• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

PMS: పీరియడ్స్ రాబోయే ముందు స్త్రీల మానసిక, శారీరక లక్షణాలలో మార్పు వస్తుందా? పీఎంఎస్ అంటే ఏమిటి?

By BBC News తెలుగు
|

పీఎంఎస్

"పిల్లకు మెంటల్. ఆ విషయం దాచిపెట్టి పెళ్లి చేశారు."

"అయ్యో, కాదండి. దానికి కొద్దిగా కోపం వదిన గారూ. అంతే.” అపర్ణ తల్లి నొచ్చుకుంది.

"కొద్దిగా కోపమా? చూడండి."

పగిలిన కప్పుల్ని తెచ్చి టీ పాయ్ మీద పేరుస్తోంది. వాటిని భద్రంగా దాచి పెట్టిందావిడ, కోడలి కోపానికి సాక్ష్యంగా.

“పెద్దవాళ్ల సంబంధం వద్దురా అని మొత్తుకుంటూనే వున్నాను. నిన్న చేతిలో వున్న ఫోన్ విసిరి కొట్టింది. ముక్కలు చెక్కలైపోయింది. వాడు మాత్రం ఎంతని సహిస్తాడు."

"అది కూడా బాధ పడుతూనే వుందండి, చూశారుగా."

"మనిషికంత నోటి దురుసెందుకు మరి? అసలు నా మాట విని అమ్మాయిని ఓ సారి మెంటల్ డాక్టర్‌కు చూపెట్టండి అన్నయ్య గారూ.”

అత్తగారు, అపర్ణ తండ్రికి సలహా ఇచ్చింది.

మన పొరపాట్లే ఎదుటి వారికి అధికారాన్నిస్తాయి.

“ఊరుకో అమ్మా” వేణు అడ్డు పడ్డాడు.

“ఊరుకుండబట్టే!” ఆమె సణుక్కుంటూ లోపలికెళ్ళింది.

“తను మంచిది కాదని నేనడం లేదు సార్. నెలలో పదిహేను రోజులు దేవతలా వుంటుంది సార్. మిగిలిన సగం మాత్రం రాక్షసిలా చేస్తుంది. విపరీతమైన కోపం.”

పీరియడ్స్ క్యాలెండర్

వేణు, అపర్ణ తండ్రిని 'మావగారు’ అనడు. సార్ అనే పిలుస్తాడు. ఆయన రిటైర్ కాక ముందు ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేసేవారు.

“కోపంలో ఏమాటనేస్తుందో, తనకే తెలియదు… నసగాడివి… చేతకాని దద్దమ్మవి… చవటవి…. ఇవి పర్లేదండి. కానీ మొన్న తన మాటలు…”

ఆయన మాట్లాడకుండా అపర్ణ వైపు చూశాడు.

ఆ చూపు ఉరి శిక్షలానే వుంది.

అతను చెప్పేదంతా నిజమే. అపర్ణకూ, వేణుకు మూడు రోజుల్నుండి మాటల్లేవు.

గొడవ జరిగిన రోజు గుర్తొచ్చింది. ఆ రోజు తను నైట్ డ్యూటీ నుండి వచ్చింది. ప్లేటులో ఉడకని ఇడ్లీలు పెట్టుకొచ్చాడు. నీళ్ల కాఫీ.

“కావాలని చేస్తున్నావు. చెత్తలా వండితే, ఇక పని చెప్పనని నీ కుళ్ళు తెలివి” అని అరిచింది.

నచ్చకపోతే బయటినుండి తెప్పించుకుందామన్నాడు. అతనేం చెప్తున్నా భరించలేనంత చిరాకు పుడుతోందామెకు.

అతని అతి తెలివివల్లే గొడవలవుతున్నాయంది. మాటా మాటా పెరిగింది.

“పోరా పుచ్చు వెధవా. చేతకాని వాడివి పెళ్లెందుకు చేసుకున్నావురా?” ప్లేటు నేలకేసి కొట్టి అతన్ని ఉద్దేశించి ఇంగ్లీషు పదాలు రెండు వాడింది.

గదులు వేరయ్యాయి. తలుపులు మూసుకున్నాయి.

వేణు అన్న మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి…. 'నెలలో సగం రోజులు దేవత. మిగిలిన సగం రాక్షసి’.

ఎందుకలా అవుతోంది, నాకెందుకింత కోపం వస్తోందని అపర్ణ ఆలోచిస్తోంది.

పీఎంఎస్

పీఎంఎస్ - ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ - అంటే ఏమిటి? (PMS- Pre-Menstrual Syndrome)

స్త్రీలలో ఋతుక్రమం రాబోయే రెండు వారాల ముందు ఏర్పడే ఒక బాధాకరమైన స్థితి.

