ఓ పట్టాన అర్థం కాని బీజేపీ పాలిటిక్స్
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. కొత్తగా ఆవిర్భవించిన టీవీకే సైతం పూర్తిస్థాయిలో ఈ ఎన్నికల బరిలో దిగబోతోండటం వల్ల త్రిముఖ పోటీ ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో తమిళ రాజకీయాల్లో ఈక్వేషన్లు మళ్లీ మారే అవకాశాలు కనిపిస్తోన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి హస్తిన పర్యటన చేపట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. 40 నిమిషాలకు పైగా వారిద్దరి ఈ భేటీ కొనసాగింది.

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ పొత్తు కుదుర్చుకోవాలనే అంశం వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలో రీఎంట్రీ ఇవ్వడానికి పళనిస్వామి ఆసక్తి చూపించాని తెలుస్తోంది. ఈపీఎస్ ఢిల్లీ పర్యటనకు ముందు.. అన్నాడీఎంకే- బీజేపీ మధ్య రాష్ట్రస్థాయిలో చర్చలు సైతం జరిగాయి. బీజేపీ సానుకూల సంకేతాలను కూడా పంపించింది.
బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి వ్యక్తిగతంగా ఈపీఎస్‌కు ఇష్టం లేకపోయినప్పటికీ- రాజకీయ మనుగడ కోసం తప్పనిసరి పరిస్థితులు, బీజేపీ హైకమాండ్ నుండి వస్తోన్న ఒత్తిళ్ల కారణంగా పళనిస్వామి తన మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించగలిగితే అన్నాడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు లాంఛనప్రాయమే అవుతుందంటూ ఈపీఎస్ సన్నిహిత నాయకుడొకరు చెప్పడం దీనికి నిదర్శనం.
2016లో జయలలిత కన్నుమూయడం, పార్టీలో చీలిక ఏర్పడిన పరిస్థితుల్లో ఏఐఏడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో అన్నాడీఎంకే ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలపై బీజేపీ ప్రభావం ఉందనే విమర్శలు సైతం వ్యక్తం అయ్యాయి.
తమిళనాడులో 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించిన అనంతరం ఈక్వేషన్లు మారిపోయాయి. బీజేపీకి దూరం అయ్యారు ఈపీఎస్. 2023 సెప్టెంబర్‌లో పొత్తు తెంచుకున్నారు. 2024 నాటి లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ డీఎంకే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ఏఐఏడీఎంకేను నిలువనీడ లేకుండా చేసినట్టయింది.

అదే సమయంల డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ దక్షిణాదిలో బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకుడిగా ఎదగడంతో ఈపీఎస్ పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే కొన్ని షరతులకు ఆ పార్టీ అధిష్ఠానం అంగీకరించాల్సి ఉంటుందని అంటున్నారు.
అన్నాడీఎంకే పెట్టిన షరతుల్లో ముఖ్యమైనది- బీజేపీతో పొత్తు వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఓ ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం. ప్రస్తుతం బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైకు ఇస్తోన్న ప్రాధాన్యతను తగ్గించడం. ఈ ఉద్దేశంతోనే స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అన్నా డీఎంకే భావిస్తోంది.
అలాగే- టీటీవీ దినకరన్, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వంటి పార్టీ తిరుగుబాటుదారులతో బీజేపీ ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని కూడా అన్నాడీఎంకే కోరుతోంది. ఈ షరతులు పెట్టిన విషయాన్ని బీజేపీ సీనియర్ నాయకుడొకరు ధృవీకరించారు కూడా. అన్నామలై ప్రాధాన్యతను తగ్గించడానకి పార్టీ అధిష్ఠానం అంగీకరించకపోవచ్చని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications