PM Modi: విభజన శక్తులకు మళ్లీ ఎదురుదెబ్బ-మహా గెలుపుపై ప్రధాని మోడీ-బీజేపీ సంబరాల్లో..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం నేపథ్యంలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర విజయంపై సంతోషం వ్యక్తం చేసిన మోడీ.. ఇందుకు కారణమైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అన్నారు. కాంగ్రెస్ విభజన రాజకీయాల్ని ప్రజలు తిరస్కరించారన్నారు.
కాంగ్రెస్ నేతలారా చెవులు రిక్కించి వినండంటూ ప్రధాని మోడీ సూచించారు. ప్రపంచంలో ఏశక్తీ కశ్మీర్లో ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురాలేదని తెలిపారు. దేశంలో ఒకే రాజ్యాంగం ఉందని, అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక్కటేనన్నారు.రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించాలని చూసిందన్నారు. రెండు రాజ్యాంగాలు ఉండాలన్న..కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని మోదీ పేర్కొన్నారు. సీఎంలను తీసుకొచ్చి ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు.

పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హామీలు అమలుచేయలేదని, అందుకే జనం కాంగ్రెస్‌కు ఓటు వేయలేదని మోదీ తెలిపారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పరాన్నజీవిగా మారిందన్నారు. ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హర్యానాతో పాటు..మహారాష్ట్రలో కాంగ్రెస్ ఖాతా ఖాళీ అయిందని మోడీ తెలిపారు. కాంగ్రెస్ విభజనవాద రాజకీయాలు విఫలమయ్యాయన్నారు.రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి స్థానమే లేదని, ఓట్ల కోసం కాంగ్రెస్ వక్ఫ్ చట్టం తెచ్చిందని మోదీ విమర్శలు గుప్పించారు.
కులం, మతం, భాష, ప్రాంతాల వారీగా దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న శక్తులకు దేశ ఐక్యత గట్టి దెబ్బ కొట్టిందని మోడీ వ్యాఖ్యానించారు. ఈ మంత్రం విభజనను ప్రచారం చేసేవారికి గుణపాఠం నేర్పిందన్నారు. ఇది వారిని శిక్షించిందన్నారు. గిరిజనులు, ఓబీసీలు, దళితులు, సమాజంలోని ప్రతి వర్గం బిజెపి-ఎన్‌డిఎకు మద్దతుగా నిలిచిందన్నారు. ఇది కాంగ్రెస్ , భారత కూటమి యొక్క విభజన ఎజెండాకు బలమైన దెబ్బ అన్నారు.
ఈసారి మహారాష్ట్ర అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని,గత 50 ఏళ్లలో మహారాష్ట్రలో ఏ పార్టీ లేదా ముందస్తు ఎన్నికల కూటమికి ఇది అతిపెద్ద విజయమన్నారు.బీజేపీ నేతృత్వంలోని కూటమికి మహారాష్ట్ర వరుసగా మూడోసారి ఆశీర్వాదం అందించిందని, ఇది మూడోసారి అని మోడీ తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని మోడీ గుర్తుచేశారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల కంటే బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. వరుసగా మూడుసార్లు బీజేపీకి అధికారం ఇచ్చిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఆరో రాష్ట్రం అని మోడీ తెలిపారు.












Click it and Unblock the Notifications