పీరియడ్స్ రాబోయే ముందు సంభవించే మానసిక, శారీరక లక్షణాల సముదాయం.

పీఎంఎస్లో ఎటువంటి లక్షణాలుంటాయి?

శరీరపు బడలిక, చిరాకు, విసుగు కలగడం, త్వరగా కోపం రావడం, ఆహారం తీసుకోవడంలో నియంత్రణ కోల్పోవడం వంటి రకరకాల లక్షణాలు వుంటాయి.

కడుపు ఉబ్బరించడం, వక్షస్థలం బరువుగా, నొప్పిగా వుండడంతో బాటు డిప్రెషన్, కంగారు, ఆత్మ విశ్వాసం కోల్పోవడం మరియు మూడ్ స్వింగ్స్‌తో బాధ పడుతుంటారు.

ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్

పీఎంఎస్ ఎందుకు వస్తుంది?

ఈ లక్షణాలు ఋతుక్రమంలో సహజంగా చోటు చేసుకునే హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల కలుగుతాయి.

నెలనెలా పీరియడ్స్ వచ్చే స్త్రీలలో సుమారుగా నెల మధ్యలో అండం విడుదల అవుతుంది.

అప్పటి నుండి, పీరియడ్స్ వచ్చేవరకూ, ప్రోజెస్టిరోన్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది.

మెదడుపై ఆ హార్మోన్ ప్రభావం వల్ల స్త్రీల ప్రవర్తనలో వ్యత్యాసం కనిపిస్తుంది.

పీఎంఎస్ అనే స్థితిని కనుగొనడం ఎలా?

పీఎంఎస్ అనే వ్యాధిని నిర్ధారించడానికి ఏ రక్త పరీక్షలూ లేవు.

ఉందేమోనన్నఅనుమానం వచ్చినపుడు రెండు నెలల పాటు మెన్స్ట్రువల్ డైరీ రాయాలి.

తమ లక్షణాలు నెలలో ఏయే రోజుల్లో వస్తున్నాయో నమోదు చేయాలి.

పీఎంఎస్

పీఎంఎస్‌కు చికిత్స ఎలా చేయాలి?

ఒక పద్ధతి ప్రకారం చికిత్స చేయాల్సి వుంటుంది. ప్రారంభంలో ఔషధాలతో అవసరంలేని పద్ధతులు సూచించాలి. వ్యాయామం, ఆహారంలో మార్పులు, జీవన విధానంలో మార్పులు చేయడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. ఆహారంలో రిఫైండ్ కార్బోహైడ్రేట్లను తగ్గించాలి. ఉదాహరణ: బియ్యం, వైట్ బ్రెడ్, స్వీట్లు, బంగాళా దుంపలు.

హెర్బల్ వైద్యం కూడా ఉపయోగ పడుతుంది. ఉదాహరణకు ప్రిం రోజ్ ఆయిల్, వావిలి (Vitex agnus castus L), సెయింట్ జాన్స్ వోర్ట్ వంటి మొక్కల్ని పీఎంఎస్ చికిత్సలో వాడతారు.

వీటితో బాటు, వైటమిన్ బి6, మెగ్నీషియం, మల్టీవైటమిన్ టాబ్లెట్లు వాడడం వల్ల పి ఎం ఎస్ లక్షణాలను తగ్గిస్తాయి.

మనోవికాసానికి సంబంధించిన చికిత్స, ప్రవర్తనా సరళిలో సూచనలు (CBT- Cognitive Behavioural Therapy) ఫలితాన్నిస్తాయి.

అప్పటికీ బాధ తగ్గని పక్షంలో డిప్రెషన్ తగ్గించే మందులు వాడడం వల్ల పరిస్థితి మెరుగవుతుంది.

ఆ పైన, క్లిష్టమైన లక్షణాలకు హార్మోన్ల చికిత్స అవసరం. అండోత్పత్తిని నిరోధించడమే హార్మోనల చికిత్స యొక్క ముఖ్యోద్దేశం.

పీఎంఎస్

అరుదైన కేసు.. మరింత అరుదైన చికిత్స

ప్రతిమకు చిన్ననాటి నుండి చదువు అంటే ఆసక్తి. ఒక్కనాడైనా స్కూలు మానేసేది కాదు. జ్వరమొచ్చినపుడు కూడా స్కూలుకు వెళతానని తలిదండ్రులతో గొడవపడేది.

ప్రతి పరీక్షకు ఎంతో ప్రణాళికా బద్ధంగా చదువుకునేది. గురువులందరికీ ఇష్టమైన అమ్మాయి. క్విజ్ పోటీలకు, డిబేట్లకు వెళ్లి బహుమతులు గెల్చుకునేది. పెద్దయాక సైంటిస్ట్ కావాలన్నదే ఆమె ఆశయం.

