క్రాస్ ఓటింగ్ భయాల మధ్య 15రాజ్యసభ స్థానాలకు పోలింగ్; ఫలితాలు కూడా నేడే!!
దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఈరోజు ఉదయం 9 గంటల నుండి నాలుగు గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. దేశంలోని మూడు రాష్ట్రాల నుండి 15 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పది స్థానాలకు, కర్ణాటకలో నాలుగు స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్ లో ఒక స్థానానికి నేడు ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఇక పోలింగ్ పూర్తయిన తర్వాత నేడే సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నందున ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఆసక్తిని కలిగిస్తుంది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయంగా భావిస్తున్నారు. క్రాస్ ఓటింగ్ చర్చ జరుగుతున్న క్రమంలో అన్ని పార్టీలు తమ నేతల పైన నిఘా ఉంచాయి.

ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పది రాజ్యసభ స్థానాలకు బిజెపి ఎనిమిది మంది అభ్యర్థులను, ప్రతిపక్ష సమాజ్వాది పార్టీ ముగ్గురు అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపింది. బిజెపి నుంచి ఏడుగురు, ఎస్పీ నుంచి ముగ్గురు సభ్యులను ఏకగ్రీవంగా రాజ్యసభకు పంపే సంఖ్య బిజెపికి మరియు సమాజ్వాది పార్టీకి ఉంది.
ఉత్తరప్రదేశ్లో బిజెపి ఎనిమిదవ అభ్యర్థిగా సంజయ్ సేథ్ ను బరిలోకి దించడం తో ఈ సీట్ పై పోటాపోటీ కొనసాగే అవకాశం ఉంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడానికి అభ్యర్థికి దాదాపు 37 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. ఇక కర్ణాటక రాష్ట్రంలో క్రాస్ ఓటింగ్ ప్రమాదం ఉన్న కారణంగా అధికార కాంగ్రెస్ అలెర్ట్ అయింది.
తమ నాలుగు సీట్లను భర్తీ చేయడానికి తమ నేతలను హోటల్ కి తరలించి జాగ్రత్త పడుతుంది. ప్రస్తుతం అక్కడ క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్న క్రమంలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వికి ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ తమ నేతలందరికీ విప్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications