
పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ప్రశాంత్ కిశోర్ సలహా..!!
పాట్నా: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన సొంత రాష్ట్రం బిహార్‌లో ప్రారంభించిన పాదయాత్ర కొనసాగుతోంది. జన్ సురాజ్ పేరుతో ఆయన బిహార్‌ను చుట్టేస్తోన్నారు. 3,500 కిలోమీటర్ల మేర ఆయన కాలినడకన నడవనున్నారు. బిహార్‌లో మార్పును తీసుకుని రావాలనే లక్ష్యంతో అడుగు వేస్తోన్నారు. దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న బిహార్‌ను బాగు చేయాల్సిన బాధ్యతను తాను స్వీకరించానని చెబుతోన్నారు.

పాదయాత్రపై విమర్శలు
అట్టడుగు స్థాయి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకుని వస్తానని, ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదుగుతానని ప్రశాంత్ కిశోర్ ధీమా వ్యక్తం చేస్తోన్నారు. ఈ పాదయాత్రపై అన్ని రాజకీయ పార్టీల దృష్టి పడింది. రోజూ దీనిపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా అందరూ స్పందిస్తోన్నారు. పార్ట్ టైమ్ పొలిటీషియన్ చేపట్టిన పాదయాత్రగా అభివర్ణిస్తోన్నారు. భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోన్నారంటూ మండిపడుతున్నారు.

బీజేపీ
తాజాగా మరోసారి నితీష్ కుమార్ తనదైన శైలిలో ప్రశాంత్ కిశోర్‌పై విమర్శలు చేశారు. బీజేపీ అజెండాను మోసుకుని తిరుగుతోన్నాడంటూ ధ్వజమెత్తారు. ఇలాంటి పాదయాత్రలు చాలా చూశామని వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిశోర్ ఏం మాట్లాడుతున్నాడనేది ఆయన ఇష్టానికే వదిలేస్తోన్నామని, ఎలాంటి ప్రకటనలైనా చేసే అధికారం ఆయనకు ఉందని చెప్పారు. అలాగని ఇష్టానుసారంగా విమర్శలు, ఆరోపణలు చేస్తే సహించబోమనీ నితీష్ కుమార్ హెచ్చరించారు.

నో ఆఫర్..
మళ్లీ జనతాదళ్ (యునైటెడ్)లో చేరితే కీలక పదవి ఇస్తానంటూ ప్రశాంత్ కిశోర్.. చెప్పడాన్ని నితీష్ కుమార్ తోసిపుచ్చారు. అది అబద్ధమని స్పష్టం చేశారు. అలాంటి ఆఫర్ ఏదీ తాను ఇవ్వలేదని వివరించారు. ఇలాంటి అవాస్తవ ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోన్నాడని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో లేనిపోని అపోహలను కల్పించేలా వ్యహరిస్తోన్నారని, ఇలాంటి ప్రకటనల పట్ల ఉపేక్షించబోమని అన్నారు.

కుటుంబ సభ్యుడిగా ఉండేవాడు..
ప్రశాంత్ కిశోర్ పాదయాత్రపై తాను స్పందించాల్సిన అవసరం లేదని, ఆయనతో తమకెలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలు లేవని నితీష్ కుమార్ తేల్చి చెప్పారు. ఇదివరకు ప్రశాంత్ కిశోర్.. తమ పార్టీలో ఉండేవాడనేది నిజమేనని, తనతో కలిసి ఇంట్లో సభ్యుడిగా వ్యవహరించేవాడని వ్యాఖ్యానించారు నితీష్ కుమార్. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలంటూ ప్రశాంత్ కిశోర్ నాలుగైదు సంవత్సరాల కిందటే సలహా ఇచ్చాడని, దాన్ని పాటించలేదని చెప్పారు.

ఎలాంటి అజెండా లేని పొలిటీషియన్..
ప్రశాంత్ కిశోర్ వంటి పార్ట్‌టైమ్, బిజినెస్ మైండ్ పొలిటీషియన్‌కు ఎలాంటి అజెండా లేదని విమర్శించారు. బీజేపీ కోసం పని చేస్తోన్నాడని, తనకంటూ సొంత అజెండాను రూపొందించుకోలేకపోతోన్నాడని నితీష్ కుమార్ మండిపడ్డారు. గతంలో ఆయన బీజేపీ కోసం పని చేశాడని, ఇప్పుడు సొంత ఇంటికి వెళ్లాడని, దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని అన్నారు. తాను మళ్లీ జేడీయూలో కలుస్తానంటూ ఆయనే స్వయంగా తనను కలిశాడని, ద్వంద్వ వైఖరి తెలిసే- పార్టీలో చేర్చుకోలేదని నితీష్ కుమార్ తేల్చి చెప్పారు.