రజస్వల అయిన తర్వాత కొన్నాళ్లు బాగానే వుంది. ఇంటర్ అయిన దగ్గర్నుండీ ఆమె కష్టాలు మొదలయ్యాయి. తీవ్రమైన పైఎంఎస్ లక్షణాలతో బాధ పడేది. కొద్ది మంది స్త్రీలలోనే ఇటువంటి తీవ్ర స్థాయి వ్యాధి కనిపిస్తుంది.

అకారణంగా ఏడవడం, ఇంట్లో వారితో గొడవలు, బయట కాలేజీలో పోట్లాటలు, నెలసరి రాబోతున్నదంటే ఆమె, ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయేవారు.

అయితే డిప్రెషన్ లేదా విపరీతమైన కోపం. ఎవరిని చూసినా చిరాకు. తల్లి దండ్రులతో గొడవలు, తమ్ముడితో కీచులాటలు.

డిగ్రీలో చేరినప్పటి నుండీ, వ్యాధి మరింత తీవ్ర రూపం దాల్చింది. నెలలో మూడు వారాలు అనారోగ్యంతో సతమతమయేది.

ఆమె మూడ్ స్వింగ్స్ వల్ల ఇంట్లో వస్తువులకు భద్రత లేకుండా పోయింది. గాజు వస్తువులు ఇంట్లో లేకుండా జాగ్రత్త పడ్డారు.

ముందు కోపం, అది తగ్గాక డిప్రెషన్, వేదన, ఏడుపు.

గొడవయ్యాక మూసుకున్న ఆమె గది తలుపులు ఎప్పటికి తెరుచుకుంటాయో తెలియదు. లోపల ఏ అఘాయిత్యానికి తలపెడుతుందోనని తల్లి మనసులో నిండా కన్నీళ్లే. ప్రతినెలా తల్లిదండ్రులకు ఒక పరీక్షలా వుండేది.

మహిళలు

అన్ని రకాల వైద్య పద్ధతులు ప్రయత్నించారు. ఫలితం లేదు. ఆమెకు ఇరవై ఎనిమిదేళ్ల వయసు వచ్చింది. డిగ్రీ పూర్తి కాలేదు. చదువులో వైఫల్యం మరింత క్రుంగదీసింది.

ఆహారం తీసుకునేది కాదు. రెండు సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అన్ని చికిత్సా పద్ధతులు విఫలమైనాయి. తరచు సైకియాట్రీ వార్డులో ఎడ్మిట్ అయి చికిత్స పొందాల్సి వచ్చేది.

కోరుకున్న లక్ష్యాలకు చేరలేదన్న కసి, కోపం! నెలసరి అంటేనే ఏవగించుకునేది. తెలివైనది, చురుకైన విద్యార్థి అని పేరు తెచ్చుకున్న అమ్మాయికి భవిష్యత్తనేది కనిపించకుండా పోయింది.

ప్రయత్నించని వైద్యం లేదు. చివరికి శక్తివంతమైన హార్మోన్ ట్రీట్మెంట్ సైతం విఫలమయ్యాక, ఆమెలో అలజడిని నియంత్రించడానికి వైద్య నిపుణుల బృందం సమావేశమయింది.

ఎన్నో చర్చలు, వాదోపవాదాల తర్వాత ప్రతిమ ఈ ఋతుక్రమం తనకు వద్దని పట్టుబట్టింది. చదువుకు దూరమైన జీవితం అక్కర్లేదన్నది. పీరియడ్స్ రాకుండా ఎలాగైనా ఆపెయ్యమని వేడుకుంది.

మిగిలినదొకటే దారి. ఆ మాట ప్రస్తావించడానికి వైద్యులు సంకోచించారు.

అదే శస్త్ర చికిత్స. గర్భకోశాన్ని, అండాశయాలను శస్త్ర చికిత్స ద్వారా తొలగించడం.

దాని వల్ల భవిష్యత్తులో, ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదని చెప్పారు. అభ్యంతరం లేదంది. తనకసలు పెళ్లే అక్కర్లేదంది.

“ప్రపంచమంతా పిల్లలే. నాకొక్కదానికి బిడ్డలు లేనంత మాత్రాన ప్రపంచం నష్టపోదని” అంది.

ఎన్నో చర్చల అనంతరం వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేశారు. తొలిగించారు. ఆ పైన లక్ష్యాన్ని సాధించడానికి ఆమె డిగ్రీలో చేరి చదువు కొనసాగించింది.

(వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించడానికి నేపథ్యం, పాత్రలు కల్పించబడినవి. నిజమైన వ్యక్తులతో, జీవించి ఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం. రచయిత వైద్యురాలు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
women's mental and physical health during periods
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X