కాంగ్రెస్ పార్టీకి ఆరు రోగాలు, రాహుల్ గాంధీకి అహంకారం, డీల్ పార్టీ: బంగారు గనులు: మోడీ ఫైర్!
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ ఆరు రోగాలతో సతమతం అవుతోందని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ సంసృతి, మతం, జాతీ, నేరాలు, అవినీతి, కాంట్రాక్టర్లకు సన్మానం చెయ్యడంలాంటి రోగాలతో కాంగ్రెస్ పార్టీ కాలం గడుపుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. బుధవారం కోలారు జిల్లా బంగారు పేటలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీకి అహంకారం అంటూ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ టిక్కెట్ల డీల్
కాంగ్రెస్ టిక్కెట్లు పంచడం లేదని, విక్రయిస్తున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, చిక్కబళ్లాపురం లోక్ సభ సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ ఆరోపించారని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ నోటికి ప్లాస్టర్ వేసి ఆయన గొంతును కాంగ్రెస్ పార్టీ నొక్కిందని, మోడీ గొంతు మాత్రం నొక్కలేరని ప్రధాని అన్నారు.

వాడుకుని వదిలేస్తారు
కాంగ్రెస్ పార్టీ నిజలింగప్ప, దేవరాజ అరసు లాంటి సీనియర్ నాయకులను వాడుకుని వదిలేసిందని, ఇప్పుడు వీరప్ప మొయిలీ వంతు వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాకావ్యం రాయడానికి బయలుదేరారని, పేదల కష్టాల గురించి పట్టించుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.

బంగారు గనులు
బంగారు గనులు ఉన్న కోలారు జిల్లా ప్రజలకు చివరికి కాంగ్రెస్ పార్టీ మట్టిని మాత్రం మిగిల్చిందని, వారికి కనీసం తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలం అయ్యిందని ప్రధాని మోడీ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాల్లో ఎత్తిపోతల పథకం పూర్తి చేసి చూపిస్తామని ప్రధాని మోడీ శపథం చేశారు.

దిల్ వాలి కాదు డీల్ వాలి
కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా బంగారు నగలు వేసుకుంటారని, అది కోలారు జిల్లాలోని అసలైన బంగారం కాదని, అవినీతితో విదేశాల నుంచి తెప్పించుకున్న బంగారు నగలు అని ప్రధాని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ దిల్ వాలి పార్టీ కాదు డీల్ వాలి పార్టీ అని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు.

60 ఏళ్ల పాలనలో సిగ్గుచేటు
కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించలేకపోయిందని, పేదలను రోడ్ల పాలు చేసిందని, బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. పేదల కష్టాలు పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతోందని ప్రధాని మోడీ ప్రశ్నించారు.

వాజ్ పేయి మీద అనుమానం
కేంద్రంలో మూడు సార్లు అటల్ బీహారి వాజ్ పేయి ప్రధాని అయ్యారని, ఆయన రిజర్వేషన్లు రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చుతారని ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని, అయితే అలాంది ఏదీ జరగలేదని, మా ప్రభుత్వం అలా చెయ్యదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కోలారు లోక్ సభ సభ్యుడు కేహెచ్. మునియప్ప దళితులను ఎదగనివ్వడం లేదని, తనకు పోటీ వస్తారనే భయంతో కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని, వేరే వారికి అవకాశం ఇవ్వకుండా కుమార్తెతో పోటీ చేయిస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు.

రాహుల్ గాంధీకి అహంకారం
2019లో తనను ఇంటికి పంపించాలని కుట్రలు చేస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. యూపీఏలో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారని, అలాంటి సీనియర్ నాయకులను చీకటిలో నిలబెట్టి తాను ప్రధానిని అవుతానని రాహుల్ గాంధీ అహంకారంతో స్వయంగా ప్రకటించుకున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. కర్ణాటకలోని అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోడీ మనవి చేశారు.












Click it and Unblock the Notifications