ఈ పథకంలో చేరిన రైతులకు నెలకు రూ.3వేలు
వయసు పైబడిన చిన్న, సన్నకారు రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (Pradhan Mantri Kisan Maan Dhan Yojana- PMKMY)' పేరుతో ఒక సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేస్తోంది. 60 సంవత్సరాల వయసు నిండిన రైతులంతా పింఛన్ పొందొచ్చు. నెలకు రూ.3 వేలు అందుతుంది.
వీరంతా అర్హులే:18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రైతులు అర్హులు. దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భూ రికార్డుల్లో పేర్లు ఉండాలి. అలాగే సాగుచేసే భూమి 2 హెక్టార్ల వరకు ఉండాలి. చిన్న, సన్నకారు రైతులంతా ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకోవచ్చు. 60 సంవత్సరాల వయసు నిండిన తర్వాతే పింఛను అందుతుంది.

వీరు అర్హులు కాదు:నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్), ఈఎస్‌ఐ స్కీమ్, ఈపీఎఫ్‌వో పరిధిలో ఉన్నవారితోపాటు ఇతర చట్టబద్ధమైన సామాజిక భద్రత పథకాల పరిధిలో ఉన్నవారు, జాతీయ పెన్షన్ పథకాన్ని ఎంచుకున్న రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వర్గాల వారు అనర్హులు.
60 సంవత్సరాల వరకు ప్రీమియం:60 సంవత్సరాల వయసు నిండేవరకు రైతులు ప్రీమియం కట్టాలి. 60 దాటగానే ప్రతినెలా రూ.3 వేలు అందుతాయి. రైతు చెల్లించిన మేరకు ప్రభుత్వం కూడా తనవంతుగా బీమా కంపెనీకి చెల్లిస్తుంది. 18 సంవత్సరాలవారికి ప్రీమియం రూ.55 ఉంది. ఏటా వయసును బట్టి రూ.3 నుంచి రూ.10 వరకు పెరుగుతుంది. 40 సంవత్సరాల వయసున్నవారికి రూ.200 ప్రీమియం ఉంది. ఒకవేళ పథకంలో చేరిన రైతు మరణిస్తే అతని భార్య ఈ పథకాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంది. వయసు నిండిన తర్వాత అన్నదాత మరణిస్తే అతని భార్యకు సగం పింఛను చెల్లిస్తారు. కనీసం 5 సంవత్సరాలు రైతు తన ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కామన్ సర్వీస్ సెంటర్లలో తమపేర్లను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. రైతు ఫొటో, నివాస ధ్రువీకరణ, ఆదాయం, వయసు నిర్ధారణ, సాగు భూమి, ఆధార్ తదితర పత్రాలను అందజేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications