ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ముఖ్య అతిథి: నాగపూర్ చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ
నాగ్‌పూర్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాత్రి నాగ్‌పూర్‌కు చేరుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ తృతీయ వార్షిక శిక్షణ కార్యక్రమం ముగిసిన సందర్భంగా గురువారం ఆ సంస్థ నిర్వహించబోయే కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ శ్రేణులను ఉద్దేశించి ప్రణబ్ ప్రసంగించనున్నారు. కాగా, నాగ్‌పూర్ విమానాశ్రయంలో ప్రణబ్‌కు ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. పుష్పగుచ్ఛాలు అందించి.. కార్యకర్తల కవాతుతో ఆయనకు స్వాగతం తెలిపారు.

ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, ప్రణబ్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు విజ్ఞప్తి చేశారు. లేఖలు కూడా రాశారు.
అయితే, 'నేను చెప్పదలచుకున్నది నాగపూర్‌లోనే చెబుతాను' అని ప్రణబ్ ఇప్పటికే తేల్చిచెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో ప్రణబ్ గురువారం సుమారు గంటసేపు ముఖాముఖీ సంభాషించి, అనంతరం సంఘ్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications