• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రణబ్ సందేశంలో కేజ్రీవాల్‌కు హెచ్చరిక, తెలంగాణ పైనా

By Srinivas
|

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసుల తీరును నిరసిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ధర్నాకు దిగటాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఖండించారు. ప్రభుత్వం అంటే స్వచ్చంధ దుకాణం కాదని, పాలన అంటే ప్రజల దృష్టి మళ్లించే అరాచకం కాదని కేజ్రీవాల్ పేరు ప్రస్తావించకుండా హెచ్చరించారు. దేశాన్ని అవినీతి క్యాన్సర్‌లా కబళిస్తోందని, అయితే దానిపై పోరాటం పేరుతో ఇష్టారీతిన ప్రవర్తించడం కూడా సరికాదన్నారు.

ప్రణబ్ ముఖర్జీ జాతిజనులకు 65వ గణతంత్ర దినోత్సవ సందేశం అందించారు. సీనియర్ రాజకీయవేత్త అయిన ప్రణబ్, ఇటీవల దేశీయ వ్యవస్థలను కుదిపేసిన అనేక పరిణామాలను తన ప్రసంగంలో స్పృశించారు. అవినీతి, ఎన్నికలు, యువత ఆకాంక్షలు, ప్రజాస్వామ్య భవిష్యత్తు, సుస్థిర ప్రభుత్వ వ్యవస్థలు తదితర అంశాలపై కొన్నిసార్లు నర్మగర్భంగా, మరికొన్ని సందర్బాల్లో లోతైన వ్యాఖ్యలు చేశారు.

Pranab Mukherjee

అదే సమంయలో జనాకర్షణ ముసుగులో ఆరాచక ధోరణులను ప్రోత్సహించడం పాలనకు ప్రత్యామ్నాయం కాదంటూ కేజ్రీవాల్‌కు చురక వేశారు. అవినీతిని ఇప్పటికైనా కట్టడి చేయకపోతే జనాగ్రహం బద్దలు అవుతుందని పాలకులకు హెచ్చరిక చేశారు. అస్థిర ప్రభుత్వాల వల్ల ఆర్థిక వృద్ధిని సాధించడంగానీ, సామాజిక పురోగతిని నమోదు చేయడం గానీ సాధ్యం కాదంటూ 2014 ఎన్నికల్లోనైనా సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలన్న ఆకాంక్షని వ్యక్తం చేశారు.

యువశక్తులను ప్రోత్సహించి పగ్గాలు వారికి అందిస్తేనే నవభారతం, స్వర్ణ భారతం, శక్తిమంత భారతం సాధ్యమవుతాయని తెగేచి చెప్పారు. సాయుధ దళాలు, పారా మిలిటరీ బలగాలు, అంతర్గత భద్రతా దళాల సిబ్బందికి ధన్యవాదులు తెలుపుతూ ప్రారంభమైన ఆయన ప్రసంగం, రాజకీయ, సామాజిక, ఆర్థిక, నైతికాంశాలను స్పృశిస్తూ ఆసాంతం గంభీరంగా సాగింది. అవినీతి మన ప్రజాస్వామిక విలువలను, జాతి మూలాలను బలహీనపరిచే కేన్సర్ పుండు అన్నారు.

విలువైన జాతీయ వనరులు వృథా కావడాన్ని కళ్లారా తిలకిస్తూ, అవినీతికి బాధితులు కావడం వల్లనే ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందని, ప్రభుత్వాలు ఈ లోపాలను సరిదిద్దకలేకపోతే ఓటర్లు ప్రభుత్వాలను అధికారం నుంచి తొలగిస్తారన్నారు. అభూతకల్పనలు ప్రజల ముందుంచేందు ఎన్నికలు ఎవరికీ లైసెన్సు ఇవ్వలేదని, అమలుపరచగల హామీలు మాత్రమే ఇవ్వాలని, ప్రభుత్వం అనేది ఒక దాతృత్వ సంస్థ కాదన్నారు.

జనాకర్షణ ముసుగులో అరాచక ధోరణులను ప్రోత్సహించడం పాలనకు ప్రత్యామ్నాయం కాదని హితవు పలుకారు. తప్పుడు హామీల వల్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని, అధికారంలో ఉన్నవారే దానికి గురి అవుతారన్నారు. సరికొత్త అవకాశాలు అందించేదిగా చరిత్రలో 2014 నిలుస్తుందని, జాతిని నిరాశ, నిస్పృహల నుండి వెలుపలికి తీసుకువచ్చి సుసంపన్నతవైపు అడుగులు వేసే దిశగా మన జాతీయత, జాతీయ లక్ష్యాలను తిరిగి రచించుకోవాలన్నారు.

స్థిరమైన ప్రభుత్వం లేకుండా ఇలాంటి అవకాశం కల్పించడం సాధ్యం కాదని, ఈ ఏడాది మనం లోక్‌సభకు 16వ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించుకోబోతున్నామన్నారు. సామాజిక, ఆర్థిక పురోగతిలో నత్తనడక సమర్థనీయం కాదని, అవి రేసు గుర్రాల్లా పరుగులు తీయాలని, తమ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందంటే ఆశావహులైన భారతీయ యువత ఏ మాత్రం క్షమించదన్నారు. అలా జరగరాదంటే యువతకు చక్కని ఉద్యోగవకాశాలు కల్పించాలన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాను మరోసారి మీ ముందుకు వచ్చే నాటికి దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ప్రధానం కాదని, ఎవరు విజయం సాధించినా దేశ సుస్థిరత, ఆత్మగౌరవం, అభివృద్ధికి తిరుగులేని కట్టుబాటు ప్రకటించాల్సి ఉంటుందని, మనం ఎదుర్కొంటున్న సమస్యలు రాత్రికి రాత్రే అదృశ్యం కావన్నారు. సమీప చరిత్రలో అస్థిరతకు కారణమైన ఒక సంక్షుభిత ప్రపంచంలో మనం జీవిస్తున్నామని, ప్రజల మధ్య సామరస్యాన్ని, దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు మతవాద, ఉగ్రవాద శక్తులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయని, అయినా వారు ఎప్పూడూ విజయం సాధించలేరన్నారు.

తెలంగాణ బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో రాష్ట్రపతి తన గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. 'అభివృద్ధి ఫలాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించాలంటే చిన్న రాష్ట్రాలు అవసరమా అన్న అంశంపై భావోద్వేగాలు చెలరేగుతున్నాయి. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నా, అది ప్రజాస్వామ్య నియమాల పరిధికే పరిమితం కావాలి' అని ఆకాంక్షించారు.

విభజించి పాలించే రాజకీయాలతో భారత ఉపఖండం ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకుందని, అందరం ఒక్కటిగా కలిసి కృషి చేయకపోతే ఒరిగేదేమీ ఉండదన్నారు. 'చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి, అదే ప్రజాస్వామ్య దేశానికి శ్రీరామరక్ష. ఆరోగ్యకరమైన అభిప్రాయభేదాలు అనారోగ్యకరమైన రాజకీయజగడాలకు దారితీయకూడని పేర్కొన్నారు.

English summary
President Pranab Mukherjee today made a veiled attack on Delhi Chief Minister Arvind Kejriwal's street protests saying the government is not a "charity shop" and "populist anarchy" cannot be a substitute for governance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X