బీహార్ లో అలా గెలిచాం..! SIRకు పడిన ఓటు-కూటమిపై ప్రధాని ఫైర్..!
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఓవైపు ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన మహాకూటమిని టార్గెట్ చేసిన ప్రధాని.. మరోవైపు ప్రత్యేక ఓటర్ల జాబితాతో తమ పని సులువు చేసిన ఎన్నికల సంఘంపై ప్రశంసల జల్లు కురిపించారు.
బీహార్ లో ఓట్ల చోరీ ఆరోపణల నేపథ్యంలో సాగిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణను ప్రధాని మోడీ ప్రసంసించారు. ఓటర్ల జాబితాల ప్రక్షాళనను యువ ఓటర్లు సీరియస్ గా తీసుకున్నారన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం పనితీరును ఆయన ప్రశంసించారు. అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాల బూత్-స్థాయి ధృవీకరణలో చురుకుగా పాల్గొనాలని కోరారు. ఈ ఎన్నికలతో కాంగ్రెస్ పూర్తిగా కుప్పకూలిందన్నారు. బీహార్ ప్రజలు తమపై విశ్వాసం చూపారన్నారు. తమ కూటమిని ప్రజా సేవకులుగా నిరూపించారన్నారు.

బీహార్ లో మార్పుకు తొలిసారి ఓటర్లు, యువతదే కీలక పాత్ర అన్నారు. యువత అరాచక పాలనతో ముడిపడిన ముస్లిం-యాదవ్ సూత్రాన్ని తిరస్కరించి మహిళా-యువతగా మార్చేశారన్నారు. 2010నుండి బీహార్ ఎన్డీఏకు బలమైన మద్దతుదారుగా మారిందని గుర్తుచేసుకున్నారు. ఆర్జేడీ అరాచక పాలన మరోసారి బీహార్ లో రాదని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యం విజయం అన్నారు. ముఖ్యంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాలు సైతం ఎన్నికల ప్రక్రియపై నమ్మకం ఉంచాయన్నారు.

బీహార్‌లో ఎన్డీఏ సాధించిన భారీ విజయం, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్‌లో కూడా ఇలాంటి ప్రదర్శనకు పునాది వేసిందని ప్రధాని తెలిపారు. గంగా నది బీహార్ ద్వారా బెంగాల్‌కు ప్రవహిస్తుందని, బీహార్‌లో విజయం, నదిలాగే, బెంగాల్‌లో మన విజయానికి మార్గం సుగమం చేసిందన్నారు. మీ ఆశలు నా ప్రతిజ్ఞ, మీ కలలు నా ప్రేరణ అని ప్రధాని బీజేపీ కార్యకర్తలకు తెలిపారు. బీజేపీకి, పార్టీ కార్యకర్తలే దాని బలం అన్నారు. బీహార్‌లో అద్భుతమైన ప్రదర్శనకు కారణమైన కార్యకర్తలను ఆయన అభినందించారు.












Click it and Unblock the Notifications