టులు.. వారి మాస్టర్లను విడిచిపెట్టదని తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారాన్ని భారత్ 22 నిమిషాల వ్యవధిలో తీర్చుకుందని ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం గ్రహించిందని అన్నారు.

మరోవైపు భారత్ వస్తువులపై అమెరికా విధించిన టారిఫ్ లు ఆగస్టు 27 బుధవారం నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆగస్టు 26 న పీఎంఓ అధ్యక్షతన ఓ హై లెవెల్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే భారతీయులకు రష్యా మరోసారి శుభవార్త తెలిపింది.
తమ దేశంలో భారత కార్మికులకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పిందని భారత రాయబారి పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే వలసదారులపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యాలో భారత కార్మికులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల మంది భారతీయులకు ఉద్యోగాల కల్పించనున్నట్లు ఇప్పటికే వెల్లడించింది.












Click it and Unblock the Notifications